హోమ్

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పర నింద , ఆత్మ స్తుతి

                         ఏలిన వారు చిద్విలాసం గా టివి చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఏలిన వారి ఆశ్రిత పక్షపతాన్ని, కుంభకోణాల్నీ ఎండగడుతూ, గతం లో తమ పాలన లో దేశం ఎంత వెలిగిపోయిందో చెప్పుకుపోతున్నాడు. పక్కగా నిలబడ్డ భృత్యుడికి అనుమానం వచ్చింది, ఏలిన వారు ప్రతిపక్షం వాడు బండబూతులు తిడుతుంటే ఎలా ఆస్వాదిస్తూ  చూస్తున్నారా అని.అదే అడిగాడు. ఆయన మళ్ళీ ఒక చిరు నవ్వు విసిరి, "పిచ్చివాడా వాడు తిడుతున్నది నన్ను కాదు, రాజకీయాన్ని" అన్నాడు. అర్ధం కానట్లు చూశాడు. ఏలిన వారు అనుగ్రహ భాషణం మొదలు పెట్టారు, "నేడు పాలకుడికి ఉండవలసిన లక్షణాలలో పరనింద, ఆత్మస్తుతి ముఖ్యమైనవి. వీటి గురించి మహాభారతం లో చెప్పబడిన కథ నీకు చెబుతా విను".                          
 కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఒకానొక రోజు కర్ణుడు ధర్మ రాజుని తీవ్రం గా గాయ పరిచి, తల్లి కిచ్చిన మాట ప్రకారం చంపకుండా వదిలేశాడు. ధర్మరాజు అవమాన భారం తో శిబిరానికి చేరాడు. అన్న గారు అర్ధంతరం గా శిబిరానికి వచ్చాడని తెలిసి, అర్జునుడు అన్న గారిని కలిసి విషయం అడిగాడు.  ధర్మరాజు కోపోద్రిక్తుడై "అర్జునా కర్ణుని చే తీవ్ర గాయాల పాలై  వచ్చాను. గతం లో నీవు చేసిన ప్రతిజ్ఞ కి కట్టుబడి వెంటనే కర్ణుని సంహరించు లేదా నీ గాండీవాన్ని వేరెవరికైనా ఇచ్చి నువ్వు తప్పుకో" అన్నాడు. వెంటనే అర్జునుడు కత్తి తీశాడు.అప్పుడు శ్రీకృష్ణుడు "ఇక్కడెవరూ శత్రువులు లేరే, ఎవరి పైకి ఈ కత్తి" అన్నాడు.అందుకు కిరీటి "కృష్ణా నన్నూ నా గాండీవాన్నీ వేరుచేసి ఎవరైనా మాట్లాడినా, గాండీవాన్నిఎవరైనా గేలి చేసినా వారిని చంపుతానని మనసు లోనే నేను ఒక శపధం చేసుకున్నాను. అందుకు ఇప్పుడు అన్నగారిని చంపబోతున్నాను " అన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుని శాంతపరచి ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. పెద్దలు,పూజ్యులు అయిన వారిని అకారణంగా నిందించిన మాత్రమున వారిని హతమార్చినట్లే. కనుక సత్య ధర్మ పరాయణుడైన ధర్మజుని నిందించి నీ శపధం నేరవేర్చుకోమన్నాడు. అర్జునుడు అన్నగారు చేసిన మంచి పనులన్నిటినీ చెడు పనులుగా చిత్రీకరించి అన్నగారిని దూషించాడు.                         
వెంటనే అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ ఏమయిందన్నాడు. "ఎవరి వలన మేము ఇంతవారమైనామో,ఎవరి సత్య ధర్మ నిష్ఠలు భావితరాలకు ఆదర్శప్రాయమో అట్టి అన్నగారిని నిందించి నేను ధర్మము తప్పాను. నా బ్రతుకు వ్యర్ధం, అందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను" అన్నాడు. అప్పుడు కృష్ణుడు మరొక ధర్మసూక్ష్మం చెప్పాడు. "ఆత్మ స్తుతి ఆత్మహత్యా సదృశం కనుక నీవు చేయని మంచి పనులని నీవే చేసినట్లుగా భావించి నిన్ను నువ్వే స్తుతించుకో" మన్నాడు.                
కాబట్టి ఎలాంటి కుంభకోణం అయినా, సమస్య అయినా మనం చేయవలసిందల్లా ప్రతిపక్షం వాడిని తిట్టడం, మన పాలనని మనమే పొగుడుకోవడం, తద్వారా సమస్యని పక్క దారి పట్టించడం. భృత్యుడు అయోమయంగా చూశాడు. "మరి ప్రతిపక్షం వాడూ ఆ పనే చేస్తున్నాడు కదా" అన్నాడు. 
ఏలిన వారు ధర్మ సూక్ష్మం చెప్పసాగారు.  అందరూ ఆత్మ స్తుతి వల్లనో పరనింద వల్లనో ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు మిగిలింది రాజకీయమే. రాజకీయానికి వ్యక్తులతో ప్రమేయం లేదు. మరి ప్రజలో అన్నాడు. ఏలిన వారి నవ్వు, ధర్మో రక్షతి రక్షిత: అన్నట్లుగా తోచింది. భృత్యుడి మొహం విప్పారింది. 

4, జులై 2012, బుధవారం

రాముడు, కోతిమూక, దూకుడు

మన ప్రజల కష్టాలన్నిటికీ రాముడే కారణం. ఋజువు ఇదిగో..

రావణ సంహారం తర్వాత , రాజ్యాధికారం వచ్చాక, రాముడి తో అడవి నుంచి వచ్చిన వానర సేన కి రాముడు ఏదైనా కోరుకొమ్మని వరం ఇచ్చాడట. రాముని వైభవం చూసి ఆ వానర సేన 'రామా! మాకునూ మీవలే రాజ్యాధికారం చెలాయించాలని వున్నదీ' అని కోరుకున్నవి. కలియుగం లో మీ కోరిక నెరవేరుతుందని రాముడు వరం ఇచ్చాడట.

ఆ కట్టు కథ కట్ చేస్తే...
ఆనాడు రామునికి సాయం చేసిన ఆ కోతిమూక, పదవుల కోసం యధాశక్తి పార్టీలు దూకుతూ ఇప్పుడు ప్రజలకి ద్రోహం చేస్తోంది. 

మిగతా దూకుళ్ళని తక్కువ చెయ్యటం కాదు కానీ.. మన రాష్ట్రం లో నాకు బాగా నచ్చిన 3 దూకుళ్ళు:

1) సినిమాలో బంగీ జంప్ చేసిన మెగాస్టార్ రాజకీయాల్లోనూ చెయ్యగలనని నిరూపించాడు తన ఎమ్మెల్యే ల తో సహా కాంగ్రెస్ లోకి దూకి. ప్రజలు కోరుకున్నారట ఈయన దూకాడట.

2) ఎం వి మైసూరా రెడ్డి: కాంగ్రెస్ లో వుండగా బిగ్ బాస్ వివాదం తో చంద్రబాబు ని ఇరుకున పెట్టి, అదే చంద్రబాబు పార్టీ లోకి జంప్ చేసి తాజాగా లక్ష కోట్ల లెక్కలు చెప్పి జగన్ పై రాళ్ళు రువ్వి వెంటనే అదే జగన్ పార్టీలోకి జంప్ చేసారు. మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడో?

3) దేవేందర్ గౌడ్: ఎన్.టి.ఆర్ నీడలో పెరిగి, బాబు తో జత కట్టి నంబర్ టూ గా చలామణీ అయ్యి, తెలంగాణా ప్రజలు కోరుకున్నారని చారిత్రాత్మకం గా ఒక పార్టీ పెట్టి,  మళ్ళీ  ప్రజలు కోరుకున్నారని చారిత్రాత్మకం గా ప్రజారాజ్యం లో విలీనం చేసి, భంగ పడి మళ్ళీ ప్రజల కోరిక మేరకు , రాష్ట్ర చారిత్రాత్మక అవసరాల కోసం బాబు పంచన చేరాడు. పదవి కోసం ఎన్ని చారిత్రాత్మక దూకుళ్ళ కైనా సిద్ధం.

 అసలు ఈ దూకుళ్ళ కి అంతే లేదు. ఈ దూకుడు రాయుళ్ళకి (రాణులకి కూడ) గురు తుల్యులు ఎవరైనా వున్నారు అంటే అది దేవిలాల్, చంద్రశేఖర్ లాంటి జాతీయ నాయకులే అని చెప్పాలి. దేవిలాల్ స్టైలే వేరు. యాభై  ఏళ్ళలో ఈయన దూకిన పార్టీ లు 11. ఈయనే రాజకీయ మెగాస్టార్ .

 1. కాంగ్రెస్
 2. ఫ్రోగ్రెస్సివ్ ఇండిపెండెన్స్ ఫార్టీ
 3. కాంగ్రెస్
 4. హర్యానా కాంగ్రెస్
 5. కాంగ్రెస్
 6. కిసాన్ సంఘర్ష్ సమితి
 7. భారతీయ లోక్ దళ్,
 8. జనతా పార్టీ
 9. హర్యానా సంఘర్ష్ సమితి
 10. దళిత్ మజ్దూర్ కిసాన్ పార్టీ
 11. జనతా దళ్

ఉన్నత పదవులు పొందటానికి దూకడం రాజకీయాల లోనే కాదు, ఉద్యోగాలలోనూ వుంది. అసలు గిరీశం తప్పు చెప్పాడు, పొగ తాగని వాడు కాదు, తెగ దూకని వాడు దున్నపోతై పుట్టున్ అనిఉండాల్సింది..

'అంతా నువ్వే చేసావు' అని రాముడి ఫోటో వైపు చూస్తూ అనాలని ఎవరికైనా అనిపిస్తే అది మీ తప్పు కాదు.. 


29, జూన్ 2012, శుక్రవారం

జఫ్ఫానందం


జఫ్ఫా, జఫ్ఫా, జఫ్ఫా ఏమిటీ జఫ్ఫా????
    ఈ మధ్య యూట్యూబ్ లో సంచలనం రేపిన బ్రహ్మి సినిమా జఫ్ఫా ట్రైలర్ చూసాకా, చాలా సినిమాలలో బ్రహ్మి వాడిన ఈ పదం అంటే ఏమిటో తెలుసుకోవాలని నా లాంటి పామరులే కాదు, ఎందరో మేధావులు కూడా ప్రయత్నిస్తున్నారు.
    ఉదాహరణకి ఈ టివి స్టార్ మహిళ లో పార్టిసిపెంట్స్ ని ఆడిగింది సుమ, ఎవ్వరూ సరైన సమధానం చెప్పలేక పోయారు.
    ఇంతకీ ఇది ఒక నామవాచకమా? సర్వనామామా? అసలు తెలుగు పదమేనా? ఇలాంటి ఎన్నో తుంటరి ప్రశ్నలు నన్ను చుట్టు ముట్టాయి. అప్పుడే గూగుల్ జఫ్ఫా ని అడిగా.. ఆ సమాధానాల సమాహారమే  జఫ్ఫానందం...
ప్రపంచం లో పలు రకాల జఫ్ఫాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిలో మొదటి జఫ్ఫా ఇజ్రాయెల్ లో ఉన్న ఒక పురాతన పట్టణం. వివరాలకి ఇక్కడ నొక్కండి.

రెండో జఫ్ఫా .. కేకులు.
మూడో జఫ్ఫా ..ఒక పండు

నాలుగో జఫ్ఫా ..ఒక సినిమా

ఇదీ ఒక జఫ్ఫా నే.. ఇంకా పలు రకాల జఫ్ఫాలు ఉన్నాయని గూగుల్ జఫ్ఫా ఉవాచ.. ఎన్ని జఫ్ఫాలున్నా ఈ జఫ్ఫా కి సాటిరావు....


 గమనిక: ఈ టపా లో వాడిన బొమ్మలు అన్నీ గూగుల్ జఫ్ఫా సౌజన్యం తో..


18, జూన్ 2012, సోమవారం

లెజెబ్రిటీ

                       "నేను టివి లో రాబోతున్నానోచ్" అని వసంత ఫేసుబుక్ లో పెట్టిన స్టేటస్ మెసేజి కి డెబ్భై లైకులూ, ముప్ఫై  కామెంట్లూ చ్చాయి. వసంత "దంచి కొట్టు దుమ్ము లేపు" రియాలిటీ షో లో టివి లో కనబడబోతోంది. ఆ పోటీ లో పాల్గొనేవాళ్ళూ, జడ్జీలూ జుట్టూ జుట్టూ పట్టుకొని కొట్టుకోవడాలూ, బండబూతులు తిట్టుకోవడాలూ, పరస్పరం చేసుకునే ఛాలెంజీ లు వెరసి ఆ  షో మొదలైన వెయ్యి వారాల్లోనే నంబర్ వన్ షో అయ్యింది. అసలు ఆ  ప్రోగ్రాము యాంకర్ చీత్కార్ అన్నయ్య యాంకరింగే పెద్ద హైలైటు. ప్రసారం అయ్యే రోజు తెలియగానే మళ్ళీ ఫేసుబుక్ లో అప్ డేట్ చేసింది. మళ్ళీ చాలా  కామెంట్లూ , లైకులూనూ.అందరూ తెగ ఎదురుచూస్తున్నారు ప్రోగ్రాము కోసం. వసంత ఆ టైముకి కరెంటు కోత ఉండకుండా చూడమని కోటి దేవుళ్ళకి మొక్కింది.
                      ప్రోగ్రాము చూసిన వాళ్ళందరూ తెగ మెచ్చేసుకున్నారు వసంతని. ఆడియన్సు లో కూర్చున్న వసంత సర్కస్ ఫీట్ల  లాంటి డాన్సులు చూసి ఇచ్చిన హావభావాలు అందరినీ కట్టిపడేశాయి. మొత్తం మూడు సెకండ్లు వున్న తన వీడియో ని యూట్యూబ్ లో పెట్టింది. అర గంట లో ఇరవై మంది చూసిన ఆ  వీడియో ఒక  పెద్ద సంచలనం  రేపుతుందని  చీత్కార్  అన్నయ్య  కూడా ఊహించలేదు.ఇలాంటి వార్తలే   ప్రసారం చేసే టివి 29 వాళ్ళు, ఆ వీడియో ని రోజంతా చూపించడం తో పాటు వసంత  సెలెబ్రిటీ నో లెజెండో తేల్చుకోలేక  లెజెబ్రిటీ అని తీర్మానించేసారు.
                  "రేపు టివి 29 లో నా ఇంటర్వ్యూ యోచ్" అని వసంత పెట్టిన స్టేటస్ మెసేజి కి మళ్ళీ విపరీతమైన లైకులూ, కామెంట్లూనూ.

11, మే 2012, శుక్రవారం

జోగినాధం కథలు:రుబ్బు-చీదు బడి (1)


జోగినాధం ఒక పేద కుటుంబం లో పుట్టి, పల్లెటూళ్ళో పెరిగాడు. జోగినాధం తండ్రి రమేషు ఎన్నో వ్యయప్రయాసల కి ఓర్చి జోగినాధాన్ని రుబ్బు-చీదు బడి లో చేర్చాడు. ఆ బడి కాన్సెప్టు అలాంటిది మరి. అక్కడ పాఠాలని ముందుగా రుబ్బించి, పరీక్షల ముందు పిల్లల తలలకి పట్టిస్తారు. సరీగ్గా పరీక్షల టైము కి పిల్లలు ఆన్సరు పేపరు మీద పాఠాలన్నీ చీదేస్తే మంచి మార్కులు వస్తాయి. ఈ విధానం లో రుబ్బు-చీదు బడి వాళ్ళు అప్పటికే మంచి పేరు సంపాదించారు. 
                 జోగి ఆరో తరగతిలో ఉండగా ఈ బళ్ళో చేరాడు. ఈ పెనుమార్పు అతడిని చాలా ప్రభావితం చేసింది. ఒక రోజు తనలాంటి మరి కొందరిని పోగేసి, ఆ ఊరి పెద్ద అయిన దత్తుడు గారి ఇంటి ముందున్న పెద్ద కుంకుడు చెట్టు దగ్గరికి కోతి కొమ్మచ్చి ఆడడానికి వెళ్ళాడు. కొంత సేపు ఆడుకున్నాక, దత్తుడు గారు వస్తున్నారని ఎవరో అరిచారు. ఆయన అంటే ఊళ్ళో అందరికి భయం, గౌరవమూ నూ. తోటి పిల్లలందరూ ఎటు వాళ్ళు అటు పారిపోయారు. అదే ప్రయత్నం చేయబోయిన జోగి మాత్రం చెట్టు కొమ్మ మీద నుంచి దబ్బున క్రింద, తర్వాత దత్తుడి గారి కంట్లోనూ పడ్డాడు.రుబ్బు-చీదు యూనిఫాం వేసుకున్న పిల్లలు ఆ ఊళ్ళో ఆడడం నిషేధం. దత్తుడు గారు అటుగా వస్తున్న సాంఘికం మాష్టారుకి ఫిర్యాదు చేసేరు.మర్నాడు సాంఘికం గారు  వేసిన అ సాంఘిక శిక్ష వల్లో, పదిమంది పిల్లలని చెడగొడుతున్నాడన్న పేరు వల్లో, జోగి ఇక ఆటల జోలికి పోకూడదని అనుకున్నాడు.
                  ఆ బళ్ళో కుదురుకోవడానికి జోగి కి చాలా రోజులు పట్టింది. అంతకు ముందు చదివిన దుంపల బళ్ళో డ్రిల్లు అనీ, ఆటలు అనీ, తోటపని అనీ పిల్లలని చదువుతో పాటు ఇతర విషయాలలో కూడా చురుగ్గా వుండేలా చేసేవారు. ముఖ్యం గా నెలకి ఒక సారి క్లాసు లో జరిగే క్విజ్  లో జోగి ఎప్పుడూ బాగా సమాధానాలు చెప్పేవాడు. మరి ఈ బళ్ళో ఆట మైదానం లేదు కనుక ఆటలు నిషేధం. మొక్కలు, చెట్లూ వగైరాలు లేవు కనుక ఇక ఉదయం ఏడు గంటల నుంచి  సాయంత్రం ఐదు గంటల వరకు రుబ్బుడు కార్యక్రమం వుండేది. సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది వరకు రీడింగు క్లాసులు.వేసవి శెలవుల్లో అయినా తాత గారి   ఊరు వెళ్ళినప్పుడు ఆడుకోవచ్చు అనుకున్నాడు.కానీ మరుసటి సంవత్సరం ఏడో తరగతి పరీక్షలు కాబట్టి, శెలవలు రెండు వారాలే ఇచ్చారు. మిగతా రోజుల్లో స్పెషలు ప్రెపరేషను వుంది.తాతగారి ఊళ్ళో చిన్నప్పుడు త న బాబాయి దగ్గర జోగి క్రికెట్ నేర్చుకున్నాడు. ఈ సారి ఊరి జట్టూ తరపున మండలం స్థాయి పోటీలకి వెళ్ళాడు. అతనికి తనలో ఉన్న గొప్ప బౌలర్ అప్పుడే కనిపించాడు. ఎలా అయినా మన ఊరు వెళ్ళాక కూడా ఈ ఆట ఆడాలి అనుకున్నాడు.ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఊరికి దూరం గా ఉన్న దుంపల బడి పిల్లలతో ఆడేవాడు.ఊరి చివరి సంత కి ప్రతీ గురువారం వచ్చే సాంఘికం గారికి మళ్ళీ దొరికి పోయేడు.ఈ సారి సాంఘికం గారు పెద్ద లెక్చరు దంచారు.తను బాగా చదువుతాడనీ, ఇలా పనికిమాలిన విషయాలని దూరంగా పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టి పదోక్లాసు లో గొప్ప మార్కులు తెచ్చుకోవాలనీ, రుబ్బు-చీదు పరువు ప్రతిష్టలు పెంచాలనీ చెప్పేరు. జోగి లో ఆయన కి కాబోయే ఐఏఎస్ ఆఫీసరు కనిపిచాడు. జోగి ని ఎలా అయినా సరైన దారిలో పెడదామని ఆయన జోగి మీద నిఘా కూడా పెట్టారు. ఓ ఆదివారం సాయంత్రం క్రికెట్  ఆడడం కోసం వెళుతున్న జోగి ఆయనకి దొరికిపోయాడు. ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నా, మరోసారి గ్రౌండు లోనే దొరికి పోయాడు. క్రికెట్  వల్ల ఉపయోగం లేదని, ఇంగ్లీషు సార్ తో ఛెస్ ఆడితే బుర్ర పదునై ఏడో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి ఉపయోగపడుతుందని చెప్పటమే కాక, ఇంగ్లీషు సార్ తో ఒప్పందం కూడా చేసేరు ప్రతీ ఆదివారం జోగి తో ఛెస్ ఆడాలని. అలా దేశం ఒక మంచి బౌలర్ ని కోల్పోవడానికి తన వంతు సాయం అందించారు సాంఘికం గారు. క్రికెట్ తీవ్రవాదం కన్నా ఘోరమైన నేరం (ఈ బళ్ళో) అని గ్రహించిన జోగి, చేసేదేమీ లేక ఛెస్ ఆడడం నేర్చుకున్నాడు.మిగతాది మరో టపాలో ...

7, మే 2012, సోమవారం

ఇల్లు ఇరుకటం ఆలి మరుకటం

తెలుగు లో ఉన్న జాతీయాలని మన తరం వారు ఎంత వరకు అర్ధం చేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను పొరబాటుగా అర్ధం చేసుకున్న ఈ జాతీయాన్ని తలచుకోగానే ఒక సంఘటన గుర్తు వస్తుంది. 
1992 లో విడుదలైన చిత్రం భళారే విచిత్రం సినిమా లో బ్రహ్మచారులం కర్మ వీరులం అనే పాట వుంది. అందులో ఈ జాతీయాన్ని వాడారు. అప్పటి నా వయసు కి, అనుభవానికీ, తెలివితేటలకీ నేను 'పట్నాలలో ఇళ్ళు ఇరుకుగా వుంటాయనీ, ఆలి కోతిలాగా (మర్కటం) వుంటుంద 'నీ కవి భావం అనుకున్నాను. కామెడీ సినిమా కనుక అప్పటికి ఆ భావం సబబుగానే తోచింది.ఇది జరిగిన చాలా ఏళ్ళ తరువాత అంటే నాకు పెళ్ళైన కొత్తలో మేము బెంగళూరు లో వుండేవాళ్ళం. ఒక సారి మా బాబాయి ఏదో పని మీద బెంగళూరు వచ్చారు. మాటల మధ్య నేను ఇక్కడ ఇళ్ళు ఇంతే బాబాయ్ ఇల్లు ఇరకటం ఆలి మర్కటం లాగా ఇరుకు ఇల్లు అన్నాను. 
అందుకు ఆయన నవ్వి, దాని అర్ధం అది కాదురా అబ్బాయ్, చెబుతా విను అని, 
ఇలా చెప్పారు. ఇంటికి ఇరు కటం అంటే రెండు గుమ్మాలు ఉండాలనీ (ముందు ఒకటి వెనుక ఒకటి), ఆలి మరు కటం అంటే ఇల్లాలు తలుపు చాటున వుండి ఇతరులతో మాట్లాడాలనీ దీని అర్ధం. అప్పటి సమాజం లో అది సబబు గానే వుండేదేమో. ఇదండీ కథ.    

2, మే 2012, బుధవారం

సుభోజనుని కథ


              ఎప్పటి లాగే భోజనాలు ముగిసాక శౌనకాది మహా మునులు సూత మునితో ముచ్చట్లు పెట్టారు. అలవాటు ప్రకారం సూత ముని ఏదో ఒక కథ చెప్పబోయాడు. ఆంతలో ఒక యువ ముని లేచి, మహానుభావా మీరు ఎన్నో విషయాలు, విశేషాలు, వ్రతాల గురించి  ఎన్నో ఏళ్ళుగా మాకు చెబుతున్నారు అలాగే ఈ రోజు నా సందేహాన్ని మీరు నివృత్తి చేయవలసింది అని ప్రార్థించాడు.
సందేహం:               చాలామంది మానవులకి ఏదైన పని మీద బయటకి పోవుటకు ముందు, దీర్ఘశంక తీర్చుకునే అలవాటు వుంది. ఇది ఒక్కొక్కసారి వారికి చాలా ఆటంకం గా పరిణమిస్తోంది. దీని వల్ల ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి ఆలస్యం గా వెళుతున్నారు.అసలు ఈ ఆలవాటు ఎలా వచ్చింది?దీని కష్టాల నుండి మానవులకి విముక్తి వున్నదా? సూత ముని ఒక చిరునవ్వు నవ్వి, నాయనా! విను.                   
పూర్వము సుభోజనుడనే రాజు ఉండేవాడు. అతడు సకల విద్యా పారంగతుడు మరియు తపోధనుడు. కానీ పేరు కి తగినట్లుగానే భోజన ప్రియుడు. ఎంత ప్రయత్నము చేసిననూ జిహ్వ చాపల్యము మాత్రం అతనిని వీడినది కాదు. ముందు చేసిన తపములన్నిటి కంటే గొప్ప తపస్సు చేసి దీనిని వదిలించు కొనవలెనని సంకల్పము చేసి, తపము ఆరంభిచెను.కొన్ని ఏండ్లు గడిచినవి, ఇంతలో ఈ వార్త విన్న మహేంద్రునికి పదవీ గండ భయం పట్టుకున్నది. ఎప్పటివలెనే ఎవరో ఒక గంధర్వ కన్నె ను పంపి తపోభంగం కావించ సంకల్పించెను. అప్పుడు నారదుడు "మహేంద్రా! సింహానికీ, ఎలుకకీ ఒకే బోను వాడటం సబబు కాదు. సుభోజనుడు తపోసంపన్నుడు, అతడి తపోభంగానికి అతని బలహీనతనే వాడుకొమ్మ"ని సలహా ఇచ్చాడు.                       
మహేంద్రుడు వెంటనే పంచ భక్ష్య పరమాన్నాలు, నవ కాయ పిండి వంటలు చేయించమని  పురమాయించాడు.  భోజనం పూర్తి అయిన వెంటనే మళ్ళీ సుభోజనుడు తపస్సు ప్రారంభిస్తేనో? అనే సందేహం అతనికి కలిగింది. ఆందుకని ఆ వండే వంటల్లో అతి విరేచనకారి అయిన ఒక మూలిక కలపమని అదేశించాడు. ఈ మూలిక వల్ల  సుభోజనుడు మృత్యు ముఖం చూస్తాడు మళ్ళీ మహేంద్ర పదవి కోసం తపస్సు చేయటానికి సాహసించడు, ఇదీ మహేంద్రుని యోచన. అనుకున్న పధకం ప్రకారం అన్నీ తయారు చేయించి ఒక గంధర్వుని చే పంపించాడు. మహేంద్రుని పధకం పారింది. సుభోజనుడు ఆ ఆహారాన్ని సేవించాడు. వెను వెంటనే విరేచనాలు ప్రారంభమయ్యాయి. నీరసించి పోయాడు. దీనితో కోపోద్రిక్తుడై, "ఓయీ గంధర్వా! మానవ జన్మ లోని బలహీనతను ఉపయోగించుకొని నా తపస్సుకి భంగం కలిగించావు కనుక నీవునూ మానవ జన్మ నెత్తి, ఇదే విరేచనము చే నీకూ, నీ వంశజులకూ సకల  కార్యములకు భంగము కలుగుచూ , నానా విధములగు కష్టములను అనుభవించెదరు గాక" అని శపించాడు.   యువ ముని ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఏమైనా సందేహమా నాయనా అన్నాడు సూత ముని. "శాపవిముక్తి మార్గం ఏదైనా వున్నదా స్వామీ?" "లేకేమి నయనా! ఈ కథ విన్న, చదివిన ఆ గంధర్వుని వంశజులు అందరికీ శాపవిముక్తి కలుగుతుంది" యువ ముని కళ్ళు జ్ఞానం తో వెలిగాయి. "మా వంశ మూల పురుషుని వివరాలు తెలిపినందుకు, చాలా సంతోషం గా వుంది మహానుభావా!".

ఈ కథ కేవలం కల్పితం అని వేరే చెప్పాల్సిన అవసరం లేకపొయినా, ఈ కథ కల్పితం మరియు హాస్యం కోసం మాత్రమే వ్రాయబడింది. ఎవరి మనో భావాలనీ కించపరచాలని కాదు అని నా మనవి.20, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఎలుక తెచ్చిన తంటా

భారతీయ రైలు అంటే నాకు చాలా ఇష్టం. ఫస్టు క్లాసు లో ప్రయాణం చెయ్యాలని ఎప్పటినుంచో కోరిక కూడా. ఒకసారి ఆ కోరిక నేరవేరటమే కాక గుర్తు కూడా వుంది పోయింది. ఎలా అంటే...
రైలు బయలు దేరింది. విశాలమైన  బెర్తుల మీద  మేము పక్కలు ఏర్పాటు చేసుకుని, నిద్ర కి ఉపక్రమించాం. అంతలో  నా శ్రీమతి కెవ్వున కేక వేసింది, ఏమిటా అని ఆరా తీస్తే ఎలుక వచ్చింది అన్నది. ఈ గొడవకి అయిదు  ఏళ్ళ  మా సుపుత్రుడు కూడా నిద్ర లేచాడు. ఫస్టు ఎసి లోకి ఎలుక రావడం ఏమిటి అని నేను ఆమె మాటలని కొట్టిపారేసాను. అంతలోనే ఎలుక మళ్ళీ దర్శనం ఇచ్చింది. కూపే అంతా కలియ తిరుగుతూ ప్రళయ తాండవం చేసింది. నేను వెళ్ళి కోచ్ అటెండెంటు ని పిలిచుకుని వచ్చా. 'ఆయితే అది ఇక్కడ దూరింది అన్న మాట' అంటూ అతను వచ్చి వేట మొదలు పెట్టాడు. ఎలుక చాలా పోరాడి, చివరకు అతగాడికి మస్కా కొట్టింది.  అతను దుప్పటి ఒకటి కూపే తలుపు కి అడ్డు పెట్టి, 'ఇంక రాదులే సారూ' అని తప్పుకున్నాడు. వేరే బెర్తులు కూడా ఖాళీ లేక పొవడం తో మేము ఆ కూపే లోనే వుండాల్సి వచ్చింది. ఇక తెల్లవార్లూ ఎలుక తో యుద్ధం సాగుతూనే వుంది. డబ్బూ పొయే శనీ పట్టే అన్నట్లు, మా ప్రయాణం లో ఆ రాత్రి అంతా జాగారమే.
ఈ తతంగం అంతా చూస్తూ మా సుపుత్రుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాడు. వాడిక్కూడా ఈ ప్రయాణం బాగా గుర్తు వుంటుంది. ఇంత జరిగినా కూడా భారతీయ రైలు అంటే నాకు ఇష్టం మాత్రం తగ్గలేదు.

5, ఏప్రిల్ 2012, గురువారం

ఆన్నమయ్య తమాషా

             దర్శకేంద్రుని అన్నమయ్య చిత్రం చూసాక చాలా మంది నా లాంటి వాళ్ళకి, అన్నమయ్య గురించి తెలిసింది. సంతోషించాల్సిన విషయమే. దానికి సంబంధిచిన ఒక తమషా ఏమిటంటే..
              ఆన్నమయ్య గురించి భావితరాల కి తెలియాలనే సదుద్దేశ్యం తో మన ప్రభుత్వం వారు తెలుగు వాచకం లో ఒక పాఠ్యాంశంగా అన్నమయ్య ని చేర్చారు. పాఠం  చివర ఉపాధ్యాయునికి ఇచ్చిన సూచనల్లో, మరికొన్ని అన్నమయ్య పాటలు సేకరించి పిల్లలకు నేర్పమని ఉంది. ఆందుకని ఒక ఉపాధ్యాయుడు రెండు పాటలు నేర్పించారు తన క్లాసు పిల్లలకి. చివరగా పిల్లల్లొ ఎవరికైనా ఇంక వేరే పాటలు తెలుసేమో కనుక్కుందామని ఆరా తీసారు..అప్పుడు ఒక బుడుగు నాకు ఒక పాట తెలుసు సార్ అని , ఇదిగో ఈ పాట అందుకున్నాడు..
                అస్మదీయ మగటిమి, తస్మదీయ తకధిమి.. 
అది సినిమా పాట అని ఆయన ఎంత చెప్పినా ఆ బుడుగు కన్విన్సు కాలేదట.

4, ఏప్రిల్ 2012, బుధవారం

రంగుల మాయాబజార్

                    నా చిన్నప్పటి  నుంచి మాయాబజార్ సినిమా చాలా సార్లు చూసాను. కానీ రెండు ఏళ్ళ క్రితం రంగుల్లో చూసిన మాయాబజార్ మాత్రం మరపు రానిది. పాత సంగతే అయినా, ఇప్పటికీ మనసు లో తాజా గా వున్నజ్ఞాపకం ఇది.2004 లో మొఘుల్-ఎ-ఆజం రంగులలో వచ్చినప్పుడు నేను చూసాను కానీ అంతకు ముందు ఆ సినిమా నేను చూడక పోవడం వల్ల నాకు అంత గొప్పగా అనిపించలేదు (ఆ చిత్రాన్ని కించ పరచడం నా ఉద్దేశ్యం కాదు.). కానీ చిన్నప్పటినుంచి ఎన్నో సార్లు నలుపు తెలుపుల్లో చూసిన మాయాబజార్, తెలుగు సినిమా స్క్రీన్ ప్లే కే తల మానికమైన మాయాబజార్,  ని రంగుల్లో చూడడం ఒక మధురానుభూతి ని ఇచ్చింది. ఈ చిత్ర రాజాన్ని నిర్మించిన విజయా వారు చిరస్మరణీయులు. 53 ఏళ్ళ తరువాత రంగుల్లో కి మారుస్తారని అప్పటికి వాళ్ళకి తెలియక పోయినా, రంగుల్లో కూడా అద్భుతం గా ఉండేలా తీర్చిదిద్దారు ఈ సినిమాని.
                    హాల్లో  కి వెళ్ళే ముందు, అంతా ఆ తరం వాళ్ళే వుంటారేమో అనుకున్నాను కాని హాలంతా పిల్లలు, యువతరం తో నే నిండి వుంది. మహానటి సావిత్రి, రేలంగి, యస్వీఆర్ పాత్రలు  తెర పై ప్రవేశించగానే జనం లేచి చప్పట్లు కొట్టారు. ఏ గ్రాఫిక్సూ లేని ఆ రోజుల్లో చేసిన గిమ్మిక్కులన్నీ చూడడానికి చాల బాగున్నాయి. మా కుటుంబం లోని పెద్దలంతా ఆ రోజులని తలచుకుని మురిసి పోయారు మరి పిల్లలైతే ఒకటే కేరింతలు ఘటోత్కచుని మాయాజాలం చూసి. అలనాటి చిత్రం లోని కొన్ని సన్నివేశాలు ఇందు లో లేవని తెలిసింది (రీలు కొంత మేర పాడవ్వడం వలన అట). కానీ ఈ తరానికి సరిపోయేలా రెండున్నర గంటలకి కుదించడం కూడా బాగుంది అది కూడా ఎక్కడా కధ లో లోటు తెలియకుండా. అక్కినేని , సావిత్రి ల జంట బహు ముచ్చట గా , టీనేజర్స్ లా వుంది అని కొందరు అనుకోవటం కూడా నా చెవుల పడింది.             
                    అలనాటి గొప్ప సినిమాలు ఇంకా కొన్ని రంగుల్లో వస్తే ఎంత బాగుంటుంది!!
31, మార్చి 2012, శనివారం

ముందు మాట

అనగనగా ఒక ఊరు ...పేరు ఏదైతేనేం ..సర్కారీ బడికి ఆరు , దవాఖానకు పదహారు కిలోమీటర్ల దూరం గా ఉన్న పల్లెటూరు ..అక్కడ ఏడో తరగతి వరకూ కాళ్ళకి చెప్పులు లేకుండానే బడికి వెళ్ళిన ఓ కుర్రాడు..ఒకసారి వాళ్ళ అమ్మకి బాగా జ్వరం వస్తే ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు, కాగితాలు అమ్మి మందు కొన్నాడు..అలాంటి కుర్రాడు బాగా చదివి ఇప్పుడు లండన్ లో వున్నాడు. వయసు, చదువు, సంపాదన పెరిగినా అతని మనసు మాత్రం ఇంకా ఆ ఊళ్లోనే , ఆ బాల్యం తోనే అక్కడే వుండిపోయింది..వాడి మనసు లోని భావాలే ఈ అనగనగా ఓ కుర్రాడు...