హోమ్

4, డిసెంబర్ 2013, బుధవారం

మీసాల మాసం - నవంబరు నెల

Meesam
నూనూగు మీసాల నూత్న యవ్వనమున అంటూ శ్రీనాధ కవి గురించి చెప్పేటప్పుడూ,
నూనూగు మీసాలోడు అని హీరోయిను పాడుకునేటప్పుడూ,
మూతి మీద మీసం, ఒంట్లో పౌరుషం వుంటే అని మన హీరోదాత్తులు అనేటప్పుడూ
రొయ్యకీ వుంది మీసం అని ఎవరైనా వెటకారమాడినప్పుడూ
పాత గోల్ మాల్ లో ఉత్పల్ దత్తు ‘మీసం' లేని మగాళ్ళని ద్వేషించినప్పుడూ మీసాన్ని ఎన్నో రకాలుగా నేను అర్ధం చేసుకున్నాను.

ఆయితే మీసాలు పెంచడానికి ఒక అర్ధాన్నీ, పరమార్ధాన్నీ ఇచ్చేది ఈ మీసాల మాసం.

మనం తెలుగు లో నవంబరు నెల గా పిలుచుకునే ఈ మాసాన్ని మీసాల కోసం మొవెంబర్ గా మార్చి పలకడం కొన్నేళ్ళ క్రిందటే మొదలైన సంప్రదాయం. మొవెంబర్ ఫౌండేషన్ వారి ద్వారా కొన్ని దేశాలలో మగవారి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు ఈ నెలలో జరగడం వల్ల ఇలా మార్చి పిలుస్తారు.

ప్రపంచవ్యాప్తం గా ఎయిడ్సు, బ్రెస్ట్ కేన్సర్ లాంటి వాటి గురిoచి అవగాహన పెంచడానికి చాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రిటన్ లో యేటా అనేకమంది మగవారు ప్రొస్టేటు మరియు టెస్టిక్యులార్ కేన్సర్ ల బారిన పడి మరణిస్తున్నారు. ఈ వ్యాధులు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తం గా చాలా మందిని బలి తీసుకుంటున్నాయి. వీటి పై అవగాహన పెంచడానికి, ఇంకా వీటి మీద జరిగే పరిశోధనలకి ఊతమివ్వడానికి ప్రతి ఏడూ నవంబరు నెల లో ఈ దేశం లో చాలా మంది మగవారు మీసాలు పెంచుతారు.

అప్పటికే గడ్డం మీసం గుబురుగా పెంచే అలవాటు ఉన్నవాళ్ళు కూడా, నవంబరు ఒకటో తారీకున వాటిని నున్నగా గీసేసి మళ్ళీ పెంచుతారు, అంతకు ముందు మీసం పెంచే అలవాటు లేనివాళ్ళు ఈ నెల లో మాత్రం మీసం పెంచుతారు.
వ్యాధుల పట్ల అవగాహన్ పెంచటమే ప్రధాన ఉద్దేశ్యమే అయినా, రకరకాల ఆకారాల్లో మీసం పెంచటం, విరాళాలు సేకరించటం పరిపాటి.

ఇక్కడి ఆడవారు కూడా తమకు చేతనైన రీతిలో ఈ మహా యజ్ఞానికి సాయం చేస్తారు. నకిలీ మీసాలు అతికించుకునో, లేదా మీసాలు పెన్నుతో గీసుకునో, లేదా విరాళాలు ఇచ్చో ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూంటారు.

ఒక నవంబరు నెల లోనే కాకుండా, ఈ వ్యాధుల పై ప్రపంచ వ్యాప్తం గా అవగాహన పెంచాల్సిన బాధ్యత మన అందరి పైనా వుంది.
కొన్ని ఉపయోగపడే లింకులు ఇక్కడ
http://howtogrowamoustache.com/what-is-movember/
http://prostatecanceruk.org/
http://en.wikipedia.org/wiki/Movember
http://www.movember.org/
http://www.ted.com/talks/adam_garone_healthier_men_one_moustache_at_a_time.html