హోమ్

29, ఆగస్టు 2023, మంగళవారం

తెలుగుభాషాదినోత్సవం

 

"జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశభాషలందు తెలుగు లెస్స

జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద

మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె"

(శ్రీనాధకవిసార్వభౌముని క్రీడాభిరామము నుండి)

అర్థము: అన్ని భాషలకు ఆద్యము సంస్కృతము. కానీ దేశభాషలందు తెలుగు ఉన్నతమైనది. తల్లిని మించిన సౌభాగ్య సంపద కల్గిన బిడ్డ ఎంతో గొప్పది కదా.


దేశభాషలందు తెలుగు లెస్స అన్న మొదటి మహానుభావుడు మన కవిసార్వభౌముడు శ్రీనాధుడు. ఆ వాస్తవాన్ని బలపరచినవాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయుడు. 

ఆయన వ్రాసిన పద్యమేమిటంటే :

"తెలుగదేల యన్న దేశమ్ము తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొల్వ ఎరుగనా బాసాడి

దేశభాషలందు తెలుగు లెస్స"

అయ్యా! తెలుగే ఎందుకంటే నా పాలిత ప్రాంతమే తెలుగు. నేను ఈ ఆంధ్ర భూమికి నేతను.సకల సామంత రాజులతో నేనొక్కడినే మాటలాడి తెలుసుకొన్నదేమిటంటే దేశ భాషలన్నిటిలో తెలుగు శ్రేష్టమైనది.


8, ఆగస్టు 2023, మంగళవారం

పిచ్చి కి లోకం దాసోహం!!

ఆ రోజు ఆదివారం. అప్పుడే జానెడు పొద్దెక్కింది. సుబ్బారావు నిద్ర లేచి చుట్టూ చూసాడు. 

మామూలుగా సుబ్బారావు ఆదివారం బారెడు పొద్దెక్కితే గానీ లేవడు. కానీ ఇటీవల సెల్ఫీ విషయం లో వివాదం జరిగాక, సుందరి చేసిన వికటాట్టహాసం గుర్తు వచ్చి నిద్ర సరిగా పట్టట్లేదు సుబ్బూకి.

సుందరి జాడ లేదు ఇంట్లో. ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళిందబ్బా అనుకుంటూ ఇల్లంతా కలియ తిరిగాడు. ఎక్కడా కనపడక పోయే సరికి, ఫోన్ చేద్దామని సెల్ చూస్తే ఓ మెసేజి.

"సుబ్బూ, ఈ సెలబ్రిటీ బతుకు చాలా కష్టం. ఫ్యాన్స్ కోసం పొద్దున్నే లేచి, పార్క్ కెళ్తున్నా, ఇన్‌స్టా లో మంచి పక్షుల ఫోటో లు పెడతానని మాటిచ్చా"

ఆకలి వేసి పొట్ట తడుముకున్నాడు. మెసేజి ఇంకా వుంది.

"నాకు తెలుసు నీకు ఆక లౌతుందని ... ఏదో ఒకటి వండి ఉంచు"

ఛఛా!  దీని సెలబ్రిటీ పిచ్చ పాడు గానూ, సండే కూడా నేనే వండాలన్న మాట. పైకే అనుకున్నాడు.

కానీ ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో సుందరి ని ఏమీ అనే ధైర్యం లేదు.

ఆ రోజు సోమ వారం ..

మళ్ళీ అదే సీన్. సుబ్బు లేచి చుట్టూ చూసాడు. దీని తిక్క తగలెయ్య.. వీక్ డే కూడా ఫ్యాన్సేనా ..అనుకుంటూ చుట్టూ వెతికాడు.

అంతలో కిచెన్ లో వండుతూ కనపడింది.

ఇవాళెవడో చచ్చాడన్నమాటే అనుకుంటూ సుందరి దగ్గరకు వచ్చి, పళ్ళికిలిస్తూ .."ఏంటి పొద్దున్నే కష్టపడుతున్నావ్?" అన్నాడు.

"నువ్వే చూడు" అంది సుందరి చిలిపిగా.

ఒక్కసారి అదిరిపడ్డాడు. విచిత్రమైన వంటేదో కనపడుతోంది.

"ఏమిటీ ఘోరం" అందామనుకున్నాడు కానీ తమాయించుకుని,

"సుందూ నేనంటే నీకెంత ప్రేమ, నా కోసం ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్ వండుతున్నావా?" అన్నాడు లేని పోని భావాలేవో ఒలికిస్తూ. ఈ మధ్యనే ఇలా నటించడం అలవాటు చేసుకున్నాడు.

"ఇదా. మంగోలియన్ సలాడ్, నీ హెల్త్ కి మంచిదనీ" అంది సుందరి.

"కానీ నేనలాంటివి తినను కదా" అందామనుకున్నాడు కానీ 'హింస సెంటిమెంటు సమపాళ్ళలో' మాట గుర్తు వచ్చి,

"నా ఆరోగ్యం పట్ల నీకెంత కేర్" అన్నాడు.

"కేరా పాడా, నీ ఫామిలీ పేక్ - సిక్స్ పేక్ అవ్వాలని, రెడీ అయ్యి రా, ఇద్దరం కలిసి .." అంటుండగానే, సుబ్బూ రెడీ అవడానికి వెళ్ళిపోయాడు సంతోషంగా.

రెడీ అయ్యి తిరిగొచ్చి చూస్తే, సుందూ బ్రేక్‌ఫాస్ట్ నీట్ గా ఎరేంజ్ చేసి ఫోటో లు, సెల్ఫీలూ తీస్తోంది. ఇక ఇది ఇప్పట్లో తేలే యవ్వారం కాదనుకొని, ఆఫీస్ కి బయలు దేరుతుండగా సుందూ అంది.

"సుబ్బూ ఇవాళ టిఫినేం వండావ్?"

"అదేంటి నువ్వు చేసావ్ గా"

"అయ్యో పిచ్చి సుబ్బూ. ఇది తినడానికి కాదమ్మా. ఊరికే ఇన్‌స్టా లో, ఫేస్‌బుక్ లో పెట్టడానికి. సెలబ్రిటీ లు ఇలాంటివే తింటారని ఫ్యాన్స్ అనుకోవాలి."

ఇంకా ఫొటో లు తీస్తూనే అంది.

"నీకేం తెలుసు బాబూ మా సెలెబ్రిటీ ల కష్టాలు, ఇవాళ్టికి ఎదో ఒకటి వండేద్దూ"

"ఈ సోషల్‌నెట్‌వర్క్ ని కనిపెట్టిన వాడిని కత్తితో నడ్డి మీద షూట్ చేసి పారెయ్యాలి" కసిగా మనసులోనే అనుకుంటూ కిచెన్ లోకి పోయాడు.

ఇంకో రోజు ...

"ఈ మధ్యేంటి వంటింట్లో ఎక్కువగా ఉంటున్నావ్? .  నాకోసం ఏమైనా స్పెషల్స్ వండుతున్నావా?" ఆనందంగా అడిగాడు సుబ్బూ.

"నా సెలబ్రిటీ హోదాకి తగ్గట్టు రోజుకో కొత్త వంట చేసి, ఇన్‌స్టా లో నూ, ఫేస్‌బుక్ లో నూ పెడతానని ఇప్పుడే ఎఫ్ బి లైవ్ లో ఫ్యాన్స్‌కి ప్రామిస్ చేసా" అంది బిజీ గా ఏదో చేస్తూ.

"నీ సెలబ్రిటీ పిచ్చి కాదు గానీ, ఇదొక్క మంచి పని చేస్తున్నావ్.."

"సుబ్బూ. అన్నట్టు ఈ ఫోటో చూడు, ఇన్‌స్టా లో దుమ్ము లేపడానికి మొన్న సండే నాడు తీసా."

"ఏంటే ఇదీ. రెట్ట వేస్తున్న కాకి లా ఉందే?"

"ఎంత బావుందో కదా. ఫోన్ ఫుల్ ఛార్జింగు లో పెట్టు, ఇది అప్‌లోడయ్యాక వచ్చే కమెంట్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఛార్జింగుండాలి కదా" అంది మురిసిపోతూ.

"ఇంతకీ ఏం వండుతున్నావ్?" అడిగాడు ఉత్సాహంగా.

"అరటి పండు తొక్కా, కొబ్బరి పీచూ, జీడిపప్పు తో బిస్కెట్స్ చేసా. పీచు పదార్దం, కార్బోహైడ్రేట్ ఇంకా ప్రోటీన్ సమ పాళ్ళలో ఉండే పౌష్టికాహారం. ఇదిగో రుచి చూడు, ఎంత బాగుందో" అదేదో హిందీ ఎడ్వర్టైజ్మెంట్ తెలుగు డబ్బింగులో అన్నట్టుగా అంది చిన్నగా సిగ్గుపడుతూ, నవ్వుతూ.

"దీని కంటే ఫోటో నే బెటరు." ఫోటో ని చూస్తూ అనుకున్నాడు మనసులో.

"ఇందాకా తెలియలేదు గానీ, నేషనల్ జాగ్రఫీ వాడు కూడా ఇంత అందం గా రెట్టవేస్తున్న కాకి ఫోటో తీసి ఉండడు. నీకు ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇచ్చే దాకా నిరాహార దీక్ష చేద్దామనుకుంటున్నా" అన్నాడు ఆవేశం, తెలివి కలగలిపి.

"నేనంటే నీకెంత ప్రేమ సుబ్బూ. అలాగే చేద్దువుగానీ, ముందు ఇది తిని అప్పుడు చెయ్యి." అంది అమాయకత్వం నటిస్తూ.

తినక తప్పలేదు సుబ్బూ కి.

ఇలాంటి చిత్ర విచిత్రాల మధ్య ఇంకో రోజు .

సుందరికి ఈ సోషల్‌మీడియా పిచ్చ తగ్గించాలంటే డాక్టర్ సలహా అవసరం అని నిశ్చయించుకున్నాడు సుబ్బూ. 

కానీ తనకీ విషయం చెపితే ఎలా రియాక్టవుతుందో నని భయం కూడా వేసింది.

అందుకే...

"సుందూ నువ్వు సెలబ్రిటీ అయిపోయిన ఆనందంలో నాకు నిద్ర పట్టక, బుర్ర పని చెయ్యక, మతిపోయి డిప్రెషన్ లో కెళ్ళేట్టున్నాను. ఒక సారి డాక్టర్ దగ్గరికెళ్దామా?" అడిగాడు దీనంగా.

"నా వల్ల నీకెంత బాధ సుబ్బూ, ఈ వీధిలోనే మన ఫాలోయరు ఒకాయన, మాంచి పిచ్చి డాక్టరుట, ఉన్నాడు పద ఈవెనింగ్ వెళ్దాం."అంది బాధగా.

"సుబ్బూ ఈ డాక్టరుకి ఎన్ని డిగ్రీలో చూసావా." అంది సంబరంగా.

DR ఫలానా, FBBS,TWTR,WTSP,INST,TKTK,YT

బోర్డు చూసి అదిరి పడ్డాడు సుబ్బూ. ఏదో తేడా కొడుతోందే అనుకున్నాడు.

"సుందూ ప్రాబ్లెం నాకే కదా నేను వెళ్ళి మాట్లాడి రానా" డ్రామా కంటిన్యూ చేసాడు సుబ్బూ.

ఆ డాక్టరుకి సుందూ విషయాలన్నీ చెప్పి, సుందరి కి కౌన్సిలింగు ఇవ్వమని వేడుకొని, కొంత సేపటికి బయటకి వచ్చాడు, డాక్టర్ తో సహా.

"పెద్ద సమస్యేం కాదండి, కొన్ని టిప్స్ పాటిస్తే తగ్గి పోతుంది." అన్నాడు డాక్టర్ సుందరి తో.

సుబ్బూ వైపు తిరిగి మళ్ళీ అన్నాడు.

"మీ విషయం నాకు సుందరి గారు ఆల్రెడీ చెప్పారు. నేనీవిడ పోస్టులన్నీ ఫాలో అవుతుంటాను. ఈ మధ్య చేసిన కొబ్బరి పీచు బిస్కట్ కూడా మా ఆవిడకి చేసి పెట్టాను. ఎంత బావుందో" 

పరవశించి పోయింది సుందరి.

"దీన్ని సోషలోఫోబియా అంటారు. " అన్నాడు డాక్టర్ కంటిన్యూ చేస్తూ.

"అంటే?"

"అంటే, ఈ వ్యాధి ఉన్నవాళ్ళు సోషల్ నెట్‌వర్క్ సైట్స్ చూస్తే చిరాకు పడిపోతారు. ఎప్పుడూ మనుషులతో డైరెక్టుగా మాట్లాడాలనుకుంటారు. వాట్సాప్, ఎఫ్ బి,ట్విట్టర్, ఇన్‌స్టా లాంటివి మాత్రమే వాడాలనే స్పృహ ఉండదు. ఇలాంటి వాళ్ళు నేటి సమాజానికి ఎంత ప్రమాదకరమో నా యూట్యూబ్ చానెల్ లో వివరం గా చెప్పాను. చూడండి."

"ఈయనేంటి నన్ను పేషంటనుకుంటున్నాడు" సుబ్బూ కి అంతా అయోమయం గా ఉంది.

సుబ్బూ కన్‌ఫ్యూజన్ గమనించి "రోజూ పొద్దున్న లేస్తూనే ఒక గంట ,రాత్రి పడుకునేముందు ఒక గంట ఫేస్‌బుక్, ట్విట్టర్ , వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం లు చూడండి. అలాగే రోజు కి మూడు సార్లు,  అర డజను సెల్ఫీ లు చొప్పున తీసుకోవాలి..కనీసం వంద వాట్సాప్ గ్రూపుల్లో చేరి, రోజూ గుడ్‌మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజీ లు పెట్టాలి. కొన్నాళ్ళకి ఈ ఫోబియా తగ్గి పోతుంది. నన్నూ, సుందరి గారినీ ట్యాగ్ చెయ్యడం మరచిపోకండి. అలానే నా ఛానెల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని, గంట కూడా కొట్టండి" ఒక ఫ్లో లో చెప్పుకు పోతున్నాడు.

"జబ్బు నాకు కాదు డాక్టర్ సుందరి కి అని చెప్పాను కదా." అన్నాడు సుబ్బూ జంకుతూ.

"ఆవిడకేమీ లేదండీ, ఇప్పుడందరూ ఇలానే ఉన్నారు. మీరే తేడా గా బిహేవ్ చేస్తున్నారు. అందుకని మీకే ఈ ట్రీట్‌మెంటు."

వీడు నీ ఫాలోయరు అని చెప్పినప్పుడే అర్ధం చేసుకో వాల్సింది. వీడూ సోషల్‌మీడియా పిచ్చోడేనా.

హతవిధీ!!

ఇప్పుడు నేనెక్కడికి పోవాలిరా మస్కూ, మార్కూ ..!! 


20, మార్చి 2022, ఆదివారం

భళారే స్వీయ చిత్రమా!

 జరిగిన విచిత్రాన్ని సుందరి కి చెబితే, థ్రిల్లు ఫీలవుతుందని మురిసి పోతూ ఇల్లు చేరాడు సుబ్బారావ్. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ మోగుతూ ఉండే కామెడీ చానల్ కూడా మూగ బోయింది. బుజ్జిగాడు ఆడుకోవడానికి బయటికెళ్ళినట్లున్నాడు.

సుందరి తన కళ్ళకి అరుంధతి లో అఘోరా లా కనపడుతోంది. అంతేకాదు "ఒదల సుబ్బారావ్ నిన్నొదల" అంటునట్లు ఇల్లంతా ఎకో వినబడుతోంది. ఈ మధ్య సుందరి కోపంగా వున్నప్పుడల్లా, అఘోరా మాటలు ఎకో లో వినబడడం అలవాటైపోయింది సుబ్బూ కి.
ఉపద్రవం ముంచుకు రాక ముందే సుందరి ని కూల్ చెయ్యాలనుకుంటూ, సుందూ ఇవాళేమైందో తెలిస్తే, భలే నవ్వు కుంటావ్ అని మొదలెట్టేశాడు, ఆమె వైపు కూడా చూడకుండానే.
ఆఫీసు నుండి కింద మన కార్ పార్క్ దాకా వచ్చానా, వెంఠనే ఒక ఇంపార్టెంటు ఈమెయిల్- బాసు నుంచి. ఆ మెయిలు చదువుతూ, మన ఫ్లోరుకొచ్చి,
హ్హి హ్హి హ్హి అని లేని నవ్వు తెచ్చుకుంటూ, మన ఇల్లనుకుని పక్కింటికెళ్ళిపోయా. అలవాటు ప్రకారం, సోఫా లో కూలబడి 'ఏమోయ్ టీ 'అనగానే, ఆవిడా పాపం, ఫేస్బుక్ చూసుకుంటూ టీ తెచ్చి ఇచ్చేసింది. మెయిలు కి రిప్లై ఇస్తూ, ఒక్క సిప్పు తాగానో లేదో, ఛీ యాక్ థూ అనిపించి కప్పు లోకి తొంగి చూసా. వాళ్ళాయన గ్రీన్ టీ తాగుతాడనుకుంటా. అప్పుడు తెలిసింది అది మనిల్లు కాదని. హ్హహ్హా హ్హా. భలేఉంది కదూ. ఆవిడా అంతే పాపం నవ్వుకుంటూ ఫేస్బుక్ చూస్తూ ఉండిపోయింది.
భలే తమాషా గా ఉంది కదూ? అంటూ సుందరి వైపు చూసాడు. ఇప్పుడు తను అఘోరా ని చంపబోతున్న అరుంధతి లా కనిపించింది.
ఇది కూడానా అంది, తన ఫోన్ చూపిస్తూ.
అదిరిపడ్డాడు సుబ్బు. ఆ పక్కింటావిడ తను కప్పు లోకి తొంగి చూస్తున్నప్పుడు, ఒక సెల్ఫీ తీసి, "టీ టైం విత్ మై మోస్ట్ లవ్డ్ ఒన్" అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసింది.
"ఎంత సెల్ఫీ అయితే మాత్రం, పక్కన ఎవరున్నారో చూసుకోనక్కర్లా? ఫేస్బుక్, సెల్ఫీ ఉంటే ఇంకేమీ పట్టదా? ఏం మనిషో? ఇప్పుడు నాకేమైనా జరిగితే ఎవరిది రెస్పా్న్సిబిలిటీ?" పైకే అనేసుకున్నాడు సుబ్బు.
పోస్ట్ చేసి పట్టుమని పది నిమిషాలు కూడా కాలేదు, ఇంకేమీ పని లేనట్లు జనమంతా విపరీతమైన కామెంట్లూ, లైకులూ ను.
కామేశం గాడి భార్య చీనాంబరి "లోల్" అనీ, సుబ్బు అక్క "నైస్ పిక్, చూడ ముచ్చటైన జంట" అని కామెంటి, సుందరినీ, సుబ్బూనీ ట్యాగ్ కూడా చేసింది. కొందరు ఫ్రెండ్సు "కంగ్రాచులేషన్స్" అని కూడా పెట్టేశారు.
"ఫ్రెండ్సు కి మన గురించి పూర్తిగా తెలియదనుకుందాం, మీ అక్క కేమైంది, చూడ ముచ్చటైన జంట అని పెట్టింది. ఆవిడగారికి నేనంటే ఎందుకింత పగ." అంది సుందరి నిష్ఠూరంగా.
"సుందూ మా అక్క కి తొందరెక్కువ అని నీకు తెలుసు గా, ఏదో పొరపాటున పెట్టుంటుంది" అన్నాడు సర్దిచెబుతూ.
"ఏదో మెయిలు కి రిప్లై ఇస్తూ .. అలా జరిగి పోయింది. ఇప్పుడే పక్కింటావిడ ని ఈ పోస్టు తీసెయ్యమని చెబుతా" అన్నాడు మళ్ళీ తనే.
"ఆ ముచ్చటా తీరింది, తన కెప్పుడూ ఇన్ని లైకులూ , కామెంట్లూ రాలేదుట, అందుకని తియ్యనని చెప్పేసింది" అంది సుందరి ఇంకా కోపంగా.
"సారీ సుందూ ఇంకెప్పుడూ ఫోన్ చూస్తూ ఇంటికి రాను సరేనా" అన్నాడు సుబ్బు.
"అంతే నీకు, మీ వాళ్ళకీ తప్పులు చెయ్యడం సారీ లు చెప్పడం అలవాటేగా. మొన్నటికి మొన్న, మీ బాబాయి చేసిన నిర్వాకం చాలదనట్టు మళ్ళీ ఇదొహటి" అంది సుందరి.
"సుందూ పాపం పెద్దవాడు, ఫేస్బుక్ అలవాటులేక .." అనబోతుండగానే
"అలవాటులేకా? మా మూడో మేనత్త మొదటి ఆడపడచు పాపం భర్త పోయి పుట్టెడు దుఃఖం లో ఉంటే, ఈయన గారు 'హలో పమ్మీ, హౌ ఈజ్ యువర్ హబ్బీ, హోప్ యు ఆర్ హేవింగ్ నైస్ టైం' అని పబ్లిక్ మెసేజీ పెట్టలేదూ? ఆవిడ నాకు ఫోన్ చేసి తిట్టిన తిట్లు నాకింకా చెవుల్లో మోగుతున్నాయ్." స్వరం పెంచింది సుందరి.
"సుందూ నీకెన్ని సార్లు చెప్పాలి. పాపం, ఆయన ఆ పమ్మీ గారి కొత్త గా పెళ్ళైన మనవరాలు అనుకొని ఆ మెసేజి పెట్టేడని. ఇద్దరి పేర్లూ ఒకటే కావడం తో ఏదో కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత సారీ మెసేజి కూడా పబ్లిగ్గానే పెట్టేడు కూడాను. అయినా మీ వాళ్ళేమన్నా తక్కువ తిన్నారా? చావు బతుకుల మధ్య ఐసీయూ లో ఉన్న మా పెద మావయ్య ని చూడడానికొచ్చి, మీ బాబాయి 'గుడ్బై మై ఫ్రెండ్' అని ఫోటో తో సహా పెడితే, పాపం ఆయన పోయేడనుకుని అందరు ఒకటే పరామర్శలుట. మా అత్త ఎంత బాధ పడిందనీ" కౌంటరిచ్చాడు సుబ్బు.
"సుబ్బూ అది ఆయన ఆర్నెల్లు అమెరికా లో ఉండడానికెళ్తూ బై చెప్పడానికి పెట్టిన పోస్టని నీకెన్ని సార్లు చెప్పాలి? అయినా, ఆ తర్వాత, ఈ పోస్టు వల్లనే దిష్టంతా పోయి , మా ఆయన క్షేమంగా తిరిగొచ్చాడంటూ , మా బాబాయి వాళ్ళింటికొచ్చి మరీ బట్టలు పెట్టి వెళ్ళారు కదూ మీ వాళ్ళు, ఆ మాట మరిచి పోయావా?"రిటార్డిచ్చింది సుందరి.
"మీ మావయ్య చేసిన ఘనకార్యం అప్పుడే మరచి పోయావా? మా చిన్నమ్మ మనవరాళ్ళతో తీసుకున్న ఫోటో పెడితే, ఆయన గారు, 'లుకింగ్ హాట్, కీప్ ఇట్ కూల్ అని కామెంటు పెట్టలేదూ?"ఛాన్సు వదలదలుచుకోలేదు సుబ్బూ.
"అదేదో ఎండాకాలం లో మిట్టమధ్యాన్నం ఎండ లో తీసిన ఫోటో లా ఉందని, పిల్లలకి కి జాగ్రత్త చెప్పాలనే సదుద్దేశ్యం తో, హాటు కి వేరే దిక్కుమాలిన మీనింగు ఉందని తెలియక ఇంగ్లీషు లో చెప్పాడే గానీ, ఆయన ఎంత మంచివాడో నీకు మాత్రం తెలియదూ?" అంది అంతే పంతం గా.
"ఎక్కడో బాబాయిలూ, మావయ్యలూ దాక వెళ్ళేను, అసలు మీ అమ్మ, నిన్ననే తన నూట డెబ్భయ్యో ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఫ్రెండు రిక్వెస్ట్ పెట్టింది. రోజూ పాస్వర్డ్ మరచి పోవడం, కొత్త ప్రొఫైల్ పెట్టడం. అదీ చాలదన్నట్లు ఈ వాట్సాప్ ఒకటి. బాదాం గింజలు తింటే మందబుద్ధి పోతుంది, కరివేపాకు తింటే మలబద్ధకం పోతుంది అంటూ దిక్కుమాలిన చిట్కాలు పంపడం, అడ్డమైన ఫార్వర్డ్ లు చెయ్యటం. నాకొక్క దానికే పంపుతోందట, కనుక్కున్నాను కూడా. కొంచం కూడా మేనర్స్ లేవు మీ వాళ్ళకి" కసురుకుంది సుందరి.
"అబ్బో మీ వంశం మేనర్స్ కి పెట్టింది పేరు మరి. ఎంత మీ నాన్న బాలయ్య అభిమాని అయితే మాత్రం, నా మనసింకా యంగే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని నా ఫ్రెండ్ భార్య కి రిక్వెస్ట్ పంపించాడు, పైగా బాలయ్య ప్రొఫైల్ పిక్ ఒకటి. ఈ వయసులో అవసరమా ఆయనకి ఈ కొత్త స్నేహాలు?”
"సుబ్బూ మా నాన్నని ఏమైనా అంటే ఊరుకోను"
"నువ్వు మాత్రం మా అమ్మ ని అనొచ్చా?"
"నీ ఫేస్బుక్ పేజ్ కరప్టైపోనూ"
"నీ వాట్సాప్ క్రాషైపోనూ"
"నిన్నసలూ"
“నిన్నసలూ"
ఇద్దరూ ఇలా యూ హౌ మచ్, అంటే యూ హౌ మచ్ అని ఈ-శాపాలు ఇచ్చుకుంటూండగా..బయటకెళ్ళిన బుజ్జిగాడు హడావుడిగా వచ్చాడు.
పక్కింటి ఆంటీ నాన్న తో పెట్టిన పోస్టు అపార్ట్మెంటంతా వైరల్ అయ్యిందట గా, అన్నాడు వగరుస్తూ.
కంగ్రాట్సు నాన్నా అనబోతుండగా,
పరిగెత్తుకుంటూ పక్కింటికెళ్ళి చూస్తే, అక్కడ ..
బుజ్జిగాడన్నట్లు గానే జనం గుమి గూడి ఉన్నారు. కానీ పెద్దగా అరుపులూ గట్రా లేవు. అపార్ట్మెంట్స్ లో అందరికీ టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వడం ఇష్టం లేదు సుందరి సుబ్బారావులకి. ఉన్నవాళ్లంతా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తమ తమ ఫోన్ల లోకి తొంగి చూస్తున్నారే తప్ప పెద్దగా హడావుడి కూడా లేదు.
బహుశా ఇన్స్టాగ్రాం లో లైవ్ చూస్తున్నారనుకుంటా అన్నాడు బుజ్జి గాడు. జరిగినది చాలదన్నట్లు, మళ్ళీ ఇదొకటా, అని నిలబడ్డ చోటే కూలబడ్డాడు సుబ్బూ.
అప్పటి దాకా నయానా భయానా చెప్పి చూసిన ఆంజినేయులు ఇప్పుడు తన భార్య మంగ తాయారుని బ్రతిమిలాడే స్టేజ్ కొచ్చాడు.
"తాయారు, ప్లీజ్, ఆ ఫోటో తీసెయ్యి. పక్కింటాయన్ని "మోస్ట్ లవ్డ్ ఒన్" అని నువ్వు అనడం వినడానికి, చూడడానికి, కనీసం తలచుకోడానికి కూడా బాలేదు."
"అంజీ, నాకు మాత్రం బాధ గా లేదనుకున్నావా? కాని నేనేమీ చెయ్యలేను. ఇప్పటికే ఎన్ని లైకులూ, కామెంట్లూ వచ్చాయో చూసావుగా. ఇప్పుడు తీసేస్తే , ఆ లైకులూ, కామెంట్లూ చేసిన వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయ్. నీ స్వార్ధం కోసం అంతమంది మనోభావాల్ని బలి తీసుకుంటావా?"
"ఈ మనోభావాలను కనిపెట్టిన వాడికి అరవ డబ్బింగు సీరియల్ ఆరు వేల ఎపిసోడ్లూ ఆపకుండా చూపించాలి." కసిగా తిట్టుకున్నాడు అంజి
"పోనీ కనీసం ఆ "మోస్ట్ లవ్డ్ ఒన్" ని "మోస్ట్ లవ్డ్ అన్న" అనైనా మార్చు" పట్టు వదల్లేదు అంజి.
"అంజీ, నాకు మాత్రం బాధ గా లేదనుకున్నావా? కాని నేనేమీ చెయ్యలేను..." తాయారు అదే డైలాగు రిపీట్ చేస్తూండగా.
"మేగీ (మంగ తాయారుని ఐస్ చెయ్యడానికి అప్పుడప్పుడూ ఇలానే పిలుస్తాడు అంజి) సీరియల్ లాగ రిపీట్ చెయ్యకు. ఎంత సెల్ఫీ అయితే మాత్రం పక్కన ఎవరున్నారో చూసుకోవద్దా?" గద్దించాడు అంజి.
"అసలు మన పెళ్ళి కాక ముందు మా పల్లెటూళ్ళో ఈ టెక్నాలజీ గొడవ లేకుండా హాయిగా ఉండేదాన్ని, ఎంగేజ్మెంట్ అవ్వగానే, నువ్వు కాదూ నాకు సెల్ఫీ కెమేరా ఉన్న ఫోన్ ఇచ్చింది? రోజూ నిన్ను చూడాలనిపిస్తోంది, రోజుకో
సెల్ఫీ పంపించమని, నువ్వు కాదూ నాకు ఈ దిక్కుమాలిన సెల్ఫీ జబ్బు అంటగట్టింది. ఇప్పుడు గంటకో సెల్ఫీ, అరగంటకో వాట్సాప్ స్టేటస్ , పూటకో ఫేస్బుక్ అప్డేట్ లేకుండా ఉండలేకపోతున్నాను. మన పెళ్ళి ఫోటో లకి కూడా ఇంత పాపులారిటీ రాలేదు. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడిగి, పూవై, కాయై, మహా వృక్షం గా ఎదగ బోతున్న నా ప్రొఫైల్ ని మొదట్లోనే తుంచేస్తావా?" బాధగా మూలిగింది మేగీ.
"మేగీ ప్లీజ్ నీ మెగా సీరియల్ ఆపేయ్" కాళ్ళు పట్టుకోవడమే తరువాయి అన్నట్లున్నాడు అంజి.
"ఎందుకు ఆపాలి? చేసిందంతా నువ్వుచేసి, ఈ పోస్ట్ విషయం లో నన్ను ఫోర్స్ చేయడం నువ్వే ఆపెయ్. " తగ్గేదేలే అనే టైపులో అంది మేగీ.
ఇదింక తేలేలా లేదని అర్ధమౌతోంది సుందరి, సుబ్బూలకి.
"సుందూ ఇప్పుడు ఏమిటి నా పొజిషన్" జాలిగా అడిగాడు సుబ్బూ.
ఏముంది, ఇక ముందు నీ జీవితం హింస, సెంటిమెంటు సమ పాళ్ళలో కలబోసిన థ్రిల్లర్ లా ఉండబోతోంది. కఠినం గా అంది సుందూ.
చచ్చాం, ఇప్పటికే ఎన్నో చిత్ర విచిత్రాలు చూపించిన సుందరి ఇక ముందు నరకం చూపించబోతోందా? మనసులో అనాలనుకుని, పైకే భయపడుతూ అనేశాడు సుబ్బూ.
కరెక్ట్ అంటూ వికటాట్టహాసం చేసింది సుందరి.
పాపం సుబ్బూ.