హోమ్

14, ఫిబ్రవరి 2017, మంగళవారం

హేవ్ ఎ డేట్

"జనానికి బొత్తిగా దేశభక్తి లేకుండా పోతోంది"చిరాగ్గా అన్నాడు గిరి.
"చివరికి మోదీ, మేంగోమేన్ కూడా ఇలా చేస్తారనుకోలేదు."
వాడేం మాట్లాడినా ఏమైంది అని మనం అడగక్కరలేదు. వాడంతే ఇంటర్నెట్/సోషల్ మీడియా  లో వచ్చిన ప్రతీదీ నిజమని నమ్మే అమాయకుడు. రాజకీయాల పై మాట్లాడ్డం మొదలుపెడితే, ఎవరిని తిడుతున్నాడో, ఎవరిని సపోర్టు చేస్తున్నాడో తెలుసుకోవడానికి వారం పడుతుంది.
"కమాన్ రా, ఇవాళ వేలన్ టైన్స్ డే, కీప్ కాం ఎండ్ హేవ్ ఎ డేట్" అన్నా.
"నువ్వు కూడానా? ద్రోహీ".   
"బ్రూటస్ యూ టూ" అన్నప్పుడు సీజర్ కూడా ఇంత ఎక్స్ప్రెషను ఇచ్చి ఉండడు. ఇక వివరం కనుక్కోక పోతే పాత సినిమాలో గుమ్మడి లాగ గుండె పట్టుకుని పడిపోయేలా వున్నాడు.
"ఆవేశం అన్ని విధాలా అనర్ధం రావ్ గోపాల్రావ్" అన్నాను కొంచం కూల్ చేద్దామని.
అంతే, టివి 9 చూసిన  కేసీయార్ లా ఫైర్ ఐపోయాడు.
"మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీసిన రోజు రా ఇది.  హేవ్ ఎ డేట్ అని ఎలా అనగలుగు తున్నావ్ రా" అంటూ ఫోన్ లో వాట్సాప్ మెసేజి చూపించాడు.



"నీ బొంద రా నీ బొంద. వాళ్ళని ఉరి తీసిన రోజు మార్చి ఇరవై మూడు. నీ దేశ భక్తి ఆ రోజు కూడా చూపించు."
"నిజాలు తెలుసు కోకుండా మాట్లాడకు, ఇదే వార్త ఫేస్బుక్ లో కూడా వచ్చింది తెలుసా?" ఒక్కోసారి వాడు కేజ్రీవాల్ లా బిహేవ్ చేస్తాడు.
"వాట్సాప్ లో, ఫేస్బుక్ లో వస్తే నిజమై పోతుందా? ముందు ఈ రెండూ వాడడం తగ్గించి, అప్పుడప్పుడూ బుర్ర కూడా వాడు." నేనెప్పుడూ వాడికి చెప్పాలనుకున్న మాట కూడా చెప్పేశా.
వీడికి కూడా ప్రూఫ్ కావాలని నాకు తెలుసు. లేకపోతే ఇప్పుడు ఆర్టీఐ వేస్తానంటాడు. అందుకే ఇండియన్ లా జర్నల్ చూపించా.
జ్యోతి పేపర్ చూసిన చంద్ర బాబు లా చల్ల బడ్డాడు.
"ఐతే నువ్వన్నది చేసెయ్యమంటావా?"
"ఏంటది"
"అదే హేవ్ ఎ డేట్"
"నీకు ఆ డేట్ అంత సీన్ లేదని నాకు తెలుసు గానీ, నేను చెప్పింది ఈ డేట్ గురించి" అంటూ చేతి లో ఒక ఖర్జూరం పెట్టి.
"తిను మెదడు బాగ పని చేస్తుందట" అన్నా.
"నీకెలా తెలుసు?"బుర్ర వాడడం మొదలు పెట్టినట్టున్నాడు.
వాట్సాప్ లో డేట్స్ మీద వచ్చిన మెసేజి చూపించా. ఒప్పుకోక చస్తాడా?