హోమ్

26, జనవరి 2017, గురువారం

కత్తితో పొడుస్తా

సుబ్బారావు మంచి వాడూ, మర్యాదస్తుడూను ఇది అతని మీద అతనికే ఉన్న అభిప్రాయం. సుబ్బారావు వఠ్ఠి మొద్దు మనిషి, బొత్తిగా కళాపోషణ తెలియని వాడు. ఇది అతని మీద అతని భార్య సుందరి కున్న అభిప్రాయం. సుబ్బారావు మరీ అంత కళాపోషణ తెలియని వాడు కాదు. విధి, పవిత్రబంధం లాంటి సీరియల్స్ నుంచి సుకుమార్ సినిమాల వరకు చూసిన మొదటిసారే చక్కగా అర్ధం చేసుకోగల సమర్ధుడు. అలాంటి వాడు ఈ చెడ్డపేరు తెచ్చుకోవడానికి కారణం, తెలుగు సినిమాలల్లో ఉండే కథ కన్నా బలమైనది. సుందరి ఎప్పుడు, ఏ వైపునుంచి వచ్చి కవితల తో కొడుతుందో, కథలతో చంపుతుందో నని భయం వల్ల వచ్చిన బాధతో కూడిన విరక్తి వల్ల కలిగిన చెడ్డపేరు అది.
హాల్లో దిగులుగా కూర్చున్న సుబ్బారావు ని పిలుస్తూ సుందరి వస్తోంది. చేతిలో పెద్ద కాగితాల కట్ట. సమయం లేదు మిత్రమా పారిపో అని అంతరాత్మ హెచ్చరిస్తోంది. చెయ్యగలిగిందేమీ లేక, హిహిహి అని నవ్వుతూ, కొత్తగా ఏమి రాశావు డాళింగ్? అంటూ పలకరించాడు.  ముందు ఈ కవిత విను సుబ్బూ అంటూ, "చంటబ్బాయి" లో వాగ్దేవి లా పాడడం మొదలెట్టింది.
"సుబ్బూ ఏమి వం
డమంటావు? వం
కాయ కూరా? వం
గీ బాతా? వం
కాయ వేపుడా? వెం
టనే చెప్పు? వం
టకి లేటవుతుం.."
'శారదా' అని శంకరాభరణం శంకరశాస్త్రి లా గంభీరంగా అరిచి, సుందరి వాగ్ధాటిని తాత్కాలికం గా ఆపగలిగాడు కాని, లోలోపల వాగ్దేవి ధాటికి బిక్క చచ్చిన బక్క ఎడిటర్ వణికినట్లు వణికి పోతున్నాడు.
"ఏంటి, ఏమైంది ఇంత అంతర్ధానం గా ఆపేవు? ఎనీ ప్రోబ్లం?"
"అంతర్ధానం కాదు డాళింగ్  అర్ధాంతరం అనాలి", టాపిక్ డైవర్టు చేసే ప్రయత్నం లో పడ్డాడు.
"హబ్బ నీకున్న పాండిత్యం లో సగం నాకుంటేనా, ఈ పాటికి నంది ఎవార్డు కొట్టేద్దును."
ఇప్పుడు నందుల గురించి చెప్పే ఓపిక లేక, హిహిహిహి అని నవ్వాడు. లాభం లేదు, ఏదో ఒకటి చేసి ఈ ఉపద్రవాన్ని ఆపాలి.
"ఇంతకీ నాకవిత ఎవరైనా వేస్తారంటావా?" తనే అంది.
"నీ కవిత వేసేంత దమ్మూ, ధైర్యం ఉన్నవాళ్ళు ఆడామగా కలిపి నువ్వొక్కదానివే." గర్వంగా చెప్పాడు.
"నేనా ? ఎలా?"
"ఎలా అంటే, ఫేస్ బుక్ లో వేద్దాం. "
"చూస్తారంటావా? చూసినా లైకు చేస్తారంటావా?"
"పిచ్చి సుందూ, ముప్పై పేజీల పోస్టునైనా, మూడు క్షణాల్లో, చదివినా, చదవక పోయినా పిచ్చ లైకులు, కామెంటులు కొట్టే జాతి మనది"
సుబ్బారావు ఛాతి రెండు ఇంచులు పెరగడం గమనించక పోలేదు సుందరి. అతని ఛాతి అంతే, శాతకర్ణి సినిమా పేరు విన్నా, తెలుగు వాడి ఆత్మగౌరవం అనే మాట విన్నా అలా రెండేసి ఇంచుల చొప్పున పెరిగిపోతూంటుంది.
"సంపూర్ణేష్ నీ, సన్నీలియోన్నీ అక్కున చేర్చుకున్న ఖ్యాతి మనది" చెప్పుకుపోతున్నాడు.
అతని ఫ్లో ఆపక పోతే పెరుగుతూ పోతున్న అతని ఛాతి ని కూడా అమరావతి భూముల్లో కలిపేస్తారేమోనన్న భయంతో.
"నవల కూడా ఫేస్ బుక్ లోనే వేద్దమంటావా?" అంది.
"నవలా?" అదిరిపడ్డాడు.
చేతిలోని మిగతా కాగితాల కట్టని చూపిస్తూ,
"మూఢ నమ్మకాలని రూపుమాపటానికి, ఓ నవల మొదలు పెట్టాను, వంద పేజీలైంది కాని క్లైమాక్సు కుదరటంలేదు. వారం, వజ్రం చూసి మొదలు పెట్టాల్సింది..."
"వజ్రం కాదు బంగారం వర్జ్యం..."
అదేలే, ఇది కూడా ఫేస్ బుక్ లో వేద్దామంటావా?
"తప్పకుండా. రోజుకో పది లైన్ల చొప్పున వేస్తే, అభిషేకం సీరియల్ కన్నా ఎక్కువ ఎపిసోడ్ లవుతాయి. అప్పుడు ఎంచక్కా నువ్వు కూడా సుబ్బిరామిరెడ్డి తో సన్మానం చేయించుకోవచ్చు."
"మరి నంది ఏవార్డో ?"
"నంది ఎవార్డేం ఖర్మ, పరపతి ఉంటే ఒక్క ఫేస్ బుక్ పోస్టుచాలు ఎకాడెమీ ఎవార్డు కొట్టటానికి." రెచ్చగొట్టి వదిలాడు.
మరైతే ఆఫీసు కెళ్ళేటపుడు చదివి క్లైమాక్సు మీద ఏమైనా సజెషన్స్ ఇస్తావా?
నేనే చదవాలా? నీది మరీ ఛాదస్తం కాకపోతేనూ, క్లైమాక్సు పాఠకులే నిర్ణయించేలా ఒక పోటీ పెడదాం.
ఇది చాలా కొత్తగా ఉంది. నీతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ సుమీ!! అంటూ కంప్యూటర్ లో ఫేస్ బుక్  ఓపెన్ చేసింది.
"నేను కవిని కాదన్న వాణ్ణి కత్తితో పొడుస్తా" అని ఆ వాగ్దేవి చేసిన హెచ్చరిక ఇప్పుడు ఈ వాగ్దేవి నిజం చేసేలా వుంది.
ఫేస్ బుక్ జీవులూ తస్మాత్ జాగ్రత్త !!