హోమ్

20, మార్చి 2022, ఆదివారం

భళారే స్వీయ చిత్రమా!

 జరిగిన విచిత్రాన్ని సుందరి కి చెబితే, థ్రిల్లు ఫీలవుతుందని మురిసి పోతూ ఇల్లు చేరాడు సుబ్బారావ్. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ మోగుతూ ఉండే కామెడీ చానల్ కూడా మూగ బోయింది. బుజ్జిగాడు ఆడుకోవడానికి బయటికెళ్ళినట్లున్నాడు.

సుందరి తన కళ్ళకి అరుంధతి లో అఘోరా లా కనపడుతోంది. అంతేకాదు "ఒదల సుబ్బారావ్ నిన్నొదల" అంటునట్లు ఇల్లంతా ఎకో వినబడుతోంది. ఈ మధ్య సుందరి కోపంగా వున్నప్పుడల్లా, అఘోరా మాటలు ఎకో లో వినబడడం అలవాటైపోయింది సుబ్బూ కి.
ఉపద్రవం ముంచుకు రాక ముందే సుందరి ని కూల్ చెయ్యాలనుకుంటూ, సుందూ ఇవాళేమైందో తెలిస్తే, భలే నవ్వు కుంటావ్ అని మొదలెట్టేశాడు, ఆమె వైపు కూడా చూడకుండానే.
ఆఫీసు నుండి కింద మన కార్ పార్క్ దాకా వచ్చానా, వెంఠనే ఒక ఇంపార్టెంటు ఈమెయిల్- బాసు నుంచి. ఆ మెయిలు చదువుతూ, మన ఫ్లోరుకొచ్చి,
హ్హి హ్హి హ్హి అని లేని నవ్వు తెచ్చుకుంటూ, మన ఇల్లనుకుని పక్కింటికెళ్ళిపోయా. అలవాటు ప్రకారం, సోఫా లో కూలబడి 'ఏమోయ్ టీ 'అనగానే, ఆవిడా పాపం, ఫేస్బుక్ చూసుకుంటూ టీ తెచ్చి ఇచ్చేసింది. మెయిలు కి రిప్లై ఇస్తూ, ఒక్క సిప్పు తాగానో లేదో, ఛీ యాక్ థూ అనిపించి కప్పు లోకి తొంగి చూసా. వాళ్ళాయన గ్రీన్ టీ తాగుతాడనుకుంటా. అప్పుడు తెలిసింది అది మనిల్లు కాదని. హ్హహ్హా హ్హా. భలేఉంది కదూ. ఆవిడా అంతే పాపం నవ్వుకుంటూ ఫేస్బుక్ చూస్తూ ఉండిపోయింది.
భలే తమాషా గా ఉంది కదూ? అంటూ సుందరి వైపు చూసాడు. ఇప్పుడు తను అఘోరా ని చంపబోతున్న అరుంధతి లా కనిపించింది.
ఇది కూడానా అంది, తన ఫోన్ చూపిస్తూ.
అదిరిపడ్డాడు సుబ్బు. ఆ పక్కింటావిడ తను కప్పు లోకి తొంగి చూస్తున్నప్పుడు, ఒక సెల్ఫీ తీసి, "టీ టైం విత్ మై మోస్ట్ లవ్డ్ ఒన్" అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసింది.
"ఎంత సెల్ఫీ అయితే మాత్రం, పక్కన ఎవరున్నారో చూసుకోనక్కర్లా? ఫేస్బుక్, సెల్ఫీ ఉంటే ఇంకేమీ పట్టదా? ఏం మనిషో? ఇప్పుడు నాకేమైనా జరిగితే ఎవరిది రెస్పా్న్సిబిలిటీ?" పైకే అనేసుకున్నాడు సుబ్బు.
పోస్ట్ చేసి పట్టుమని పది నిమిషాలు కూడా కాలేదు, ఇంకేమీ పని లేనట్లు జనమంతా విపరీతమైన కామెంట్లూ, లైకులూ ను.
కామేశం గాడి భార్య చీనాంబరి "లోల్" అనీ, సుబ్బు అక్క "నైస్ పిక్, చూడ ముచ్చటైన జంట" అని కామెంటి, సుందరినీ, సుబ్బూనీ ట్యాగ్ కూడా చేసింది. కొందరు ఫ్రెండ్సు "కంగ్రాచులేషన్స్" అని కూడా పెట్టేశారు.
"ఫ్రెండ్సు కి మన గురించి పూర్తిగా తెలియదనుకుందాం, మీ అక్క కేమైంది, చూడ ముచ్చటైన జంట అని పెట్టింది. ఆవిడగారికి నేనంటే ఎందుకింత పగ." అంది సుందరి నిష్ఠూరంగా.
"సుందూ మా అక్క కి తొందరెక్కువ అని నీకు తెలుసు గా, ఏదో పొరపాటున పెట్టుంటుంది" అన్నాడు సర్దిచెబుతూ.
"ఏదో మెయిలు కి రిప్లై ఇస్తూ .. అలా జరిగి పోయింది. ఇప్పుడే పక్కింటావిడ ని ఈ పోస్టు తీసెయ్యమని చెబుతా" అన్నాడు మళ్ళీ తనే.
"ఆ ముచ్చటా తీరింది, తన కెప్పుడూ ఇన్ని లైకులూ , కామెంట్లూ రాలేదుట, అందుకని తియ్యనని చెప్పేసింది" అంది సుందరి ఇంకా కోపంగా.
"సారీ సుందూ ఇంకెప్పుడూ ఫోన్ చూస్తూ ఇంటికి రాను సరేనా" అన్నాడు సుబ్బు.
"అంతే నీకు, మీ వాళ్ళకీ తప్పులు చెయ్యడం సారీ లు చెప్పడం అలవాటేగా. మొన్నటికి మొన్న, మీ బాబాయి చేసిన నిర్వాకం చాలదనట్టు మళ్ళీ ఇదొహటి" అంది సుందరి.
"సుందూ పాపం పెద్దవాడు, ఫేస్బుక్ అలవాటులేక .." అనబోతుండగానే
"అలవాటులేకా? మా మూడో మేనత్త మొదటి ఆడపడచు పాపం భర్త పోయి పుట్టెడు దుఃఖం లో ఉంటే, ఈయన గారు 'హలో పమ్మీ, హౌ ఈజ్ యువర్ హబ్బీ, హోప్ యు ఆర్ హేవింగ్ నైస్ టైం' అని పబ్లిక్ మెసేజీ పెట్టలేదూ? ఆవిడ నాకు ఫోన్ చేసి తిట్టిన తిట్లు నాకింకా చెవుల్లో మోగుతున్నాయ్." స్వరం పెంచింది సుందరి.
"సుందూ నీకెన్ని సార్లు చెప్పాలి. పాపం, ఆయన ఆ పమ్మీ గారి కొత్త గా పెళ్ళైన మనవరాలు అనుకొని ఆ మెసేజి పెట్టేడని. ఇద్దరి పేర్లూ ఒకటే కావడం తో ఏదో కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత సారీ మెసేజి కూడా పబ్లిగ్గానే పెట్టేడు కూడాను. అయినా మీ వాళ్ళేమన్నా తక్కువ తిన్నారా? చావు బతుకుల మధ్య ఐసీయూ లో ఉన్న మా పెద మావయ్య ని చూడడానికొచ్చి, మీ బాబాయి 'గుడ్బై మై ఫ్రెండ్' అని ఫోటో తో సహా పెడితే, పాపం ఆయన పోయేడనుకుని అందరు ఒకటే పరామర్శలుట. మా అత్త ఎంత బాధ పడిందనీ" కౌంటరిచ్చాడు సుబ్బు.
"సుబ్బూ అది ఆయన ఆర్నెల్లు అమెరికా లో ఉండడానికెళ్తూ బై చెప్పడానికి పెట్టిన పోస్టని నీకెన్ని సార్లు చెప్పాలి? అయినా, ఆ తర్వాత, ఈ పోస్టు వల్లనే దిష్టంతా పోయి , మా ఆయన క్షేమంగా తిరిగొచ్చాడంటూ , మా బాబాయి వాళ్ళింటికొచ్చి మరీ బట్టలు పెట్టి వెళ్ళారు కదూ మీ వాళ్ళు, ఆ మాట మరిచి పోయావా?"రిటార్డిచ్చింది సుందరి.
"మీ మావయ్య చేసిన ఘనకార్యం అప్పుడే మరచి పోయావా? మా చిన్నమ్మ మనవరాళ్ళతో తీసుకున్న ఫోటో పెడితే, ఆయన గారు, 'లుకింగ్ హాట్, కీప్ ఇట్ కూల్ అని కామెంటు పెట్టలేదూ?"ఛాన్సు వదలదలుచుకోలేదు సుబ్బూ.
"అదేదో ఎండాకాలం లో మిట్టమధ్యాన్నం ఎండ లో తీసిన ఫోటో లా ఉందని, పిల్లలకి కి జాగ్రత్త చెప్పాలనే సదుద్దేశ్యం తో, హాటు కి వేరే దిక్కుమాలిన మీనింగు ఉందని తెలియక ఇంగ్లీషు లో చెప్పాడే గానీ, ఆయన ఎంత మంచివాడో నీకు మాత్రం తెలియదూ?" అంది అంతే పంతం గా.
"ఎక్కడో బాబాయిలూ, మావయ్యలూ దాక వెళ్ళేను, అసలు మీ అమ్మ, నిన్ననే తన నూట డెబ్భయ్యో ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఫ్రెండు రిక్వెస్ట్ పెట్టింది. రోజూ పాస్వర్డ్ మరచి పోవడం, కొత్త ప్రొఫైల్ పెట్టడం. అదీ చాలదన్నట్లు ఈ వాట్సాప్ ఒకటి. బాదాం గింజలు తింటే మందబుద్ధి పోతుంది, కరివేపాకు తింటే మలబద్ధకం పోతుంది అంటూ దిక్కుమాలిన చిట్కాలు పంపడం, అడ్డమైన ఫార్వర్డ్ లు చెయ్యటం. నాకొక్క దానికే పంపుతోందట, కనుక్కున్నాను కూడా. కొంచం కూడా మేనర్స్ లేవు మీ వాళ్ళకి" కసురుకుంది సుందరి.
"అబ్బో మీ వంశం మేనర్స్ కి పెట్టింది పేరు మరి. ఎంత మీ నాన్న బాలయ్య అభిమాని అయితే మాత్రం, నా మనసింకా యంగే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని నా ఫ్రెండ్ భార్య కి రిక్వెస్ట్ పంపించాడు, పైగా బాలయ్య ప్రొఫైల్ పిక్ ఒకటి. ఈ వయసులో అవసరమా ఆయనకి ఈ కొత్త స్నేహాలు?”
"సుబ్బూ మా నాన్నని ఏమైనా అంటే ఊరుకోను"
"నువ్వు మాత్రం మా అమ్మ ని అనొచ్చా?"
"నీ ఫేస్బుక్ పేజ్ కరప్టైపోనూ"
"నీ వాట్సాప్ క్రాషైపోనూ"
"నిన్నసలూ"
“నిన్నసలూ"
ఇద్దరూ ఇలా యూ హౌ మచ్, అంటే యూ హౌ మచ్ అని ఈ-శాపాలు ఇచ్చుకుంటూండగా..బయటకెళ్ళిన బుజ్జిగాడు హడావుడిగా వచ్చాడు.
పక్కింటి ఆంటీ నాన్న తో పెట్టిన పోస్టు అపార్ట్మెంటంతా వైరల్ అయ్యిందట గా, అన్నాడు వగరుస్తూ.
కంగ్రాట్సు నాన్నా అనబోతుండగా,
పరిగెత్తుకుంటూ పక్కింటికెళ్ళి చూస్తే, అక్కడ ..
బుజ్జిగాడన్నట్లు గానే జనం గుమి గూడి ఉన్నారు. కానీ పెద్దగా అరుపులూ గట్రా లేవు. అపార్ట్మెంట్స్ లో అందరికీ టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వడం ఇష్టం లేదు సుందరి సుబ్బారావులకి. ఉన్నవాళ్లంతా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తమ తమ ఫోన్ల లోకి తొంగి చూస్తున్నారే తప్ప పెద్దగా హడావుడి కూడా లేదు.
బహుశా ఇన్స్టాగ్రాం లో లైవ్ చూస్తున్నారనుకుంటా అన్నాడు బుజ్జి గాడు. జరిగినది చాలదన్నట్లు, మళ్ళీ ఇదొకటా, అని నిలబడ్డ చోటే కూలబడ్డాడు సుబ్బూ.
అప్పటి దాకా నయానా భయానా చెప్పి చూసిన ఆంజినేయులు ఇప్పుడు తన భార్య మంగ తాయారుని బ్రతిమిలాడే స్టేజ్ కొచ్చాడు.
"తాయారు, ప్లీజ్, ఆ ఫోటో తీసెయ్యి. పక్కింటాయన్ని "మోస్ట్ లవ్డ్ ఒన్" అని నువ్వు అనడం వినడానికి, చూడడానికి, కనీసం తలచుకోడానికి కూడా బాలేదు."
"అంజీ, నాకు మాత్రం బాధ గా లేదనుకున్నావా? కాని నేనేమీ చెయ్యలేను. ఇప్పటికే ఎన్ని లైకులూ, కామెంట్లూ వచ్చాయో చూసావుగా. ఇప్పుడు తీసేస్తే , ఆ లైకులూ, కామెంట్లూ చేసిన వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయ్. నీ స్వార్ధం కోసం అంతమంది మనోభావాల్ని బలి తీసుకుంటావా?"
"ఈ మనోభావాలను కనిపెట్టిన వాడికి అరవ డబ్బింగు సీరియల్ ఆరు వేల ఎపిసోడ్లూ ఆపకుండా చూపించాలి." కసిగా తిట్టుకున్నాడు అంజి
"పోనీ కనీసం ఆ "మోస్ట్ లవ్డ్ ఒన్" ని "మోస్ట్ లవ్డ్ అన్న" అనైనా మార్చు" పట్టు వదల్లేదు అంజి.
"అంజీ, నాకు మాత్రం బాధ గా లేదనుకున్నావా? కాని నేనేమీ చెయ్యలేను..." తాయారు అదే డైలాగు రిపీట్ చేస్తూండగా.
"మేగీ (మంగ తాయారుని ఐస్ చెయ్యడానికి అప్పుడప్పుడూ ఇలానే పిలుస్తాడు అంజి) సీరియల్ లాగ రిపీట్ చెయ్యకు. ఎంత సెల్ఫీ అయితే మాత్రం పక్కన ఎవరున్నారో చూసుకోవద్దా?" గద్దించాడు అంజి.
"అసలు మన పెళ్ళి కాక ముందు మా పల్లెటూళ్ళో ఈ టెక్నాలజీ గొడవ లేకుండా హాయిగా ఉండేదాన్ని, ఎంగేజ్మెంట్ అవ్వగానే, నువ్వు కాదూ నాకు సెల్ఫీ కెమేరా ఉన్న ఫోన్ ఇచ్చింది? రోజూ నిన్ను చూడాలనిపిస్తోంది, రోజుకో
సెల్ఫీ పంపించమని, నువ్వు కాదూ నాకు ఈ దిక్కుమాలిన సెల్ఫీ జబ్బు అంటగట్టింది. ఇప్పుడు గంటకో సెల్ఫీ, అరగంటకో వాట్సాప్ స్టేటస్ , పూటకో ఫేస్బుక్ అప్డేట్ లేకుండా ఉండలేకపోతున్నాను. మన పెళ్ళి ఫోటో లకి కూడా ఇంత పాపులారిటీ రాలేదు. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడిగి, పూవై, కాయై, మహా వృక్షం గా ఎదగ బోతున్న నా ప్రొఫైల్ ని మొదట్లోనే తుంచేస్తావా?" బాధగా మూలిగింది మేగీ.
"మేగీ ప్లీజ్ నీ మెగా సీరియల్ ఆపేయ్" కాళ్ళు పట్టుకోవడమే తరువాయి అన్నట్లున్నాడు అంజి.
"ఎందుకు ఆపాలి? చేసిందంతా నువ్వుచేసి, ఈ పోస్ట్ విషయం లో నన్ను ఫోర్స్ చేయడం నువ్వే ఆపెయ్. " తగ్గేదేలే అనే టైపులో అంది మేగీ.
ఇదింక తేలేలా లేదని అర్ధమౌతోంది సుందరి, సుబ్బూలకి.
"సుందూ ఇప్పుడు ఏమిటి నా పొజిషన్" జాలిగా అడిగాడు సుబ్బూ.
ఏముంది, ఇక ముందు నీ జీవితం హింస, సెంటిమెంటు సమ పాళ్ళలో కలబోసిన థ్రిల్లర్ లా ఉండబోతోంది. కఠినం గా అంది సుందూ.
చచ్చాం, ఇప్పటికే ఎన్నో చిత్ర విచిత్రాలు చూపించిన సుందరి ఇక ముందు నరకం చూపించబోతోందా? మనసులో అనాలనుకుని, పైకే భయపడుతూ అనేశాడు సుబ్బూ.
కరెక్ట్ అంటూ వికటాట్టహాసం చేసింది సుందరి.
పాపం సుబ్బూ.