హోమ్

కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జూన్ 2019, శుక్రవారం

నీకంటూ ఒక రోజు

నీకంటూ ఒక రోజొస్తుంది
ఈ లోకం జేజేలంటుంది

మనసంటూ నీకొకటుంటుంది
అది ఏదో చేద్దామంటుంది
నీ కలలకు నువ్వే రారాజు
నీ ప్రతిభకు ఎవరూ సరిపోరు.

పడి లేచే కెరటం నువ్వైతే
ఆకాశం నీదే అవుతుంది.
శ్రమ చేసే నేర్పే నీకుంటే
ఫలితానికి  హద్దే ముంటుంది.

నీ కష్టమే నీకు చిరునామా
నీ ధైర్యం నీకొక సాధనమా
నీ లక్ష్యం ఏదని కనిపెట్టు
నీ అడుగే దానికి తొలిమెట్టు

జీవితమంటే పరుగేనా?
ప్రతి రోజూ ఏదో దిగులేనా?
లోకం ఏదో అంటోందా?
నువు పనికే రావని నవ్విందా?

కాలం జవాబు చెబుతుంది
నీకంటూ ఒక రోజొస్తుంది

నీ ప్రశ్న కి నువ్వే తొలి బదులు
చిరునవ్వే చెదరక నువు కదులు
నీ బ్రతుకు కి ఉంది ఒక అర్థం
అది తెలియక పోతే  నువు వ్యర్ధం

ఎప్పుడు ఎలాగ పోతావో
నీకైనా తెలిసే వీలుందా?
ఎవరెప్పుడు ఏం సాధిస్తారో
కనిపెట్టే సాధనముంటుందా?

వట్టి చేతులతో వచ్చావు
వట్టి చేతులతో పోతావు
పోయినవన్నీ నీవేనా?
మిగిలున్నవి నీతో వస్తాయా?

నీ కీర్తే నీతో వచ్చేది
నీకంటూ ఒక రోజొస్తుంది
ఈ లోకం జేజేలంటుంది

24, జనవరి 2018, బుధవారం

శ్రీశ్రీ ఇజం


క్రింది వీడియోలో చంద్రబోసు గారు తన పూర్వ కవుల గురించి అపూర్వమైన మాటలు చెప్పేరు.








వాటిలో నాకు బాగా నచ్చినవి శ్రీ శ్రీ గారి గురించి చెప్పిన మాటలు. 
"కవితయను కన్య కి, పోరాట పురుషునికి పెండ్లి చేసిన పురోహితుడు శ్రీ శ్రీ”. 

అప్పటికే విప్లవ సాహిత్యం ఉన్నా (అరసం, విరసం ఉన్నాయేమో తెలియదు), దాన్ని లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ లో కి లాక్కొచ్చి, ఉరుకులూ పరుగులూ పెట్టించాడు. ఉర్రూతలూగించాడు. చాలా మందిని విప్లవ సాహిత్యం చదవడానికి, రాయడానికి ప్రేరేపించాడు. యోగ్యతా పత్రం లో చెలం చెప్పినట్టు, "రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషం, ఝంఝానిల షడ్జధ్వానం" గుండెల్లో మోగించాడు.

పాతికేళ్ల నాడు, చాలా మంది దిగువ మధ్యతరగతి టీనేజర్ల లానే నేనూ ఆయన భావాలకి దగ్గరయ్యాను.
శ్రీ శ్రీ పడికట్టు పదాలు ఎంత గొప్పవంటే, నాలాంటి అర్భకులు కూడా,ఇప్పుడు, ఈ కాలం లోఆ పదాలను వాడినా, అచ్చు వేసేంత గొప్పవి. 
గతేడాది తెలుగు వెలుగు లో నా కవిత కేవలం ఆ పదాల వల్లే అచ్చైందనిపిస్తుంది.


శ్రీ శ్రీ  ని సరిగ్గా అర్ధం చేసుకున్నాడో లేదో కూడా తెలియకుండానే, కేవలం శ్రీ శ్రీ  రచనా శైలి తో గుడ్డి ప్రేమ లో పడిన అప్పటి టీనేజీ కుర్రాడి రచన ఇది. చదివాక నవ్వొస్తే మీ తప్పేం లేదు, చాలా వాటికి క్షమించాలి నన్ను.



మరో ప్రపంచపు జ్వాలల నుంచీ,
రుద్ర విపంచుల ధ్వానం నుంచీ,
రుధిరాక్షరాల సత్యం నుంచీ,
వేదం నుంచీ - స్వేదం నుంచీ,
ఖేదం నుంచీ - మోదం నుంచీ,
నాదం నుంచీ- గానం నుంచీ,
రాగం నుంచీ,
జాలు వారాలి కవనం,
కళ్ళు తెరవాలి జనం,
కుళ్ళి పోవాలి కులం,
పారిపోవాలి మతం,
అంతమవ్వాలి అన్యాయం,
వెల్లువెత్తాలి ప్రభంజనం,
భారతి కావాలి నందనవనం.


వీడియో సేకరణ : వాట్సాప్

23, ఆగస్టు 2017, బుధవారం

సంఘర్షణ

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (25/01/1998) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"నూరు పూలు వికసించనీ
వేయి ఆలోచనలు సంఘర్షించనీ " 


ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
సంఘర్షణ 

చుక్కల్లో ఆదర్శాలు లెక్కిస్తూ ,
మెరుపుల్లో ఆవేశాన్ని వీక్షిస్తూ ,
లక్ష్యాలను విస్మరించి,
మార్గం మరచి,
యువతా!,
ఈ ముళ్ల దారినా నీ సంచారం?
అపశృతులు నిండిన ఈ గేయాలా నీ సంగీతం?
కాల్చే ఆకలీ , కూల్చే వేదనా 
కనిపిస్తోందా ఈ గాయం?
ఏమైందీ?
స్వాతంత్ర్య సమరానికి ఊపిరులూదిన యువ చైతన్యం?
నవ భారత నిర్మాణానికి పునాది వేసిన ఆ సౌగంధం?
నవ కవనం-చైతన్యానికి
నవ భువనం - ఇనోదయానికి 
యువ యోధులు-అభ్యుదయానికి 
కావాలోయ్ సమాజానికి. 
నూరు పూలు వికసించనీ,
వేయి ఆలోచనలు సంఘర్షించనీ,
గుండె కొండల్లో శాంతి నాదాలు ప్రతిధ్వనించనీ ,
జగాన్ని క్రమ్మిన స్వార్ధ మేఘాలు పాటా పంచలవనీ,
విశ్వమంతా దేశ కీర్తిని మార్మ్రోగనీ ,
ఒక్క పుష్ప వికాసం చాలు వసంతాన్ని ఆహ్వానించేందుకు 
ఒక్క ఆలోచన చాలు ప్రజా హృదయం లో చైతన్యం నింపేందుకు
మరో ప్రస్థానం ఆరంభించేందుకు. 

22, ఆగస్టు 2017, మంగళవారం

స్వాగతించరేం?



ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (30/11/1997) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ?
మూగనేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని?" 
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
స్వాగతించరేం?

మార్చేయండి మానవ నైజాన్ని,
తిరగరాయండి మానుష చరిత్రని. 
ఇదిగో, ఇక్కడ,
బూజు పట్టిన విధానాల్ని దులుపుకుంటూ,
నిశి రాత్రిని వెన్నెలగా చూపే 
గాజు కళ్ళని నులుముకుంటూ,
అర్ధశతాబ్ది స్వాతంత్ర్యాన్ని 
ఆనందంగా హత్తుకుంటూ,
దారిద్ర్యపు వెలుగులో 
గత వైభవాన్ని చూసుకుంటూ,
రాజకీయుల వాగ్దానాలని 
తృప్తిగా నెమరేసుకుంటూ ,
గుండె గాయాల్ని 
వైప్లవ్య గేయాలుగా మార్చుకుంటూ,
  సమరశంఖం పూరిస్తూ ,
గర్జిస్తూ ,
ప్రశ్నిస్తున్నాను. 
పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ?
మూగనేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని?
చైతన్యం కోసం ప్ర్రాణమివ్వని యువత శౌర్యమెందుకని?
బదులివ్వరేం?
భావిభారత బంగరు కలలని భుజానేసుకుని,
గంపెడాశతో వస్తున్నాను. 
స్వాగతించరేం?


1, జూన్ 2017, గురువారం

చివరి మజిలీ



[Boy sees girl:]
కలవరమే ఎంతున్నా,
మధువనిలా లోలోన,
పూసిన నీ చిరునవ్వే 
హాయి నింపే గుండెలోన.

[Girl sees boy:]
పరవశమే ఓ మైనా,
సుమశరమై నాపైన,
తాకిన నీ తొలి చూపే
శక్తి నింపే నరనరాన. 

[Boy meets girl:]
కనికరమే లేకుండా,
పయనించే కాలానా,
కలిగిన నీ పరిచయమే,
కలలు నింపే ప్రతి క్షణాన.

[They are in love:]
నీవశమై నేనున్నా,
అణువణువూ నాలోన
నిండిన నీ మధురిమలే
సిరులు నింపే బ్రతుకులోన.

[They traveled for years together :]
నాతోనే నీవున్నా
నీడల్లే వెంటున్నా,
మరువని నీ తొలివలపే
మరులు నింపే చివరిదాకా.

[చివరి మజిలీ:]
సఫలమే నా జన్మ
తరగదే నా ప్రేమ
విడువగ నా తుది శ్వాసే
మరల రానా మరోజన్మై.

9, ఆగస్టు 2016, మంగళవారం

పసిడి క్రాంతి

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (26/10/1997) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?"

ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
పసిడి క్రాంతి
క్షమాజాలు నరికి నవసమాజాలు నిర్మించుకున్న పాపానికి,
నేడు వనాలన్నీ తాము దహనమౌతూ, మనిషినీ శిక్షిస్తున్నాయి.
ప్రకృతి కాంతని క్షోభ పెట్టినందుకేనేమో,
నేడు ఓజోన్ పొర ఆల్ట్రా వయొలెట్లను వర్షిస్తోంది.
నాడు విస్తరణ కాంక్షతో పరస్పరం చంపుకున్నందుకేనేమో,
నేడు హైటెక్ తుపాకీ లు వాటంతటవే విషాన్ని గ్రక్కుతున్నాయి.
ధనార్జన ఇంధనంతో నడిచే పరిశ్రమలపై క్రమ్మిన,
స్వార్ధమేఘాలు వర్షించి, వికసించిన అవినీతి ప్రసూనాలు
ఘ్రాణించీ,ఘ్రాణించీ రాటుదేలిన,
మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?
భావి తరాలు స్వేచ్ఛా సౌహ్రార్ధ్ర వాయువులు పీల్చేదెన్నడో?



8, ఆగస్టు 2016, సోమవారం

మకుటమౌదాం


ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"ఎదల నడుమ ఎల్లలు లేని 
మానవీయతకు మకుటమౌదాం.
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.
మకుటమౌదాం
ఎవరో ఎక్కడో ట్రిగ్గర్ నొక్కుతారు,
వేలకొలదీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలసి పోతాయి.
ఎక్కడో ఒక చోట ఎప్పుడూ స్వాతంత్ర్య పోరాటం జరుగుతూనే ఉంటుంది.
అయినా భువన భవనంపై శాంతి బావుటా ఎగురుతూనే ఉంటుంది.
ప్రపంచం ఆర్ట్ గ్యాలరీలోని అన్ని చిత్రాల్లోనూ మృత్యువే.
అన్ని ముఖాలలోనూ భయమే.

ఒకే పుడమి ఒడిలో, ఒకే నింగి నీడన నిదురించే
ప్రపంచ ప్రజలారా రండి.
గతాన్ని మరచీ,
మతాన్ని పూడ్చీ,
ఎల్లలు దాటీ రారండి.

ఏకమౌదాం,
వసుధైక కుటుంబం లో మమేకమౌదాం.
మనసుంటే చూసీ, ప్రేముంటే పంచీ, సమైక్య జీవన సౌందర్యానికి  ప్రతీకలౌదాం.
'నేను నాద'నే తమో మేఘాల్ని చీల్చి, 'మనం' అనే ఉదయభానుణ్ణి వీక్షిద్దాం.
కలసి ఉంటే కానిదేమిటి? ఏకమైతే పోయేదేమిటి?
మదర్ చిరునవ్వు సాక్షిగా,
భువి పై శాంతిని ఆవాహనం చేద్దాం.
కలనైనా యుద్ధమెరుగని ప్రశాంతతకు చేరువౌదాం.
మచ్చుకైనా ఈర్ష్య దొరకని సచ్ఛీలతకు నెలవౌదాం.
ఎదల నడుమ ఎల్లలు లేని మానవీయతకు మకుటమౌదాం.
కరడు గట్టిన స్వార్ధ హృదయాలని బ్రద్దలు చేసి,
మరో ప్రస్థానానికి నాందీ వాచకం పలుకుదాం రండి.

ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.

9, మే 2016, సోమవారం

నిర్వచనాలు

పూజలు చేసేవాడు కాదు,

సాటి మనిషికి సాయం చేసిన వాడే,

సిసలు భక్తుడు.


కోట్లు ఖర్చు పెట్టే వాడు కాదు,
లేని వాడికి పట్టెడన్నం పెట్టినవాడే,
శ్రీమంతుడు. 

వేదాన్ని చదివినవాడు కాదు
జీవన వేదాన్ని నేర్చిన వాడే
పండితుడు.

ఆస్తులు పంచిన వాడు కాదు,
విలువలు పంచిన వాడే
అసలు తండ్రి.

నీతులు చెప్పేవాడు కాదు,
ఆచరించి చూపిన వాడే,
నిజమైన గురువు.

1, ఫిబ్రవరి 2016, సోమవారం

తెలుగు వెలుగు లో నా కవిత

నేను ఏదైనా వ్రాయగలను అని నేను పదో తరగతి కొచ్చేవరకూ నాకే తెలియదు. నా స్నేహితుడొకడు నన్ను ఏడిపించడానికి ఒక కవిత వ్రాసి ఇచ్చాడు. ఉడుకుమోత్తనంతో నేనూ వాడి పై ఒక తవిక బరికేసాను. తొంభయ్యవ దశకం లో  చాలామంది మధ్య తరగతి టీనేజ్ పిల్లల్లాగే నేనూ కమ్యూనిస్ట్ భావాలకి దగ్గరయ్యాక, మరి కొద్దిగా వ్రాయడం మొదలైంది. చుట్టూ ఉన్నవాళ్ళు బాగానే ఉన్నాయ్ అంటున్నా, నా తవికలు ఎప్పుడూ ప్రచురణార్హమైనవి అనుకోలేదు. తొంభై ఏడు లో ఆలిండియా రేడియో విజయవాడ కి తప్ప ( ప్రసారమయ్యాయి కూడాను), ఎప్పుడూ ఏ పత్రికకీ పంప లేదు. వ్రాసిన ఇరవై ఏళ్ళకి, ఈ మధ్య మా నాన్న గారు చొరవ తీసుకుని పంపిస్తే, తెలుగు వెలుగు వాళ్ళు అచ్చేసి, యాభై రూపాయలు కూడా పంపారు.

ఆ 'కవనం' అనే తవిక లంకె ఇక్కడ. 

http://ramojifoundation.org/flipbook/201601/magazine.html#/20

ఈ తవిక చూసి నాలాగే మీకు నవ్వొస్తే, మీ తప్పు కాదు. చలం చెప్పినట్లు చాలా వాటికి క్షమించాలి నన్ను.



28, జనవరి 2016, గురువారం

వివేచన

ఎన్ని జన్మాల దాస్యమో

సంసారమను కూపాన పడి

తెగ కలియ తిరిగాను.

ఏ జన్మలో పుణ్యమో

దాసోహమంటూ నీ పాదాల పై పడి

నిను శరణు వేడాను.

ప్రభూ!,

శివుడవో, కేశవుడవో,

విధాతవో, వేరొకరివో,

తల్లిని మించిన దైవం ఏదని

కరుణను మించిన ప్రార్ధన ఏదని

మనసుని మించిన మందిరమేదని

నాలోనే ఉండి నీ ప్రశ్నతో

నన్ను మనిషి గా మార్చావు.


10, డిసెంబర్ 2015, గురువారం

నిజం - నైజం

ఇది కాలం నేర్పిన పరుగు
క్షణ కాలం ఆగని పరుగు.


బ్రతుకు పందెం లో
గెలుపు కోసం
అలసట ఎరుగక
నిత్యం తీసే పరుగు.

మనసుకొక్కటీ,
ముఖానికొక్కటీ,
ముసుగులు వేసి
మనుషులు తీసే పరుగు.

దప్పిక తీర్చని
ఎడారి దారుల
కోర్కెల గుర్రం 
తానై  తీసే పరుగు.

తడారి పోయిన
రెప్పల మాటున
చిగురులు తొడిగిన
ఆశలు తీసే పరుగు.


ఇది కాలం నేర్పిన పరుగు.
క్షణ కాలం ఆగని పరుగు.

23, నవంబర్ 2014, ఆదివారం

స్నేహం


జ్ఞాపకాల తోటలో పూసే ప్రతి పువ్వూ
నీకోసం ఎదురు చూస్తూంటుంది.
బ్రతుకు బాటలో ఎదురయ్యే ప్రతి మలుపులోనూ
కన్ను నిన్ను వెతుక్కుంటుంది.
స్నేహమంటే ఇంటర్నెట్టో, ఫేస్ బుక్కో కాదని
టెక్నాలజీ వెక్కిరిస్తోంది.
రాకెట్ యుగమైనా, రాతి యుగమైనా
మనిషే నేస్తమని మనసుచెబుతోంది.
గ్లోబల్ విలేజీలో, అరచెయ్యంత ప్రపంచంలో
విజయాలని వెతుక్కుంటూ,
పోగొట్టుకున్నదేమిటో తెలియనట్టు
అలవోకగా నటించేస్తూ,
అలుపెరుగని పరుగులు తీస్తూ
ఇంకా ఈప్లాస్టిక్ గుండెకొట్టుకుంటూనే ఉంది.
అప్పుడు తిరిగిన పొలం గట్లూ,
సందులో ఆడిన గల్లీ క్రికెట్టూ,
ఊరి కాల్వలో కొట్టిన ఈత,
స్కూలి స్టేజి పై పాడిన పాటా,
తీరిక దొరకని కాలం తెచ్చిన
డిమెన్షియా నడ్డివిరగ్గొట్టి
ఉప్పెనలా ఉరికివచ్చేగతస్మృతుల వెల్లువలో
మనదారులు మళ్ళీ కలవాలనే
ఆశ చిగురిస్తూనే ఉంటుంది.
చీకటికి అలవాటు పడ్డ హృదయంలో
నీ చిరునవ్వు మిణుగురు లా వెలుగుతూనే ఉంటుంది.
స్నేహానికి మొదలే కానీ చివర లేదంటూ,
ఆకాశం జోల పాడుతూనే ఉంటుంది. 

1, నవంబర్ 2013, శుక్రవారం

కలల వాన

మధురమైన ఊహలేవో
మదిని అల్లుకున్నవేమో
విరహమంటి వింత మైకం
గుండె గూడు చేరెనేమో
వెన్నెలంటి నీ చిరునవ్వే
కనులలోన నిండెనేమో
ప్రణయమంటే చిన్నదానా
లోకువయ్యెనేమో నీకు?
కునుకు రాని కంటిలోనూ
కలల వాన కురిపించావు.

3, అక్టోబర్ 2013, గురువారం

విరహ వేడుక

గుండె గాయమల్లె నీవు
గొంతు లోన చేరుతావు.
పాట లాగ మారి నీవె
జ్ఞాపకాల్ని తోడుతావు.
సన్న నీటి ధార లాగ
కంటి నుండి జారుతావు.
గుండె చెమ్మగిల్లు వేళ
గాయాన్నే మరపిస్తావు.
విరహమంటే చిన్నదాన
వేడుకయ్యెనేమో నీకు?
కరకు రాయి గుండె వాణ్ణి
ప్రేమికుడిగా మార్చినావు!!


22, మార్చి 2013, శుక్రవారం

సమరం

కత్తులు దూసిన క్షణికావేశం
పుడమిని తడిమిన నెత్తుటి వర్షం   
అసువులు బాసిన జన సందోహం
అశ్రువులోడ్చిన మనసుల ఖేదం  
విజయం తో ఒక మది వీరంగం  
జయాపజయములు ఎవ్వరివైనా
సమరం ఇచ్చును తీరని శోకం.