హోమ్

30, మే 2019, గురువారం

తేయాకు పంతులు

వంశ పారంపర్యంగా వస్తున్న పౌరోహిత్యాన్ని కాదని, ఏదైనా వ్యాపారం చేస్తానని ఒక కొడుకు , అగ్రహారానికే పెద్ద అయిన తన తండ్రితో అనడం ఆ రోజుల్లో విడ్డూరమే. ఇప్పటి మాట కాదు, అప్పుడప్పుడే జన బాహుళ్యంలో కి టీ చొచ్చుకొస్తున్న రోజులు.

అలా రాజమహేంద్రవరం విడిచి, బెజవాడ చేరుకున్న ఆ పంతులు అసలు పేరు జనం మరచి పోయేరు. తేయాకు పంతులు అని మాత్రమే అందరికీ తెలుసు.

తేయాకు పంతులు, మొదట్లో ఒక బండి మీద వీధి వీధీ తిరిగి జనాలకి టీ తయారు చేసి పోస్తుండేవాడు. తన కులాన్ని దాచకుండానే అన్ని చోట్లా కలియ తిరిగి, అందరికీ తన టీ రుచి చూపించే వాడు. చెవులు కొరుక్కున్న వారు కొరుక్కున్నారు. మా వీధికి రావద్దన్న వారూ ఉన్నారు. అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చూసుకునేవాడు. టీ రుచి చూసి బాగుందన్న వారికి టీ పొడి అమ్మడమే కాక,ఎలా తయారుచేసుకోవాలో వివరించేవాడు. క్రమేణా పరగణా అంతా అందరికీ పరిచయమై పోయాడు.

దుకాణదారులకి కూడా టీ గురించిన విశేషాలు తెలుపుతూ, టోకు న వారికీ అమ్మేవాడు. టీ పొడి తో కొత్త ప్రయోగాలు చేసేవాడు. అవి అందరికీ రుచి చూపించేవాడు కూడా. రక రకాల మూలికలు పొడి చేసి, టీ పొడిలో లో కలుపుతూ వాటి నుంచి ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు రాబట్టేవాడు. నిజంగా ఆ మూలికా టీ పొడులు రోగాలను తగ్గించినా, తగ్గించక పోయినా జనాలు ఆ రుచి కి మైమరచి పోయి, అతని టీ పొడి కొనుక్కునేవారు.

ఇదంతా ఒక ఎత్తైతే, తండ్రి చే వెలివేయబడడం వల్ల, అతనికి అయిన సంబంధాలు రాలేదు. అతడే ఒక పిల్లను చూసుకుని పెండ్లాడాడు. అతడి ప్రయోజకత్వం చూసి పిల్లతరపు వాళ్ళు కూడా మురిసి పోయారు. తనకి తెలిసిన వాళ్ళందరికీ కులాంతర వివాహాలు చేసుకోవాలని చెబుతుండేవాడు.

కొందరికి రోగాలు నయం చేసే టీ వైద్యుడు గానూ, మరికొందరికి కుల వ్యవస్థ పై పోరాడే సంస్కర్త గాను, కొందరికి కిటుకు తెలిసిన వ్యాపారస్థుడు గానూ అగుపించేవాడు. అతని వ్యవహారం నచ్చని చాలా మంది అతడిని ద్వేషించేవారు కూడా.

ఇవన్నీ పట్టేవి కాదు అతనికి. టీ లు చేసీ చేసీ , జనాలకి తాగించీ తాగించీ, అతడు కొంత కాలానికి కేవలం టీ ల తో నే రోజులు వెళ్ళబుచ్చేవాడు. మరే ఇతర ఆహారం రుచించేది కాదు. ఎవరైనా "ఆరోగ్యం పాడైపోదుటయ్యా ఇలా టీలు తాగితే?" అంటే నవ్వి ఊరుకునేవాడు.

ఆ నవ్వు ఆంతర్యం ఎవరికీ తెలిసేది కాదు.

అతని వ్యాపారం లానే కుటుంబం కూడా పెరిగింది. ధనవంతుడైనాడు. చేతికింద పని వాళ్ళు టీ పొడి ని, రక రకాల మూలికలని సేకరించడం వంటి పనులు చేసేవారు. కాని అతని ఇంద్రజాలమంతా వాటన్నిటినీ మిశ్రమించే పాళ్ళలోనే ఉండేది. అది అతడు ఎవ్వరికీ చెప్పలేదు, చివరికి కట్టుకున్న భార్య కి కూడా. వ్యాపారం ఎంత విస్తరించినా, మొదటి నుంచీ తనకు వెన్ను దన్ను గా వున్న దుకాణదారులని తనే స్వయంగా కలిసేవాడు. వాళ్ళతో కలిసి టీ సేవించేవాడు. "పంతులూ, నీ చేతి టీ లో ఏదో మాయ ఉందయ్యా" అనేవాళ్ళు.

అతనేమైనా నల్ల మందు వంటివి కలుపుతాడేమో నని రకరకాలుగా పరీక్షించిన వారూ ఉన్నారు. పుకారులూ పుట్టించారు, అవేమీ అతని వ్యాపారాన్ని తగ్గించలేదు.

ఇలా చాల యేళ్ళు గడిచాయి. ఎనభై యేళ్ళొచ్చినా, తన బండి పై తిరిగి తన వ్యాపారం తనే చూసుకునేవాడు. ఒక దశలో అతడిని పిచ్చి వాడనుకున్నారు అనేకులు.

తన పిల్లలకు గాని, వాళ్ళ పిల్లలకు గాని తన వ్యాపారం అప్పగించలేదు. వాళ్ళూ ఎప్పుడూ అడగలేదు. అతడి వయసుకి ఏమాత్రం సంబంధం లేని అతడి ఉత్సాహం చూస్తే మరణం అతడి వద్దకు వచ్చే సాహసం చేస్తుందా అనుకునేవారు.

తాతా నీ అరోగ్య రహస్యం ఏమిటీ? అంటే, టీ ని చూపించేవాడు.

ఎవరికి అంతు చిక్కేది కాదు అతడి వ్యవహారం. ఎవరు టీ చేసినా తాగేవాడు కాదు తన టీ తనే తయారు చేసుకునేవాడు. ఆఖరికి తన కట్ట కడపటి మనవరాలు ఎంతో అద్భుతం గా టీ చేస్తుందని తెలిసినా ఎప్పుడూ రుచి చూసిన పాపాన పోలేదు. ఇంత అహంకారం పనికి రాదనేది భార్య. అతడు ఆ మాటని కొట్టి పారేసేవాడు.

నీడలా వెన్నంటే వున్న భార్య కాల ధర్మం చేసాక, కొంచం క్రుంగి పోయాడు.ఇన్నాళ్ళుగా అతని ఆరోగ్య రహస్యం టీ అనుకున్న అతడే, ఇప్పుడు ఆ రహస్యం తన భార్య తనకి అందించిన  శాంతి, స్వాంతనే అని గ్రహించాడు.

ఉత్సాహం తో పాటూ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది. డాక్టరైన తన మనవడు, తాత కి ఖరాఖండీ గా చెప్పేసాడు. ఇక టీ తాగ రాదనీ, దాని వల్లనే అతడి ఆరోగ్యం చెడిపోయిందనీను.
ఒప్పుకోలేదు తేయాకు పంతులు. తన పేరులోనే టీ ఉందనీ, దానిని దూరం చేయవద్దనీ వేడుకున్నాడు. పడింది కాదు.


ఎవరు ఎంత వారించినా, తిరుగుతూనే ఉండేవాడు. పని లో పడితే అనారోగ్యం తనని ఏమీ చేయదనే వాడు. మొండి ఘటం.
ఒక రోజు ఇక తన తేయాకు రహస్యాన్ని మరొకరికి బదిలీ చేయాల్సిన అవసరం వచ్చిందని గ్రహించాడు. తన కుటుంబాన్నంతటినీ రమ్మని కబురంపాడు. ఎక్కెడెక్కడి వాళ్ళూ వచ్చి చేరారు.
వాళ్ళకి తన కథ అంతా వినిపించాడు. తన ప్రతిపాదన వారి ముందు పెట్టాడు.
తన ఆస్థి నంతా పంచుతాననీ, కానీ తేయాకు రహస్యం కావాలనుకున్న వారు తన వ్యాపారాన్నీ, ఆ రహస్యాన్నీ మాత్రమే తీసుకోవాలనీ, ఆస్థి ఆశించ రాదని చెప్పాడు. వ్యాపారం తీసుకోవడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఏ టీ వల్ల తానింతటి వాడై, ఇంత మంది జీవితాల్ని నిలబెట్టాడో ఆ టీ ఇప్పుడు ఎవరికీ వద్దన్నారు.
తనకెంతో ఇష్టుడైన ఒక మనవడినగాడు. ఆ మనవడన్నాడూ, "తాతా నీ వ్యాపారం తీసుకుంటే కష్ట పడాల్సి వస్తుంది. ఇప్పుడు నీ టీ కొనేవారంతా నిన్ను చూసే కొంటున్నారు. నీ వారసుడికి నీ అంత లౌక్యం, దక్షత లేక పోతే ఆ రహస్యం తెలిసినా వ్యాపారం నిలబడదూ" అని.
నిజమే అనిపించింది పంతులుకి, నెమ్మదిగా తన వ్యాపారాన్ని తనే  మూసేసాడు. తనని నమ్ముకున్న పని వారందిరికీ ఒక దారి చూపించాడు. ఇక ఏ వ్యాపకం లేకపోవడం, ఆరోగ్యం సన్నగిల్లడం, వల్ల పూర్తిగా మంచాన పడ్డాడు.
'ఆనాయేసేన మరణం ,వినా దైన్యేన జీవనం" ఉండాలనేవాడు ఎప్పుడూ. అందుకే మంచాన తీసుకుని, పోకుండా చూడ మని ఆ దేవుణ్ణి మనసులోనే ప్రార్ధించేవాడు.

ఇహనో ఇప్పుడో అన్నట్లుంది ప్రాణం.

శ్వాస ఎగ తంతోంది, ఎక్కిళ్ళు పెచ్చు మీరాయి. అయినవాళ్ళందరూ ఒక్కొక్కరే వచ్చారు.
తులసి తీర్థం తెచ్చారు. అతడి కళ్ళల్లో ఏదో బాధ. చెప్పలేకపోతున్నాడు. ఆవిడే ఉంటే చప్పున తెలుసుకునేది.
పెద్ద కూతురంది, తులసి నీళ్ళు కాదు టీ పట్రండని. ఎలా తెస్తారు? ఈ మనిషి జీవితంలో ఎవరు టీ చేసినా తాగలేదే?
ఐనా ధైర్యం చేసి తెచ్చారు. తాగలేదు. కట్ట కడపటి మనవరాలు వచ్చింది. ఆమె బాగా తయారు చేస్తుందని పేరుంది , ఈ సారి ఆమె చేసిచ్చింది, తాగాడు. మొదటి గుక్క లోనే కళ్ళళ్ళో ఏదో మెరుపు.
ఇది అచ్చం తను చేసుకునే టీ లానే ఉంది. ఇదివరకెన్నడూ ఎవరూ ఈ ముక్క చెప్పలేదు తనకి. బాగా చేస్తుందని తెలుసు కానీ తన లా..
దైవికమే అనుకున్నాడు. అలా ఆ టీ తాగుతూనే , ఏ టీ ని తన రక్తం లో , జీవితం లో , మనసులో నింపుకుని బ్రతికాడో, అదే టీ తాగుతూ .. తృప్తిగా ..
అలా నే ఒరిగి పోయాడు.
ఆ మనవరాలికీ తెలియదు ఆ రోజు తను చేసిన టీ అచ్చు గుద్దినట్లు తాత టీ లానే ఉందని. మళ్ళా ఎప్పుడు తను టీ చేసినా,ఆ ప్రాంతం లో ఎవరు టీ చేసుకున్నా తేయాకు పంతులు టీ లా లేదనుకునే వారు.





17 కామెంట్‌లు:

  1. ఇది కథగా అనిపించడం లేదు .
    వాస్తవమనిపిస్తోంది .
    నిజంగా కథే ఐతే , హేట్సాఫ్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. వెంకట రాజారావు గారు, ధన్యవాదాలు. ఇది కథేనండి.టీ పై నాకున్న అతి ప్రేమ వల్ల,ఏదైనా వ్రాయాలని ఎంతో కాలం ప్రయత్నించగా ఈ కథ వచ్చింది. మీ మెచ్చుకోలు కి ధన్యావాదాలు

      తొలగించండి
  2. కథ అర్హ్తమయ్యీ కానట్లుంది నాకు. అదేమంత పట్టించుకోదగిన విషయ కాదు లెండి. కానీ చివరిదాకా చదివించింది మీ కథ. మీ ప్రయత్నం బావుంది, మాధవ్ గారు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ.నా ఆబోరు దక్కించారు.ఒకరైతే మరీ చిన్న పిల్లలు వ్రాసిన వ్యాసం లా ఉందన్నారు.

      తొలగించండి
    2. // "ఆబోరు" //
      మీది విజయనగర ప్రాంతమా, మాధవా 🙂 ?

      తొలగించండి
    3. లేదండీ. పుట్టింది గుంటూరు, పెరిగింది పశ్చిమ గోదావరి.

      తొలగించండి
    4. గుండమ్మ కథ లో అంజి నోటివెంట నరసరాజు గారు పలికించారీమాటని. అదే వినడం, నిఘంటువు లో శోధించి తెలుసు కున్నప్పటినుంచీ వాడుతున్నా ఈ మాటని.

      తొలగించండి
    5. "ఆబోరు" అనే పదాన్ని ఎక్కువగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మాండలికంలో వాడతారట. గురజాడ అప్పారావు గారి "కన్యాశుల్కం" నాటకంలో కనిపిస్తుందీ మాట. ఆ నాటకం మొత్తం ఆ మాండలికంలోనే నడుస్తంంది కదా.

      తొలగించండి
    6. ఔనుస్మీ మరిచేపోయాను.

      తొలగించండి