శ్రీశ్రీ గారి రచనల పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చిన సమీక్షలన్నీ దాదాపుగా అభినందన పూర్వకంగా ఉన్నవే తప్ప, వారి రచనలు సమాజానికి అంత ఉపయోగ పడవనే వాదన నేనెప్పుడూ వినలేదు. కానీ ఆ కాలం లోనే అటువంటి ఒక ఆలోచన ని వెలిబుచ్చిన ఒక ఉపోద్ఘాతం తటస్థించడమే ఈ టపా వ్రాయడానికి ప్రేరణ.
ఈ మధ్య ప్రైమ్ లో సంక్రాంతి అల్లుళ్ల సినిమా చూస్తుంటే, ఒక్కసారిగా ...
అత్తారింటికి వెళ్లి, మావగారి తో భోజనం చేసే వేళ అవుతోందని తెలిసీ, కాఫీ హోటలు కెళ్ళి ఇడ్లీలు తిని వచ్చి, మరి ఇక భోజనం చెయ్యలేక, మొహమాటం తో ఒళ్ళు కులాసాగా లేదని అబద్ధం చెప్పి, రోజంతా పస్తుండి, నానా అవస్థలూ పడ్డ సుందరమ్మ గారి అల్లుడు శర్మా….
సత్యవతి తలుపు వేగిరంగా తియ్యక పోగా, అనాల్సిన ఇంగిలీషు ముక్కలు అనలేదని తన అల్లుడు కృష్ణుడూ; ఇచ్చిన ఫలహారమూ, కాఫీ మొత్తం పుచ్చేసుకుని ఠాంక్ ఠాంక్ మనాల్సిన మగడు అలా అనలేదని కూతురు సత్యవతీ, ఒకరిపై ఒకరు అలిగి, తనని హడలెత్తించిన ఉదంతాన్ని చర్చించుకున్న మంగమ్మా సుందరమ్మా ....
సరైన వయసులో తాలూకా ఆఫీసు లో చేరి ఉంటే, డిప్టీ కలెక్టరు అవ్వగలిగి ఉండీ, జీతానికి వృద్ధి అంటూ లేని మాస్టరీ పని చేస్తూ, పండక్కి కూసింత ముందుగానే వచ్చిన అల్లుడికీ, కూతురుకి, నెల బడ్జెట్ అంతా వెచ్చించి బట్టలు కొని, మళ్ళా మరొక్కసారి పద్దు రాయించి అల్లుడికి బట్టలు కొనాల్సి వచ్చినా, తాను మాత్రం రూపాయి కాసంత చిరిగిన ధోవతి ని ఠలాయించి కుట్టుకుని తొడుక్కుని, కొత్త బట్టలు కట్టుకున్న కూతురినీ, అల్లుడిని చూసి మురిసి పోయిన మావగారు ...
వీళ్లంతా గుర్తుకొచ్చి, వెంటనే చదివి చాలా కాలమైపోయిన ముని మాణిక్యం గారి అల్లుళ్ళు పుస్తకం తెరిచాను.
ఒకప్పుడు, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం మొదటి భాగం చదివి ఆనందించాక, రెండవ భాగం అంత హాస్య స్ఫోరకం గా అనిపించక పోవడం చేత, ఇక వారి రచనల పట్ల ఆసక్తి కలగలేదు. వీరూ, సదరు ముని మాణిక్యం వారూ (ఇద్దరూ నరసింహులే కావడం వల్ల అనుకుంటా) ఒక్కరే నని భ్రమించి, ఈ అల్లుళ్ళు పుస్తకాన్ని చాలా కాలం విస్మరించేను కూడా.
ఇక యుక్త వయసులో మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యతా పత్రం చదివాక, నేను చాలా పుస్తకాలకున్న ముందుమాటలు చదవడం మానుకున్నాను. ఎందుకో ఇహ ఇంతకు మించిన ముందు మాటలుండవనే అనుకున్నాను. అలానే ఈ అల్లుళ్ళు ముందుమాటను కూడా చదవలేదు అప్పట్లో.
ఈసారెందుకో ముందు మాట చూస్తిని కదా, శ్రీశ్రీ వారు దర్శనమిచ్చారు మొదటి రెండు పంక్తుల్లోనే.
"దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!"
అని శ్రీశ్రీ అంటే,
"నేను ఎక్కడికీ పొమ్మనను, ఇంట్లోనే ఉండమంటాను. ఒకవేళ ఏదైనా పని మీద, ఎక్కడికైనా వెళ్ళినా సాయింత్రానికి ఇంటికి వచ్చి , ఆవిడ ఇచ్చిన కాఫీ పుచ్చుకొని పిల్లలతో, హాయిగా ఆడుకొంటూ కాలం గడపమంటాను" అంటారు ముని మాణిక్యం.
నెత్తురు వాగులూ, ఆకలి ఏడ్పులూ నాకు కనిపించవు, వినిపించవు అంటారాయన. ఏదో కలో అంబలో త్రాగి ప్రతీవాడూ, తృప్తి తోనూ, ఆనందంతోనూ,హాయిగా జీవిస్తున్నట్లు తోస్తుందాయన మనస్సుకి.
జీవితం లో సుఖ దుఃఖాలు ఈనాడు కొత్తగా రాలేదు, ఎప్పుడూ ఉన్నవే. ఏడ్చి ఏమి లాభం?
జీవితంలో తృప్తీ ఆనందమూ ఉంటే ఈ ఏడ్పులు తగ్గిపోవూ?
నిజానికి నడివయసుకొచ్చాక, యవ్వనం లో ని ఆవేశ కావేశాలు తగ్గి, సంసార సాగరం లో ఎదురీత ఈదే సామాన్యులకి ముని మాణిక్యం వారి అభిప్రాయం సరైనదేననిపించక మానదు.
"ప్రతీ అన్యాయానికి స్పందించాలని మధ్యతరగతి వాడు అనుకున్నా, పాపం వాడికి సెలవున్న రోజున, కోర్టుకి కూడా సెలవే" అని ఎక్కడో విన్నట్లు గుర్తు. అందుకనే చిన్న చిన్న ఆనందాల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ, సుఖ జీవన యానం చేసేద్దాం.
అల్లుళ్ళు ఆన్లైన్ లో చదవాలనుకుంటే scribd లో ఉంది చూడండి.
ప్రతీ అన్యాయానికి స్పందించాలని మధ్యతరగతి వాడు అనుకున్నా, పాపం వాడికి సెలవున్న రోజున, కోర్టుకి కూడా సెలవే - ఇది బాగుంది.
రిప్లయితొలగించండిఈ అల్లుళ్ళు పుస్తకం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మాధవ్ గారు. చదువుతాను వీలు చేసుకొని.
ధన్యోస్మి.
తొలగించండిమంచి పుస్తకం పరిచయం చేసినందుకు థాంక్స్, మాధవ్ గారూ.
రిప్లయితొలగించండిమునిమాణిక్యం వారి రచనలన్నీ ఆణిముత్యాలే. "మంచివాళ్ళు : మాటతీరు" అని వారిదే మరొక చక్కటి రచన. archive.org లో దొరుకుతుంది. ఈ క్రింది లింకులో నుండి pdf ను దింపుకోవచ్చు.
మంచివాళ్ళు : మాటతీరు (మునిమాణిక్యం నరసింహారావు గారి రచన)
https://ia801306.us.archive.org/10/items/MunimanikyamNarasimharao/manchi_vallu_mata_thiru%2C%20munimanikyam_narasimharao.pdf
మంచివాళ్ళు మాటతీరు చదివినట్టు గుర్తు, మళ్ళీ మరో సారి చదువుతా, మీరు గుర్తు చేసినందుకైనా.
తొలగించండిధన్యవాదాలు.
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. థాంక్స్, మాధవ్‌గారు!
రిప్లయితొలగించండిఇంకో మంచి పుస్తకానికి లింక్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, విన్నకోట నరసింహారావుగారు!
ధన్యవాదాలండీ. మరిన్ని ఆ నాటి పుస్తకాలని పరిచయం చేయడానికి ప్రోత్సాహం లభించింది.
తొలగించండి