హోమ్

సమీక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమీక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మే 2019, గురువారం

అల్లుళ్ళు - శ్రీశ్రీ - సుఖ జీవన యానం


శ్రీశ్రీ గారి రచనల పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చిన సమీక్షలన్నీ దాదాపుగా అభినందన పూర్వకంగా ఉన్నవే తప్ప, వారి రచనలు సమాజానికి అంత ఉపయోగ పడవనే వాదన నేనెప్పుడూ వినలేదు. కానీ ఆ కాలం లోనే అటువంటి ఒక ఆలోచన ని వెలిబుచ్చిన ఒక ఉపోద్ఘాతం తటస్థించడమే ఈ టపా వ్రాయడానికి ప్రేరణ.

ఈ మధ్య ప్రైమ్ లో సంక్రాంతి అల్లుళ్ల సినిమా చూస్తుంటే, ఒక్కసారిగా ...

అత్తారింటికి వెళ్లి, మావగారి తో భోజనం చేసే వేళ అవుతోందని తెలిసీ, కాఫీ హోటలు కెళ్ళి ఇడ్లీలు తిని వచ్చి, మరి ఇక భోజనం చెయ్యలేక, మొహమాటం తో ఒళ్ళు కులాసాగా లేదని అబద్ధం చెప్పి, రోజంతా పస్తుండి, నానా అవస్థలూ పడ్డ సుందరమ్మ గారి అల్లుడు శర్మా….

సత్యవతి తలుపు వేగిరంగా తియ్యక పోగా, అనాల్సిన ఇంగిలీషు ముక్కలు అనలేదని తన అల్లుడు కృష్ణుడూ; ఇచ్చిన ఫలహారమూ, కాఫీ మొత్తం పుచ్చేసుకుని  ఠాంక్ ఠాంక్ మనాల్సిన మగడు అలా అనలేదని కూతురు సత్యవతీ, ఒకరిపై ఒకరు అలిగి, తనని హడలెత్తించిన ఉదంతాన్ని చర్చించుకున్న మంగమ్మా సుందరమ్మా ....

సరైన వయసులో తాలూకా ఆఫీసు లో చేరి ఉంటే, డిప్టీ కలెక్టరు అవ్వగలిగి ఉండీ,  జీతానికి వృద్ధి  అంటూ లేని మాస్టరీ పని చేస్తూ, పండక్కి కూసింత ముందుగానే వచ్చిన అల్లుడికీ, కూతురుకి, నెల బడ్జెట్ అంతా  వెచ్చించి బట్టలు కొని, మళ్ళా మరొక్కసారి పద్దు రాయించి అల్లుడికి బట్టలు కొనాల్సి వచ్చినా,  తాను మాత్రం రూపాయి కాసంత చిరిగిన ధోవతి ని ఠలాయించి కుట్టుకుని తొడుక్కుని, కొత్త బట్టలు కట్టుకున్న కూతురినీ, అల్లుడిని చూసి మురిసి పోయిన మావగారు ...

వీళ్లంతా గుర్తుకొచ్చి, వెంటనే చదివి చాలా కాలమైపోయిన ముని మాణిక్యం గారి అల్లుళ్ళు పుస్తకం తెరిచాను.

ఒకప్పుడు, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం మొదటి భాగం చదివి ఆనందించాక, రెండవ భాగం అంత హాస్య స్ఫోరకం గా అనిపించక పోవడం చేత, ఇక వారి రచనల పట్ల ఆసక్తి కలగలేదు. వీరూ, సదరు ముని మాణిక్యం వారూ (ఇద్దరూ నరసింహులే కావడం వల్ల అనుకుంటా) ఒక్కరే నని భ్రమించి, ఈ అల్లుళ్ళు పుస్తకాన్ని చాలా కాలం విస్మరించేను కూడా.
ఇక యుక్త వయసులో మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యతా పత్రం చదివాక, నేను చాలా పుస్తకాలకున్న ముందుమాటలు చదవడం మానుకున్నాను. ఎందుకో ఇహ ఇంతకు మించిన ముందు మాటలుండవనే అనుకున్నాను. అలానే ఈ అల్లుళ్ళు ముందుమాటను కూడా చదవలేదు అప్పట్లో.

 ఈసారెందుకో ముందు మాట చూస్తిని కదా, శ్రీశ్రీ వారు దర్శనమిచ్చారు మొదటి రెండు పంక్తుల్లోనే.
"దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!"
అని శ్రీశ్రీ అంటే,
"నేను ఎక్కడికీ పొమ్మనను, ఇంట్లోనే ఉండమంటాను.  ఒకవేళ ఏదైనా పని మీద, ఎక్కడికైనా వెళ్ళినా సాయింత్రానికి ఇంటికి వచ్చి , ఆవిడ ఇచ్చిన కాఫీ పుచ్చుకొని పిల్లలతో, హాయిగా ఆడుకొంటూ కాలం గడపమంటాను" అంటారు ముని మాణిక్యం.

నెత్తురు వాగులూ, ఆకలి ఏడ్పులూ నాకు కనిపించవు, వినిపించవు అంటారాయన. ఏదో కలో అంబలో త్రాగి ప్రతీవాడూ, తృప్తి తోనూ, ఆనందంతోనూ,హాయిగా జీవిస్తున్నట్లు తోస్తుందాయన మనస్సుకి.

జీవితం లో సుఖ దుఃఖాలు ఈనాడు కొత్తగా రాలేదు, ఎప్పుడూ ఉన్నవే. ఏడ్చి ఏమి లాభం?
జీవితంలో తృప్తీ ఆనందమూ ఉంటే ఈ ఏడ్పులు తగ్గిపోవూ?

నిజానికి నడివయసుకొచ్చాక, యవ్వనం లో ని ఆవేశ కావేశాలు తగ్గి, సంసార సాగరం లో ఎదురీత ఈదే సామాన్యులకి ముని మాణిక్యం వారి అభిప్రాయం సరైనదేననిపించక మానదు.

"ప్రతీ అన్యాయానికి స్పందించాలని మధ్యతరగతి వాడు అనుకున్నా, పాపం వాడికి సెలవున్న రోజున, కోర్టుకి కూడా సెలవే" అని ఎక్కడో విన్నట్లు గుర్తు.  అందుకనే చిన్న చిన్న ఆనందాల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ, సుఖ జీవన యానం చేసేద్దాం.

అల్లుళ్ళు ఆన్లైన్ లో చదవాలనుకుంటే scribd లో ఉంది చూడండి.




29, జనవరి 2016, శుక్రవారం

వెయ్యి కొట్టిన రామ్@శృతి.కామ్ - సమీక్ష

ఈ బ్లాగు మొదలు పెట్టిన తర్వాత వెయ్యి వీక్షణలు పూర్తి చేసుకున్న మొదటి టపా, రామ్@శృతి.కామ్ పై నేను రాసిన సరదా సమీక్ష.

వెయ్యి వీక్షణలు

30, మే 2013, గురువారం

రామ్@శృతి.కామ్ - ఒక యాదృచ్ఛిక సమీక్ష

"ఒక తెలివైన వాడు ఎంతో కష్టపడి ఒక రచన చేస్తాడు. అంత కన్నా తెలివైన పాఠకుడు ఆ రచన ని చదివి బాగుందనో, బాలేదనో ఒక్క ముక్క లో విషయాన్ని తేల్చి పారేస్తాడు. అలాగని రచయిత తక్కువా, పాఠకుడు ఎక్కువా కాదు. ఇద్దరూ సమానమే. కాకపోతే పాఠకుడు కొంచం ఎక్కువ సమానం."

రామ్@శృతి.కామ్ -  పుస్తకం తెరిచిన దగ్గర నుండీ, పూర్తయ్యే వరకూ ఏక బిగిన చదివించగల సత్తా వున్న రచన.

         
న్నో పరీక్షలు, కొన్నే మార్కులు అంటూ మొదలైనా, ఎన్నో ఛలోక్తులు (ఆంగ్లం లో అందంగా చెప్పాలంటే పంచ్ డైలాగ్స్), కొన్నే బొమ్మలు. ఎన్నో పాటలు (నిజ్జం గా నిజం), కొన్ని కొన్ని కన్నీళ్ళూ కలిపి రంగరించి వండిన అచ్చ తెలుగు వంటకం (స్వగృహ లో ఇరవై రూపాయలకి కొన్నది కాదు).
          
         ఎన్నో ఏళ్ళుగా జావా తో పోరాడుతూ జవ జీవాలు కోల్పోతున్న నా లాంటి వాళ్ళు తేలిగ్గా ఐడెంటిఫై చేసుకోగలిగిన ఓ సగటు సాఫ్ట్వేర్ ఇంజినీరూ, చచ్చేవరకూ చదవాలనుకున్న సగటు అందమైన శృతి గల హైదరాబాదు, వీళ్ళకి తోడు నిర్మల లాంటి (నాకు తారసపడింది ఇలాంటివాళ్ళే ఎక్కువ)  బాసిణీ, రవి (సినిమాల్లో సహాయ నటుడిలా) లాంటి స్నేహితుడూ, మనసున్న మారాజు శ్రీనివాసరాజు (సాఫ్ట్వేర్ లో ఇలాంటి వాళ్ళు అరుదు) వెరసి, ఈ నవతరం రచన, మెలో డ్రమేటిగ్గా కాకుండా,  ఇంట్లో మనుషులు మాట్లాడుకునే భాష లో వుంది.  అందుచేతనే చదువరి త్వరగా కనెక్టు అయ్యే అవకాశం ఉంది. 
            త్రివిక్రమ్ పేరు తో పాటు శైలిని కూడా వాడుకున్నట్టు అనిపించినప్పటికీ,సంభాషణలు హాయిగా నవ్విస్తాయి. పంచ్ లలో కూడా ఒక సందేశం వుంటుంది.
     ఇంజినీరింగ్ నాలుగేళ్ళలో పిల్లకాయలు కేవలం ఇంజినీరింగ్ మాత్రమే చేస్తే మన దేశం ఎప్పుడో అమెరికాకు అమ్మమ్మ అయ్యేది.  
             ఎంత చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ కథ మొదలుతుందో అంతే సున్నితం గా కొన్ని హృద్యమైన భావాలు కూడా చదువరి మనసుని కదిలిస్తాయి.
    కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కళ్ళు మాట్లాడుకుంటాయి పెదవులు చూస్తాయి. 
            శంకర్ ఉదంతం లో అమ్మానాన్నల ప్రేమని వర్ణించిన తీరు ఆలోచింపచేస్తుంది. మొదటి అమెరికా (లేదా విదేశీ) ప్రయాణం వివరాలు, అరే మనకీ ఇలానే జరిగింది కదా అనిపిస్తాయి. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికీ విడిపోదామనుకునే జంటలకి ఒక ఉదాహరణ గా కథ సాగి, అందమైన మలుపు తో ముగుస్తుంది.

సినిమా భాష లో చెప్పాలంటే,ఇది ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్.
            ఆక్కడక్కడా అక్షర దోషాలు, వీలైనంత తెలుగు లో రాయాలన్న తపన కొన్ని పదాల్లో కనపడతాయి. సామాన్యుని వాడుక భాషలోకి కొన్నిఆంగ్ల పదాలు ఎప్పుడో చేరిపోయాయి. ఆలాంటి పదాలని యథాతథంగా తర్జుమా చెయ్యటంకంటే అలానే వాడి వుంటే బాగుండేదనిపించింది.

           రచయిత తాను మొదలు పెట్టిన ప్రయాణం లో పాఠకుడిని కలుపుకుని చివరి వరకూ ఆగకుండా తీసుకెళ్ల గలిగితే ఆ రచన విజయవంతమైనట్లే. పాఠకుడు కోరుకునేదీ అదే.
                             
ఈ పుస్తకం చదవాలంటే ఇక్కడ దొరుకుతుంది.  బొమ్మ, నీలం రంగు వాక్యాలు రామ్ పుస్తకం లోంచి సంగ్రహించినవే.

తోక: ఈ పుస్తకాన్ని ఏ రైల్లోనో, బస్సులోనో, ఇతర బహిరంగ ప్రదేశాలలోనో చదవాలనుకుంటే, మీ చుట్టుపక్కల వాళ్ళని ముందుగానే హెచ్చరించండి. మీరు ఉన్నట్టుండి పగలబడి నవ్వుతుంటే మీకు లాఫ్టర్ డయేరియా వచ్చిందేమోనని వాళ్ళు కంగారు పడే ప్రమాదం ఉంది.