హోమ్

30, మే 2019, గురువారం

తేయాకు పంతులు

వంశ పారంపర్యంగా వస్తున్న పౌరోహిత్యాన్ని కాదని, ఏదైనా వ్యాపారం చేస్తానని ఒక కొడుకు , అగ్రహారానికే పెద్ద అయిన తన తండ్రితో అనడం ఆ రోజుల్లో విడ్డూరమే. ఇప్పటి మాట కాదు, అప్పుడప్పుడే జన బాహుళ్యంలో కి టీ చొచ్చుకొస్తున్న రోజులు.

అలా రాజమహేంద్రవరం విడిచి, బెజవాడ చేరుకున్న ఆ పంతులు అసలు పేరు జనం మరచి పోయేరు. తేయాకు పంతులు అని మాత్రమే అందరికీ తెలుసు.

తేయాకు పంతులు, మొదట్లో ఒక బండి మీద వీధి వీధీ తిరిగి జనాలకి టీ తయారు చేసి పోస్తుండేవాడు. తన కులాన్ని దాచకుండానే అన్ని చోట్లా కలియ తిరిగి, అందరికీ తన టీ రుచి చూపించే వాడు. చెవులు కొరుక్కున్న వారు కొరుక్కున్నారు. మా వీధికి రావద్దన్న వారూ ఉన్నారు. అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చూసుకునేవాడు. టీ రుచి చూసి బాగుందన్న వారికి టీ పొడి అమ్మడమే కాక,ఎలా తయారుచేసుకోవాలో వివరించేవాడు. క్రమేణా పరగణా అంతా అందరికీ పరిచయమై పోయాడు.

దుకాణదారులకి కూడా టీ గురించిన విశేషాలు తెలుపుతూ, టోకు న వారికీ అమ్మేవాడు. టీ పొడి తో కొత్త ప్రయోగాలు చేసేవాడు. అవి అందరికీ రుచి చూపించేవాడు కూడా. రక రకాల మూలికలు పొడి చేసి, టీ పొడిలో లో కలుపుతూ వాటి నుంచి ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు రాబట్టేవాడు. నిజంగా ఆ మూలికా టీ పొడులు రోగాలను తగ్గించినా, తగ్గించక పోయినా జనాలు ఆ రుచి కి మైమరచి పోయి, అతని టీ పొడి కొనుక్కునేవారు.

ఇదంతా ఒక ఎత్తైతే, తండ్రి చే వెలివేయబడడం వల్ల, అతనికి అయిన సంబంధాలు రాలేదు. అతడే ఒక పిల్లను చూసుకుని పెండ్లాడాడు. అతడి ప్రయోజకత్వం చూసి పిల్లతరపు వాళ్ళు కూడా మురిసి పోయారు. తనకి తెలిసిన వాళ్ళందరికీ కులాంతర వివాహాలు చేసుకోవాలని చెబుతుండేవాడు.

కొందరికి రోగాలు నయం చేసే టీ వైద్యుడు గానూ, మరికొందరికి కుల వ్యవస్థ పై పోరాడే సంస్కర్త గాను, కొందరికి కిటుకు తెలిసిన వ్యాపారస్థుడు గానూ అగుపించేవాడు. అతని వ్యవహారం నచ్చని చాలా మంది అతడిని ద్వేషించేవారు కూడా.

ఇవన్నీ పట్టేవి కాదు అతనికి. టీ లు చేసీ చేసీ , జనాలకి తాగించీ తాగించీ, అతడు కొంత కాలానికి కేవలం టీ ల తో నే రోజులు వెళ్ళబుచ్చేవాడు. మరే ఇతర ఆహారం రుచించేది కాదు. ఎవరైనా "ఆరోగ్యం పాడైపోదుటయ్యా ఇలా టీలు తాగితే?" అంటే నవ్వి ఊరుకునేవాడు.

ఆ నవ్వు ఆంతర్యం ఎవరికీ తెలిసేది కాదు.

అతని వ్యాపారం లానే కుటుంబం కూడా పెరిగింది. ధనవంతుడైనాడు. చేతికింద పని వాళ్ళు టీ పొడి ని, రక రకాల మూలికలని సేకరించడం వంటి పనులు చేసేవారు. కాని అతని ఇంద్రజాలమంతా వాటన్నిటినీ మిశ్రమించే పాళ్ళలోనే ఉండేది. అది అతడు ఎవ్వరికీ చెప్పలేదు, చివరికి కట్టుకున్న భార్య కి కూడా. వ్యాపారం ఎంత విస్తరించినా, మొదటి నుంచీ తనకు వెన్ను దన్ను గా వున్న దుకాణదారులని తనే స్వయంగా కలిసేవాడు. వాళ్ళతో కలిసి టీ సేవించేవాడు. "పంతులూ, నీ చేతి టీ లో ఏదో మాయ ఉందయ్యా" అనేవాళ్ళు.

అతనేమైనా నల్ల మందు వంటివి కలుపుతాడేమో నని రకరకాలుగా పరీక్షించిన వారూ ఉన్నారు. పుకారులూ పుట్టించారు, అవేమీ అతని వ్యాపారాన్ని తగ్గించలేదు.

ఇలా చాల యేళ్ళు గడిచాయి. ఎనభై యేళ్ళొచ్చినా, తన బండి పై తిరిగి తన వ్యాపారం తనే చూసుకునేవాడు. ఒక దశలో అతడిని పిచ్చి వాడనుకున్నారు అనేకులు.

తన పిల్లలకు గాని, వాళ్ళ పిల్లలకు గాని తన వ్యాపారం అప్పగించలేదు. వాళ్ళూ ఎప్పుడూ అడగలేదు. అతడి వయసుకి ఏమాత్రం సంబంధం లేని అతడి ఉత్సాహం చూస్తే మరణం అతడి వద్దకు వచ్చే సాహసం చేస్తుందా అనుకునేవారు.

తాతా నీ అరోగ్య రహస్యం ఏమిటీ? అంటే, టీ ని చూపించేవాడు.

ఎవరికి అంతు చిక్కేది కాదు అతడి వ్యవహారం. ఎవరు టీ చేసినా తాగేవాడు కాదు తన టీ తనే తయారు చేసుకునేవాడు. ఆఖరికి తన కట్ట కడపటి మనవరాలు ఎంతో అద్భుతం గా టీ చేస్తుందని తెలిసినా ఎప్పుడూ రుచి చూసిన పాపాన పోలేదు. ఇంత అహంకారం పనికి రాదనేది భార్య. అతడు ఆ మాటని కొట్టి పారేసేవాడు.

నీడలా వెన్నంటే వున్న భార్య కాల ధర్మం చేసాక, కొంచం క్రుంగి పోయాడు.ఇన్నాళ్ళుగా అతని ఆరోగ్య రహస్యం టీ అనుకున్న అతడే, ఇప్పుడు ఆ రహస్యం తన భార్య తనకి అందించిన  శాంతి, స్వాంతనే అని గ్రహించాడు.

ఉత్సాహం తో పాటూ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది. డాక్టరైన తన మనవడు, తాత కి ఖరాఖండీ గా చెప్పేసాడు. ఇక టీ తాగ రాదనీ, దాని వల్లనే అతడి ఆరోగ్యం చెడిపోయిందనీను.
ఒప్పుకోలేదు తేయాకు పంతులు. తన పేరులోనే టీ ఉందనీ, దానిని దూరం చేయవద్దనీ వేడుకున్నాడు. పడింది కాదు.


ఎవరు ఎంత వారించినా, తిరుగుతూనే ఉండేవాడు. పని లో పడితే అనారోగ్యం తనని ఏమీ చేయదనే వాడు. మొండి ఘటం.
ఒక రోజు ఇక తన తేయాకు రహస్యాన్ని మరొకరికి బదిలీ చేయాల్సిన అవసరం వచ్చిందని గ్రహించాడు. తన కుటుంబాన్నంతటినీ రమ్మని కబురంపాడు. ఎక్కెడెక్కడి వాళ్ళూ వచ్చి చేరారు.
వాళ్ళకి తన కథ అంతా వినిపించాడు. తన ప్రతిపాదన వారి ముందు పెట్టాడు.
తన ఆస్థి నంతా పంచుతాననీ, కానీ తేయాకు రహస్యం కావాలనుకున్న వారు తన వ్యాపారాన్నీ, ఆ రహస్యాన్నీ మాత్రమే తీసుకోవాలనీ, ఆస్థి ఆశించ రాదని చెప్పాడు. వ్యాపారం తీసుకోవడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఏ టీ వల్ల తానింతటి వాడై, ఇంత మంది జీవితాల్ని నిలబెట్టాడో ఆ టీ ఇప్పుడు ఎవరికీ వద్దన్నారు.
తనకెంతో ఇష్టుడైన ఒక మనవడినగాడు. ఆ మనవడన్నాడూ, "తాతా నీ వ్యాపారం తీసుకుంటే కష్ట పడాల్సి వస్తుంది. ఇప్పుడు నీ టీ కొనేవారంతా నిన్ను చూసే కొంటున్నారు. నీ వారసుడికి నీ అంత లౌక్యం, దక్షత లేక పోతే ఆ రహస్యం తెలిసినా వ్యాపారం నిలబడదూ" అని.
నిజమే అనిపించింది పంతులుకి, నెమ్మదిగా తన వ్యాపారాన్ని తనే  మూసేసాడు. తనని నమ్ముకున్న పని వారందిరికీ ఒక దారి చూపించాడు. ఇక ఏ వ్యాపకం లేకపోవడం, ఆరోగ్యం సన్నగిల్లడం, వల్ల పూర్తిగా మంచాన పడ్డాడు.
'ఆనాయేసేన మరణం ,వినా దైన్యేన జీవనం" ఉండాలనేవాడు ఎప్పుడూ. అందుకే మంచాన తీసుకుని, పోకుండా చూడ మని ఆ దేవుణ్ణి మనసులోనే ప్రార్ధించేవాడు.

ఇహనో ఇప్పుడో అన్నట్లుంది ప్రాణం.

శ్వాస ఎగ తంతోంది, ఎక్కిళ్ళు పెచ్చు మీరాయి. అయినవాళ్ళందరూ ఒక్కొక్కరే వచ్చారు.
తులసి తీర్థం తెచ్చారు. అతడి కళ్ళల్లో ఏదో బాధ. చెప్పలేకపోతున్నాడు. ఆవిడే ఉంటే చప్పున తెలుసుకునేది.
పెద్ద కూతురంది, తులసి నీళ్ళు కాదు టీ పట్రండని. ఎలా తెస్తారు? ఈ మనిషి జీవితంలో ఎవరు టీ చేసినా తాగలేదే?
ఐనా ధైర్యం చేసి తెచ్చారు. తాగలేదు. కట్ట కడపటి మనవరాలు వచ్చింది. ఆమె బాగా తయారు చేస్తుందని పేరుంది , ఈ సారి ఆమె చేసిచ్చింది, తాగాడు. మొదటి గుక్క లోనే కళ్ళళ్ళో ఏదో మెరుపు.
ఇది అచ్చం తను చేసుకునే టీ లానే ఉంది. ఇదివరకెన్నడూ ఎవరూ ఈ ముక్క చెప్పలేదు తనకి. బాగా చేస్తుందని తెలుసు కానీ తన లా..
దైవికమే అనుకున్నాడు. అలా ఆ టీ తాగుతూనే , ఏ టీ ని తన రక్తం లో , జీవితం లో , మనసులో నింపుకుని బ్రతికాడో, అదే టీ తాగుతూ .. తృప్తిగా ..
అలా నే ఒరిగి పోయాడు.
ఆ మనవరాలికీ తెలియదు ఆ రోజు తను చేసిన టీ అచ్చు గుద్దినట్లు తాత టీ లానే ఉందని. మళ్ళా ఎప్పుడు తను టీ చేసినా,ఆ ప్రాంతం లో ఎవరు టీ చేసుకున్నా తేయాకు పంతులు టీ లా లేదనుకునే వారు.

23, మే 2019, గురువారం

ఏమో గుర్రం ఎగరావచ్చు - పునః పరిశీలన

2017 ఆగస్ట్ లో రాసిన పోస్టు. నేటి ఫలితాల సందర్భంగా ... ఆ రోజు అనుకున్నట్లే అమ్మ పార్టీ NDA లో చేరింది. బాబు మోదీ విడిపోయారు....చూద్దాం ఇంకేం జరుగుతాయో ఈ రోజు..

రాజకీయ బేతాళం:

"ఇవాళ వెంకయ్యనాయుడు సింహాసనం అధిష్టించాడు తెలుసా?" న్యూస్ పేపర్ లో వఛ్చిన వెంకయ్యనాయుడు ఫుల్ సైజు ఫోటోలు చూపిస్తూ అన్నాను బామ్మతో.

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి గా ఎన్నికైన రోజు ఆవిడ చాలా సంబర పడిపోయింది.

"ఏంటీ సింహాచలం వెళ్ళాడా? ఎందుకు వెళ్ళడూ, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులూ ఊళ్ళు పట్టుకు తిరగడం మామూలేగా" అందావిడ.

"సింహాచలం కాదే, సింహాసనం ఎక్కాడంటున్నా" అన్నాన్నేను.

"ఓ అదా. తెలుగువాడికి ఈ పదవి వచ్చిందన్న మాటే గానీ, మనకి ఒరిగేదేమీ లేదు రా."

"ఎందుకు లేదూ, పవర్‌ఫుల్ పదవే కదా, తెలుగు రాష్ట్రాలకి రావాల్సినవన్నీ రప్పిస్తాడు లే."

బామ్మకి రాజకీయ జ్ఞానం ఎక్కువే అందుకే ఒప్పుకున్నట్లు కనపడలేదు. ఏదో రహస్యం కనిపెట్టినట్లు గా చెప్పటం మొదలు పెట్టింది.

"అదే రా మోదీ జీ గారి తెలివి. ఇన్నాళ్ళూ మనకీ, కేంద్రానికి మధ్య ఉన్న లింకు ఈ వెంకయ్య నాయుడు గారే, ఆయనే ఏదైనా నిల దీసినా, నిధులు కోసం పోట్లాడినా నూ. ఇప్పుడాయన్ని తీసి, పార్టీలకతీతం గా పని చేయాల్సిన పోస్టు లో వేసేసి, ఆ లింకు తెగ్గొట్టారు. బి జె పీ కి సొంత బలం ఉంది కాబట్టి, చంద్ర బాబు ఆట్టే ఒత్తిడి పెట్టలేడు. పనిలో పని గా, ఆంధ్రా కీ, తెలంగాణాకీ చెరో సీనియర్ గుజరాతీ నీ గవర్నరు గా పంపించి నిఘా పెట్టిస్తాడు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో పార్టీ పట్టు పెంచుకునే ప్రయత్నాలు ఎలాగో ముమ్మరం చేసేసారు. ఇక వచ్చే ఎలక్షన్ల లో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ల సంఖ్యా, ఓట్ పెర్సంటేజీ పెంచుకోవడానికి శత విధాల కృషి చేస్తారు. తెలుగు రాష్ట్రాలకి ఏదైనా మంచి చేయదలచుకుంటే, అది ఎలక్షన్లకి ముందు చేసి, ప్రజల వద్ద ఇంప్రెషను కొట్టేస్తారు."

"ఆ ఇదంతా, వట్టి భ్రమ, వచ్చే మంత్రివర్గ విస్తరణలో దక్షిణాది వారికే ప్రాధాన్యంట" కొట్టి పారేశాన్నేను.

"ఏంటీ దక్షిణా మూర్తి స్తోత్రమా, ఇక మనకి మిగిలిందదే." నవ్వుతూ అంది బామ్మ.

"దక్షిణా మూర్తి కాదే, మంత్రి వర్గ విస్తరణ లో దక్షిణాదికి పెద్ద పీట వేస్తారుట."

"విస్తరణ లో పెద్దపీటా? నితీశ్ కుమారుకి , అమ్మ పార్టీ వాళ్ళకి పోను, మిగిలినవెన్ని? అందులో వచ్చేవెన్ని, పోయే వెన్ని?" బామ్మ భవిష్యత్తు చెప్పేస్తోంది.

"అమ్మ పార్టీ వాళ్ళు కూటమి లో లేరు కదే?" సందేహానుమానం వెలిబుచ్చాను.

"అదెంత పని రా, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన వాళ్ళందరూ, కూటమి లో ఉండే ఇచ్చారా? నితీశ్  చేరలేదూ.ప్రాంతీయ పార్టీల్లో ఎవరికి గెలిచే అవకాశాలుంటే వాళ్ళందర్నీ కూటమిలో చేర్చేసుకోవడం వాళ్ళకి ఓటు తో పెట్టిన విద్య. వచ్చే ఎలక్షన్ల లో బాబు ని దూరం పెట్టి, జగన్ని చేరదీయ వచ్చు, అమ్మ పార్టీని కూటమి లో చేర్చుకోవచ్చు, గెలవడానికి ఏదైనా చెయ్యవచ్చు."

"బాగుంది నీ చిలక జోస్యం, మోదీ, బాబూ విడిపోవడం కల్ల" ఒప్పుకోదలచుకోలేదు నేను.

"98లో అమ్మ ఎక్కడుంది? కూటమిలో లేదూ? గోద్రా తర్వాత బాబు కూటమి నుండి వెళ్లిపోలేదూ? మొన్నటికి మొన్న ఈ నితీశే మోదీ తో తెగతెంపులు చేసుకొని మళ్ళీ కలిసి పోలేదూ? రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ, శత్రువులూ ఉండరని నీకు తెలియదట్రా."ఏమో గుర్రం ఎగరావచ్చు..."

22, మే 2019, బుధవారం

మహానుభావుడు

నెల రోజుల నాడు కాఫీ షాప్ లో చూశాను అతణ్ణి. చూసినప్పుడే అనుకున్నా పెద్ద సైకో అయి ఉంటాడని.
ఆ రోజు ఎప్పట్లానే తల వంచుకుని ఫోన్ చూసుకుంటూ కాఫీ షాప్ కొచ్చాను.
ఇది డిజిటల్ కాఫీ షాప్, అంటే కస్టమర్ మాట్లాడాల్సిన పనే లేకుండా, యాప్ లో ఆర్డర్ చేసి, పే చేస్తే, ఒక రోబో  టేబుల్ దగ్గర కాఫీ సర్వ్ చేస్తుంది.
అంతా నిశ్శబ్దం, ఒంటరి గాళ్ళైనా, జంటలైనా, గుంపులైనా, తల వంచుకుని, ఎవరి ఫోన్ లతో వాళ్ళు బిజీ గా వుంటూ కాఫీ ఎంజాయ్ చేస్తుంటారు.

ఇదీ ఒక ధ్యానం లాంటిదే.

ఆ మధ్య, ఇలానే ఇదే కాఫీ షాప్ లో ఉన్నప్పుడు, పాత ఫ్రెండొకడు టచ్ లో కొచ్చాడు.
ఈ షాప్ లోనే ఉన్నానంటూ లొకేషన్ కూడా పంపించాడు.వాట్సాప్ లో హాయ్ అంటూ ఈమోజీ పంపి, లేటెస్టు పిక్ పంపించా.
వాడు కూడా వాడి లేటెస్ట్ పిక్ పంపాడు. చెప్పొద్దూ, చాలా హేపీగా ఫీలయ్యా. ఈ వాట్సాప్ పుణ్యమా అని, మళ్ళీ  వాడి  ని చూసే భాగ్యం దక్కింది.
ఈ వాట్సాపే లేకపోతే, తల ఎత్తి, వాడిని చూసి, వాడి దగ్గర కెళ్ళి మాట్లాడాల్సొచ్చేది. అదంతా ఓల్డ్ ఫేషన్.

ఇంతకీ ఆ సైకో సంగతి చెప్పాలి కదూ.

తపోభూమి ని తలపించే ఈ కాఫీ షాప్ లో ఒక రోజు ఒక పే...ద్ద నవ్వు వినిపించింది. సాధారణం గా అయితే, నాతో కాఫీ తాగడానికొచ్చే స్నేహితులు కూడా, ఏదైనా జోక్ చెప్పాల్సి వస్తే వాట్సాప్ లో పంపిస్తారు. బాగా నవ్వొస్తే వెంటనే నేను కూడా నాలుగు లోల్ ఈమోజీలో , ఆర్వో్ ఎఫెల్ ఈమోజీ లో 🤣🤣 పంపిస్తా. ఎంత కల్చర్డ్ గా వుంటుందీ ఈ రియాక్షన్. అంతే గానీ అలా పడీ పడీ నవ్వడమేమిటి, నాన్సెన్స్.

అతనలా నవ్విన వెంటనే, అక్కడున్న అందరూ అదిరిపడ్డారు. కొందరైతే టెర్రరిస్టు ఎటాకనుకుని ప్రాణభయంతో కంగారుగా ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో స్టేటస్ లు కూడా పెట్టేసారు.

వాళ్ళకొచ్చిన కామెంట్లూ, లైకులూ భయం భయంగా చూసుకుంటూ ఉండిపోయారు.
నాకు చుట్టూ ఉన్న సమాజం ముఖ్యం  కాబట్టి నేను మొదటి సారి తల ఎత్తి చూసా అతగాడిని.

ఏ గ్రహం నుంచి ఊడిపడ్డాడో మహానుభావుడు, చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ కూడా లేదు పైగా పుస్తకమొకటి. ఒకప్పుడు చదివేవారట కాగితాలతో చేసిన పుస్తకాలు. ఇప్పుడంతా డిజిటలే. ఎంతకీ సైరన్ కూతలూ అవీ వినపడకపోవడంతో ప్రమాదమేమీ లేదని తెలుసుకుని కొంతమంది అతడితో సెల్ఫీ లు కూడా దిగుతున్నారు. ఈ ఏలియను తో ఫొటో దిగాలనిపించి నేనూ దగరకెళ్ళాను. నన్ను చూసి చిన్నగా నవ్వాడు కూడా. నేను కూడా అతడిని చూసి లోల్ అన్నాను. అర్ధం కాలేదనుకుంటా గురుడికి. నేను నవ్వుకి బదులు ఈమోజీ లాంగ్వేజీ వాడబట్టి చాలా కాలమైంది.

సరిగ్గా అప్పుడే గమనించాను అతడి శరీర నిర్మాణం కూడా అందరిలా లేదు. ఒక చేయి రెండో చేతి కంటే పొడవుగా, పొడుగ్గా ఉన్న  చేతికి బొటన వేలు కూడా మిగతా వేళ్ళంత పొడవుగా,సెల్ఫీ లు తీసుకోడానికి వీలుగా ఉంది. అంతేకాదు అతని మెడ కూడా ఒక వైపుకి ఒంగి పోయి ఉంది.

ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేరు ఈ విషయాన్ని. నాకు మాత్రం మొదట ఆశ్చర్యం, తర్వాత భయం వేశాయి. చెప్పొద్దూ, వెంటనే వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ చేసా. ఫీలింగ్ కన్‌ఫ్యూస్‌డ్ అని.

అతనే అన్నాడు "నన్ను చూసి ఎందుకు అందరూ భయపడుతున్నారు?"

"ఇంత పెద్దగా నవ్వడం ఎప్పుడూ ఎవ్వరూ ఈ మధ్య కాలం లో విని వుండరు అందుకే"  అన్నాను.

"అవునా!" ఆశ్చర్యంగా అన్నాడు.

ఇంతలో అటుగా ఓ టీనేజీ కుర్రాడొచ్చాడు. "నీ చేతిలో డివైస్ ఏంటి? దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు? వై దేర్ అర్ నో బటన్స్ ఎట్ ఆల్ ?" అతి కష్టంమీద మాట్లాడుతున్నట్లడిగాడు పుస్తకాన్ని చూపిస్తూ.

"దీన్ని పుస్తకం అంటారు" అన్నాడు ఏలియన్ ఆ కుర్రాడి వైపు పుస్తకం జరుపుతూ.

"నీ చేతిలో ఉన్నది పుస్తకమని నా లాంటి సీనియర్ సిటిజనుకి తప్ప ఈ జనరేషన్ వాళ్లకి తెలియదు" అన్నానేను.

"డస్ ఇట్ నీడ్ పాస్వర్డ్?" ఉత్సాహంగా అడిగాడా కుర్రాడు.

"నో"

పుస్తకం చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ అన్నాడా కుర్రాడు "బాటరీస్ ఎక్కడున్నాయి? ఈజిట్ సోలార్ పవర్డ్?"

"నో , దీనికి బాటరీస్ , పవర్ ఏమీ అక్కర్లేదు . ఇలా పేజీలు తిప్పుతూ చదవాలి " చూపించాడు.

"వావ్, ఈజ్  దిస్ రియల్ ? అనుకుంటూ తన స్మార్ట్ ఫోన్ లో ఫోటోలు తీసుకుని, ఆశ్చర్యం కంటిన్యూ చేసుకుంటూ వెళ్లి పోయాడు.

"ఏంటీ అతను పుస్తకాన్ని వింతగా చూస్తున్నాడు?" అన్నాడతడు.
"ఓ అదా! ఇప్పుడు స్కూల్స్ లో అంతా స్మార్ట్ డివైస్ లు వాడుతున్నారు, పరీక్షలు కూడా కంప్యూటర్ లోనే. అందుకే ఇప్పటి పిల్లల్లో చాలామందికి పుస్తకాలు తెలియవు." అన్నాన్నేను.
చిన్నగా నవ్వుకున్నాడతను.

ఇంతకూ నువ్వెవరు, చిన్నవాడి లానే ఉన్నావు కానీ స్మార్ట్ ఫోన్ లేదు. ఏలియన్ వా ?" అడిగాను .
"నేను భవిష్యత్తు లోంచి వచ్చాను"
"భవిష్యత్తు లోంచా ?" భయం గా అడిగాను .
"అవును అందుకే నా చెయ్యి ఇలా వుంది " అన్నాడు చెయ్యి చూపుతూ .
"ఫ్యూచర్ లో మనిషికి తినడానికి తిండి లేదు. తాగడానికి  నీళ్లు లేవు. విటమిన్లూ మినరల్సూ, లాగా అంతా ట్యాబ్లేట్లే . మాట్లాడడానికి కూడా నోరు వాడక పోవడం వల్ల , నోరు సైజ్ కూడా తగ్గిపోయింది"
అప్పుడు చూసా, అతని నోరు కూడా చాలా చిన్నగా ఉంది.
"ఫిజికల్ , వర్చువల్ స్క్రీన్  లు చూసి చూసి కళ్ళు కూడా చిన్నగా అయిపోయాయి.  పెద్దగా కష్ట పడే పని లేకపోవడం వల్ల , శరీరం కూడా గుండ్రం గా అయిపోయింది " అన్నాడు బాధగా.
"మీరు ఫ్యామిలీ తో కూడా మాట్లాడుకోరా?" అన్నాను
"లేదు, మాకు ఫ్యామిలీ కాన్సెప్టు లేదు. టెక్నాలజీ కి బాగా అలవాటు పడిపోయి, మాకు మనిషి లక్షణాలు పోయాయి. ఫెర్టిలిటీ కూడా లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా పెరిగిపోయింది. పిల్లలు కూడా క్లోనింగ్ ద్వారానే పుడతారు.  జనాభా ని బట్టి ప్రభుత్వాలే ఇంతమందిని పుట్టించాలి అని శాంక్షన్ చేస్తారు."
"మరిప్పుడు ఇక్కడి కెందుకొచ్చినట్లు ?" అన్నాను.
"మా టైం లో మేము మనుషులుగా ఎందుకు పుట్టామో అర్ధం కాక చాలా మధన పడి పోయాం. మేమెందుకిలా అయిపోయాం అని రీసెర్చ్ చేసాం . "

"అయితే, తెలిసిందా?"
"ఆ రీసెర్చ్ లో మేమో టైం మెషీన్ కనిపెట్టి , గతం లోకి వెళ్లి చూసాం"
"ఏం అర్ధమయ్యింది?"
"మీ స్వార్ధం వల్లే మేమిలా మారామని తెలిసింది. మీరు చెట్లు నరికేశారు, నీళ్లు, ఆహారం లేకుండా చేశారు."
"మేమా! నాన్సెన్స్ .! ఇంత టెక్నాలజీ డెవలప్ చేసాం."
"నిజమే , కానీ ఆ టెక్నాలజీ ని మానవీయ కోణంలో అభివృద్ధిచెయ్యలేదు. అదే టెక్నాలజీ కాలక్రమేణా మనిషి తోటి మనిషితో కూడా మాట్లాడలేనంత డెవలప్ అయిపోయింది " అన్నాడు నిష్టూరం గా.
"నువ్వు పట్టుకున్న పుస్తకం కూడా మేము చెట్లు నరికి చేసిందే" అన్నాను నిజం ఒప్పుకుంటూ.
"ఇప్పుడు మాకు నరకడానికి చెట్లు కూడా లేవు, ఆ మాటకొస్తే పచ్చదనమే లేదు"
"ఇప్పుడేం చేద్దామని ?"
"ఏముంది?, భూమి మీద ఎక్కడైనా పచ్చదనం ఉంటే వెతికి , మొక్కలు చెట్లు పెంచాలని ఈ మధ్యే నిర్ణయించాం. టెక్నాలజీ సాయంతో మనుషులు తోటి మనుషులతో మాట్లాడే విధానం కనిపెడుతున్నాం. మనిషి గా ఉండడం వల్ల , మనిషి లో ఉండాల్సిన మానవత్వం , హృదయ మార్దవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెవలప్ చేస్తున్నాం “
"అసలు మనిషంటే ఏంటో మీకెలా తెలుసు?" ఎంక్వైరీ చేశాను.
"మా తవ్వకాలలో కొన్ని పుస్తకాలూ,కొంత డేటా దొరికాయి. వాటిని అనలైజ్ చేసి హ్యూమన్ బిహేవియర్  అల్గారిథంస్ తయారు చేసాం. నా లాంటి కొంత మంది గతం లోకి వచ్చి మనుషులనీ, వారి పోకడలనీ గమనించాం. ఇవన్నీ ఆ అల్గారిథంస్ ని ఇంకా మెరుగు పరచడానికి వాడతాం.”
"నీ ప్రయాణం లో నీకేం తెలిసింది?"
"గతం లో మనుషులు డబ్బు కన్నా సాటి మనిషికి , స్వార్ధం కన్నా పరోపకారానికి ఎక్కువ విలువ ఇచ్చారనీ తెలుసుకున్నాను. సంఘ జీవనం లో క్రమేణా కులాలూ, మతాలూ తామే సృష్టించుకుని , తమ చుట్టూ తామే అనేక గిరులు గీసుకుని సాటి మనిషిని దూరం చేసుకున్నారు. టెక్నాలజీ వాడకం పెరిగి, తమకు తామే దూరం ఐపోయారు."
"అంటే మనిషి ని మళ్ళీ మనిషి లా తయారు చేయబోతున్నారన్నమాట "
"అవును, ఆ టెస్ట్ లో భాగం గా నేను ఇక్కడికొచ్చాను.  వచ్చిన పనైపోయింది , ఇక వెళ్తున్నా " అని మాయమై పోయాడు .

మనసంతా విచిత్రం గా వుంది. అతనిప్పుడు ఏలియన్ లానో, సైకో లానో అనిపించట్లేదు , నాలో ఆలోచనల సునామీ ని రేపి, నేనూ మనిషినే అని గుర్తు చేసిన మహానుభావుడు లా అనిపిస్తున్నాడు . 

16, మే 2019, గురువారం

అల్లుళ్ళు - శ్రీశ్రీ - సుఖ జీవన యానం


శ్రీశ్రీ గారి రచనల పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చిన సమీక్షలన్నీ దాదాపుగా అభినందన పూర్వకంగా ఉన్నవే తప్ప, వారి రచనలు సమాజానికి అంత ఉపయోగ పడవనే వాదన నేనెప్పుడూ వినలేదు. కానీ ఆ కాలం లోనే అటువంటి ఒక ఆలోచన ని వెలిబుచ్చిన ఒక ఉపోద్ఘాతం తటస్థించడమే ఈ టపా వ్రాయడానికి ప్రేరణ.

ఈ మధ్య ప్రైమ్ లో సంక్రాంతి అల్లుళ్ల సినిమా చూస్తుంటే, ఒక్కసారిగా ...

అత్తారింటికి వెళ్లి, మావగారి తో భోజనం చేసే వేళ అవుతోందని తెలిసీ, కాఫీ హోటలు కెళ్ళి ఇడ్లీలు తిని వచ్చి, మరి ఇక భోజనం చెయ్యలేక, మొహమాటం తో ఒళ్ళు కులాసాగా లేదని అబద్ధం చెప్పి, రోజంతా పస్తుండి, నానా అవస్థలూ పడ్డ సుందరమ్మ గారి అల్లుడు శర్మా….

సత్యవతి తలుపు వేగిరంగా తియ్యక పోగా, అనాల్సిన ఇంగిలీషు ముక్కలు అనలేదని తన అల్లుడు కృష్ణుడూ; ఇచ్చిన ఫలహారమూ, కాఫీ మొత్తం పుచ్చేసుకుని  ఠాంక్ ఠాంక్ మనాల్సిన మగడు అలా అనలేదని కూతురు సత్యవతీ, ఒకరిపై ఒకరు అలిగి, తనని హడలెత్తించిన ఉదంతాన్ని చర్చించుకున్న మంగమ్మా సుందరమ్మా ....

సరైన వయసులో తాలూకా ఆఫీసు లో చేరి ఉంటే, డిప్టీ కలెక్టరు అవ్వగలిగి ఉండీ,  జీతానికి వృద్ధి  అంటూ లేని మాస్టరీ పని చేస్తూ, పండక్కి కూసింత ముందుగానే వచ్చిన అల్లుడికీ, కూతురుకి, నెల బడ్జెట్ అంతా  వెచ్చించి బట్టలు కొని, మళ్ళా మరొక్కసారి పద్దు రాయించి అల్లుడికి బట్టలు కొనాల్సి వచ్చినా,  తాను మాత్రం రూపాయి కాసంత చిరిగిన ధోవతి ని ఠలాయించి కుట్టుకుని తొడుక్కుని, కొత్త బట్టలు కట్టుకున్న కూతురినీ, అల్లుడిని చూసి మురిసి పోయిన మావగారు ...

వీళ్లంతా గుర్తుకొచ్చి, వెంటనే చదివి చాలా కాలమైపోయిన ముని మాణిక్యం గారి అల్లుళ్ళు పుస్తకం తెరిచాను.

ఒకప్పుడు, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం మొదటి భాగం చదివి ఆనందించాక, రెండవ భాగం అంత హాస్య స్ఫోరకం గా అనిపించక పోవడం చేత, ఇక వారి రచనల పట్ల ఆసక్తి కలగలేదు. వీరూ, సదరు ముని మాణిక్యం వారూ (ఇద్దరూ నరసింహులే కావడం వల్ల అనుకుంటా) ఒక్కరే నని భ్రమించి, ఈ అల్లుళ్ళు పుస్తకాన్ని చాలా కాలం విస్మరించేను కూడా.
ఇక యుక్త వయసులో మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యతా పత్రం చదివాక, నేను చాలా పుస్తకాలకున్న ముందుమాటలు చదవడం మానుకున్నాను. ఎందుకో ఇహ ఇంతకు మించిన ముందు మాటలుండవనే అనుకున్నాను. అలానే ఈ అల్లుళ్ళు ముందుమాటను కూడా చదవలేదు అప్పట్లో.

 ఈసారెందుకో ముందు మాట చూస్తిని కదా, శ్రీశ్రీ వారు దర్శనమిచ్చారు మొదటి రెండు పంక్తుల్లోనే.
"దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!"
అని శ్రీశ్రీ అంటే,
"నేను ఎక్కడికీ పొమ్మనను, ఇంట్లోనే ఉండమంటాను.  ఒకవేళ ఏదైనా పని మీద, ఎక్కడికైనా వెళ్ళినా సాయింత్రానికి ఇంటికి వచ్చి , ఆవిడ ఇచ్చిన కాఫీ పుచ్చుకొని పిల్లలతో, హాయిగా ఆడుకొంటూ కాలం గడపమంటాను" అంటారు ముని మాణిక్యం.

నెత్తురు వాగులూ, ఆకలి ఏడ్పులూ నాకు కనిపించవు, వినిపించవు అంటారాయన. ఏదో కలో అంబలో త్రాగి ప్రతీవాడూ, తృప్తి తోనూ, ఆనందంతోనూ,హాయిగా జీవిస్తున్నట్లు తోస్తుందాయన మనస్సుకి.

జీవితం లో సుఖ దుఃఖాలు ఈనాడు కొత్తగా రాలేదు, ఎప్పుడూ ఉన్నవే. ఏడ్చి ఏమి లాభం?
జీవితంలో తృప్తీ ఆనందమూ ఉంటే ఈ ఏడ్పులు తగ్గిపోవూ?

నిజానికి నడివయసుకొచ్చాక, యవ్వనం లో ని ఆవేశ కావేశాలు తగ్గి, సంసార సాగరం లో ఎదురీత ఈదే సామాన్యులకి ముని మాణిక్యం వారి అభిప్రాయం సరైనదేననిపించక మానదు.

"ప్రతీ అన్యాయానికి స్పందించాలని మధ్యతరగతి వాడు అనుకున్నా, పాపం వాడికి సెలవున్న రోజున, కోర్టుకి కూడా సెలవే" అని ఎక్కడో విన్నట్లు గుర్తు.  అందుకనే చిన్న చిన్న ఆనందాల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ, సుఖ జీవన యానం చేసేద్దాం.

అల్లుళ్ళు ఆన్లైన్ లో చదవాలనుకుంటే scribd లో ఉంది చూడండి.
8, మే 2019, బుధవారం

మంచోళ్ళు


"హిట్లర్ మంచి పరిపాలకుడు. ఆయన ప్రజలను కన్న బిడ్డల వలె పాలించెను."
"ఒరేయ్! ఏమిటా పిచ్చి కూతలు, హిట్లర్ ఎలాంటివాడో ప్రపంచమంతా తెలుసు."
"కానీ నీకే తెలీదు ఆత్రేయ గారేం చెప్పారో"
"నాకేం చెప్పలేదు"
"నాకు చెప్పారు లే పోయినోళ్ళంతా మంచోళ్ళు  అని"
"అయితే మాత్రం హిట్లర్ ని కూడా పొగడాలా"
"ఖచ్చితం గా, ఎలాంటి నాయకులైనా, ఎంత పెద్ద కేసులున్నవారైనా, వాళ్ళు పోయాకా పొగడి తీరాలి."
"వీల్లేదు, ఉన్నదున్నట్లు గా చెప్పాల్సిందే."
"నువ్వు సంఘీ వా?"
"కాదు సామాన్యుణ్ణి ."

--Modi comments on Rajiv

6, మే 2019, సోమవారం

నయా నేషనలిజం"దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా"
"నువ్వు ఈ దేశం లో పుట్టి పెరిగావా?"
"అవును"
"నువ్వు ఈ దేశ పౌరుడివేనా?"
"కాదు"
"అయితే నీకీ పాట పాడే అర్హత లేదు"
"అరె నేను ఇక్కడే ఉంటున్నా, పని చేస్తున్నా, పన్నులూ కడుతున్నా"
"ఐనా సరే, నీకా అర్హత లేదు"
"మరి, షెహజాదా, రాజ మాత .."
"ఏం పర్లేదు, మాకు విదేశీ పాలన అలవాటే, నువ్వు మాత్రం ఈ దేశాన్ని ప్రేమించకూడదు"
"నువ్వు ఏ పార్టీ వాడివో నాకర్ధం అయ్యింది"
"నువ్వు ఏ పార్టీ వాడివో నాకూ అర్ధం అయ్యింది"
"నాకు ఓటు హక్కు కూడా లేదు, ఇంకా పార్టీ ఏమిటి? నేను విపత్తు సమయాల్లో, ప్రజల కోసం చాలా విరాళాలిచ్చాను"
"అవన్నీ నువ్వు నా దేశం లో పన్ను లు ఎగ్గొట్టానికి చేసిన జిమ్మిక్కులు"
"నువ్వు నిజం గా దేశభక్తుడివేనా?"
"అది నీకనవసరం, కానీ నువ్వు మాత్రం  ఈ దేశాన్ని ప్రేమించడానికి వీల్లేదు"

---- ఈ మధ్య ఓ నటుడి పౌరసత్వం గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న రచ్చ ప్రభావం