నెల రోజుల నాడు కాఫీ షాప్ లో చూశాను అతణ్ణి. చూసినప్పుడే అనుకున్నా పెద్ద సైకో అయి ఉంటాడని.
ఆ రోజు ఎప్పట్లానే తల వంచుకుని ఫోన్ చూసుకుంటూ కాఫీ షాప్ కొచ్చాను.
ఇది డిజిటల్ కాఫీ షాప్, అంటే కస్టమర్ మాట్లాడాల్సిన పనే లేకుండా, యాప్ లో ఆర్డర్ చేసి, పే చేస్తే, ఒక రోబో టేబుల్ దగ్గర కాఫీ సర్వ్ చేస్తుంది.
అంతా నిశ్శబ్దం, ఒంటరి గాళ్ళైనా, జంటలైనా, గుంపులైనా, తల వంచుకుని, ఎవరి ఫోన్ లతో వాళ్ళు బిజీ గా వుంటూ కాఫీ ఎంజాయ్ చేస్తుంటారు.
ఇదీ ఒక ధ్యానం లాంటిదే.
ఆ మధ్య, ఇలానే ఇదే కాఫీ షాప్ లో ఉన్నప్పుడు, పాత ఫ్రెండొకడు టచ్ లో కొచ్చాడు.
ఈ షాప్ లోనే ఉన్నానంటూ లొకేషన్ కూడా పంపించాడు.వాట్సాప్ లో హాయ్ అంటూ ఈమోజీ పంపి, లేటెస్టు పిక్ పంపించా.
వాడు కూడా వాడి లేటెస్ట్ పిక్ పంపాడు. చెప్పొద్దూ, చాలా హేపీగా ఫీలయ్యా. ఈ వాట్సాప్ పుణ్యమా అని, మళ్ళీ వాడి ని చూసే భాగ్యం దక్కింది.
ఈ వాట్సాపే లేకపోతే, తల ఎత్తి, వాడిని చూసి, వాడి దగ్గర కెళ్ళి మాట్లాడాల్సొచ్చేది. అదంతా ఓల్డ్ ఫేషన్.
ఇంతకీ ఆ సైకో సంగతి చెప్పాలి కదూ.
తపోభూమి ని తలపించే ఈ కాఫీ షాప్ లో ఒక రోజు ఒక పే...ద్ద నవ్వు వినిపించింది. సాధారణం గా అయితే, నాతో కాఫీ తాగడానికొచ్చే స్నేహితులు కూడా, ఏదైనా జోక్ చెప్పాల్సి వస్తే వాట్సాప్ లో పంపిస్తారు. బాగా నవ్వొస్తే వెంటనే నేను కూడా నాలుగు లోల్ ఈమోజీలో , ఆర్వో్ ఎఫెల్ ఈమోజీ లో 🤣🤣 పంపిస్తా. ఎంత కల్చర్డ్ గా వుంటుందీ ఈ రియాక్షన్. అంతే గానీ అలా పడీ పడీ నవ్వడమేమిటి, నాన్సెన్స్.
అతనలా నవ్విన వెంటనే, అక్కడున్న అందరూ అదిరిపడ్డారు. కొందరైతే టెర్రరిస్టు ఎటాకనుకుని ప్రాణభయంతో కంగారుగా ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో స్టేటస్ లు కూడా పెట్టేసారు.
వాళ్ళకొచ్చిన కామెంట్లూ, లైకులూ భయం భయంగా చూసుకుంటూ ఉండిపోయారు.
నాకు చుట్టూ ఉన్న సమాజం ముఖ్యం కాబట్టి నేను మొదటి సారి తల ఎత్తి చూసా అతగాడిని.
ఏ గ్రహం నుంచి ఊడిపడ్డాడో మహానుభావుడు, చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ కూడా లేదు పైగా పుస్తకమొకటి. ఒకప్పుడు చదివేవారట కాగితాలతో చేసిన పుస్తకాలు. ఇప్పుడంతా డిజిటలే. ఎంతకీ సైరన్ కూతలూ అవీ వినపడకపోవడంతో ప్రమాదమేమీ లేదని తెలుసుకుని కొంతమంది అతడితో సెల్ఫీ లు కూడా దిగుతున్నారు. ఈ ఏలియను తో ఫొటో దిగాలనిపించి నేనూ దగరకెళ్ళాను. నన్ను చూసి చిన్నగా నవ్వాడు కూడా. నేను కూడా అతడిని చూసి లోల్ అన్నాను. అర్ధం కాలేదనుకుంటా గురుడికి. నేను నవ్వుకి బదులు ఈమోజీ లాంగ్వేజీ వాడబట్టి చాలా కాలమైంది.
సరిగ్గా అప్పుడే గమనించాను అతడి శరీర నిర్మాణం కూడా అందరిలా లేదు. ఒక చేయి రెండో చేతి కంటే పొడవుగా, పొడుగ్గా ఉన్న చేతికి బొటన వేలు కూడా మిగతా వేళ్ళంత పొడవుగా,సెల్ఫీ లు తీసుకోడానికి వీలుగా ఉంది. అంతేకాదు అతని మెడ కూడా ఒక వైపుకి ఒంగి పోయి ఉంది.
ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేరు ఈ విషయాన్ని. నాకు మాత్రం మొదట ఆశ్చర్యం, తర్వాత భయం వేశాయి. చెప్పొద్దూ, వెంటనే వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ చేసా. ఫీలింగ్ కన్‌ఫ్యూస్‌డ్ అని.
అతనే అన్నాడు "నన్ను చూసి ఎందుకు అందరూ భయపడుతున్నారు?"
"ఇంత పెద్దగా నవ్వడం ఎప్పుడూ ఎవ్వరూ ఈ మధ్య కాలం లో విని వుండరు అందుకే" అన్నాను.
"అవునా!" ఆశ్చర్యంగా అన్నాడు.
ఇంతలో అటుగా ఓ టీనేజీ కుర్రాడొచ్చాడు. "నీ చేతిలో డివైస్ ఏంటి? దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు? వై దేర్ అర్ నో బటన్స్ ఎట్ ఆల్ ?" అతి కష్టంమీద మాట్లాడుతున్నట్లడిగాడు పుస్తకాన్ని చూపిస్తూ.
"దీన్ని పుస్తకం అంటారు" అన్నాడు ఏలియన్ ఆ కుర్రాడి వైపు పుస్తకం జరుపుతూ.
"నీ చేతిలో ఉన్నది పుస్తకమని నా లాంటి సీనియర్ సిటిజనుకి తప్ప ఈ జనరేషన్ వాళ్లకి తెలియదు" అన్నానేను.
"డస్ ఇట్ నీడ్ పాస్వర్డ్?" ఉత్సాహంగా అడిగాడా కుర్రాడు.
"నో"
పుస్తకం చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ అన్నాడా కుర్రాడు "బాటరీస్ ఎక్కడున్నాయి? ఈజిట్ సోలార్ పవర్డ్?"
"నో , దీనికి బాటరీస్ , పవర్ ఏమీ అక్కర్లేదు . ఇలా పేజీలు తిప్పుతూ చదవాలి " చూపించాడు.
"వావ్, ఈజ్ దిస్ రియల్ ? అనుకుంటూ తన స్మార్ట్ ఫోన్ లో ఫోటోలు తీసుకుని, ఆశ్చర్యం కంటిన్యూ చేసుకుంటూ వెళ్లి పోయాడు.
"ఏంటీ అతను పుస్తకాన్ని వింతగా చూస్తున్నాడు?" అన్నాడతడు.
"ఓ అదా! ఇప్పుడు స్కూల్స్ లో అంతా స్మార్ట్ డివైస్ లు వాడుతున్నారు, పరీక్షలు కూడా కంప్యూటర్ లోనే. అందుకే ఇప్పటి పిల్లల్లో చాలామందికి పుస్తకాలు తెలియవు." అన్నాన్నేను.
చిన్నగా నవ్వుకున్నాడతను.
ఇంతకూ నువ్వెవరు, చిన్నవాడి లానే ఉన్నావు కానీ స్మార్ట్ ఫోన్ లేదు. ఏలియన్ వా ?" అడిగాను .
"నేను భవిష్యత్తు లోంచి వచ్చాను"
"భవిష్యత్తు లోంచా ?" భయం గా అడిగాను .
"అవును అందుకే నా చెయ్యి ఇలా వుంది " అన్నాడు చెయ్యి చూపుతూ .
"ఫ్యూచర్ లో మనిషికి తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. విటమిన్లూ మినరల్సూ, లాగా అంతా ట్యాబ్లేట్లే . మాట్లాడడానికి కూడా నోరు వాడక పోవడం వల్ల , నోరు సైజ్ కూడా తగ్గిపోయింది"
అప్పుడు చూసా, అతని నోరు కూడా చాలా చిన్నగా ఉంది.
"ఫిజికల్ , వర్చువల్ స్క్రీన్ లు చూసి చూసి కళ్ళు కూడా చిన్నగా అయిపోయాయి. పెద్దగా కష్ట పడే పని లేకపోవడం వల్ల , శరీరం కూడా గుండ్రం గా అయిపోయింది " అన్నాడు బాధగా.
"మీరు ఫ్యామిలీ తో కూడా మాట్లాడుకోరా?" అన్నాను
"లేదు, మాకు ఫ్యామిలీ కాన్సెప్టు లేదు. టెక్నాలజీ కి బాగా అలవాటు పడిపోయి, మాకు మనిషి లక్షణాలు పోయాయి. ఫెర్టిలిటీ కూడా లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా పెరిగిపోయింది. పిల్లలు కూడా క్లోనింగ్ ద్వారానే పుడతారు. జనాభా ని బట్టి ప్రభుత్వాలే ఇంతమందిని పుట్టించాలి అని శాంక్షన్ చేస్తారు."
"మరిప్పుడు ఇక్కడి కెందుకొచ్చినట్లు ?" అన్నాను.
"మా టైం లో మేము మనుషులుగా ఎందుకు పుట్టామో అర్ధం కాక చాలా మధన పడి పోయాం. మేమెందుకిలా అయిపోయాం అని రీసెర్చ్ చేసాం . "
"అయితే, తెలిసిందా?"
"ఆ రీసెర్చ్ లో మేమో టైం మెషీన్ కనిపెట్టి , గతం లోకి వెళ్లి చూసాం"
"ఏం అర్ధమయ్యింది?"
"మీ స్వార్ధం వల్లే మేమిలా మారామని తెలిసింది. మీరు చెట్లు నరికేశారు, నీళ్లు, ఆహారం లేకుండా చేశారు."
"మేమా! నాన్సెన్స్ .! ఇంత టెక్నాలజీ డెవలప్ చేసాం."
"నిజమే , కానీ ఆ టెక్నాలజీ ని మానవీయ కోణంలో అభివృద్ధిచెయ్యలేదు. అదే టెక్నాలజీ కాలక్రమేణా మనిషి తోటి మనిషితో కూడా మాట్లాడలేనంత డెవలప్ అయిపోయింది " అన్నాడు నిష్టూరం గా.
"నువ్వు పట్టుకున్న పుస్తకం కూడా మేము చెట్లు నరికి చేసిందే" అన్నాను నిజం ఒప్పుకుంటూ.
"ఇప్పుడు మాకు నరకడానికి చెట్లు కూడా లేవు, ఆ మాటకొస్తే పచ్చదనమే లేదు"
"ఇప్పుడేం చేద్దామని ?"
"ఏముంది?, భూమి మీద ఎక్కడైనా పచ్చదనం ఉంటే వెతికి , మొక్కలు చెట్లు పెంచాలని ఈ మధ్యే నిర్ణయించాం. టెక్నాలజీ సాయంతో మనుషులు తోటి మనుషులతో మాట్లాడే విధానం కనిపెడుతున్నాం. మనిషి గా ఉండడం వల్ల , మనిషి లో ఉండాల్సిన మానవత్వం , హృదయ మార్దవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెవలప్ చేస్తున్నాం “
"అసలు మనిషంటే ఏంటో మీకెలా తెలుసు?" ఎంక్వైరీ చేశాను.
"మా తవ్వకాలలో కొన్ని పుస్తకాలూ,కొంత డేటా దొరికాయి. వాటిని అనలైజ్ చేసి హ్యూమన్ బిహేవియర్ అల్గారిథంస్ తయారు చేసాం. నా లాంటి కొంత మంది గతం లోకి వచ్చి మనుషులనీ, వారి పోకడలనీ గమనించాం. ఇవన్నీ ఆ అల్గారిథంస్ ని ఇంకా మెరుగు పరచడానికి వాడతాం.”
"నీ ప్రయాణం లో నీకేం తెలిసింది?"
"గతం లో మనుషులు డబ్బు కన్నా సాటి మనిషికి , స్వార్ధం కన్నా పరోపకారానికి ఎక్కువ విలువ ఇచ్చారనీ తెలుసుకున్నాను. సంఘ జీవనం లో క్రమేణా కులాలూ, మతాలూ తామే సృష్టించుకుని , తమ చుట్టూ తామే అనేక గిరులు గీసుకుని సాటి మనిషిని దూరం చేసుకున్నారు. టెక్నాలజీ వాడకం పెరిగి, తమకు తామే దూరం ఐపోయారు."
"అంటే మనిషి ని మళ్ళీ మనిషి లా తయారు చేయబోతున్నారన్నమాట "
"అవును, ఆ టెస్ట్ లో భాగం గా నేను ఇక్కడికొచ్చాను. వచ్చిన పనైపోయింది , ఇక వెళ్తున్నా " అని మాయమై పోయాడు .
మనసంతా విచిత్రం గా వుంది. అతనిప్పుడు ఏలియన్ లానో, సైకో లానో అనిపించట్లేదు , నాలో ఆలోచనల సునామీ ని రేపి, నేనూ మనిషినే అని గుర్తు చేసిన మహానుభావుడు లా అనిపిస్తున్నాడు .
బాగా వ్రాసారండీ !
రిప్లయితొలగించండిధన్యవాదాలండి.
తొలగించండిభవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం మాధవ్ గారు, బాగా రాశారు
రిప్లయితొలగించండిఅలా జరగకూడదని కోరుకుందాం
తొలగించండి