హోమ్

23, ఆగస్టు 2017, బుధవారం

సంఘర్షణ

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (25/01/1998) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"నూరు పూలు వికసించనీ
వేయి ఆలోచనలు సంఘర్షించనీ " 


ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
సంఘర్షణ 

చుక్కల్లో ఆదర్శాలు లెక్కిస్తూ ,
మెరుపుల్లో ఆవేశాన్ని వీక్షిస్తూ ,
లక్ష్యాలను విస్మరించి,
మార్గం మరచి,
యువతా!,
ఈ ముళ్ల దారినా నీ సంచారం?
అపశృతులు నిండిన ఈ గేయాలా నీ సంగీతం?
కాల్చే ఆకలీ , కూల్చే వేదనా 
కనిపిస్తోందా ఈ గాయం?
ఏమైందీ?
స్వాతంత్ర్య సమరానికి ఊపిరులూదిన యువ చైతన్యం?
నవ భారత నిర్మాణానికి పునాది వేసిన ఆ సౌగంధం?
నవ కవనం-చైతన్యానికి
నవ భువనం - ఇనోదయానికి 
యువ యోధులు-అభ్యుదయానికి 
కావాలోయ్ సమాజానికి. 
నూరు పూలు వికసించనీ,
వేయి ఆలోచనలు సంఘర్షించనీ,
గుండె కొండల్లో శాంతి నాదాలు ప్రతిధ్వనించనీ ,
జగాన్ని క్రమ్మిన స్వార్ధ మేఘాలు పాటా పంచలవనీ,
విశ్వమంతా దేశ కీర్తిని మార్మ్రోగనీ ,
ఒక్క పుష్ప వికాసం చాలు వసంతాన్ని ఆహ్వానించేందుకు 
ఒక్క ఆలోచన చాలు ప్రజా హృదయం లో చైతన్యం నింపేందుకు
మరో ప్రస్థానం ఆరంభించేందుకు. 

22, ఆగస్టు 2017, మంగళవారం

స్వాగతించరేం?ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (30/11/1997) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ?
మూగనేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని?" 
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
స్వాగతించరేం?

మార్చేయండి మానవ నైజాన్ని,
తిరగరాయండి మానుష చరిత్రని. 
ఇదిగో, ఇక్కడ,
బూజు పట్టిన విధానాల్ని దులుపుకుంటూ,
నిశి రాత్రిని వెన్నెలగా చూపే 
గాజు కళ్ళని నులుముకుంటూ,
అర్ధశతాబ్ది స్వాతంత్ర్యాన్ని 
ఆనందంగా హత్తుకుంటూ,
దారిద్ర్యపు వెలుగులో 
గత వైభవాన్ని చూసుకుంటూ,
రాజకీయుల వాగ్దానాలని 
తృప్తిగా నెమరేసుకుంటూ ,
గుండె గాయాల్ని 
వైప్లవ్య గేయాలుగా మార్చుకుంటూ,
  సమరశంఖం పూరిస్తూ ,
గర్జిస్తూ ,
ప్రశ్నిస్తున్నాను. 
పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ?
మూగనేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని?
చైతన్యం కోసం ప్ర్రాణమివ్వని యువత శౌర్యమెందుకని?
బదులివ్వరేం?
భావిభారత బంగరు కలలని భుజానేసుకుని,
గంపెడాశతో వస్తున్నాను. 
స్వాగతించరేం?


14, ఆగస్టు 2017, సోమవారం

రాజకీయ బేతాళం - ఏమో గుర్రం ఎగరావచ్చు

"ఇవాళ వెంకయ్యనాయుడు సింహాసనం అధిష్టించాడు తెలుసా?" న్యూస్ పేపర్ లో వఛ్చిన వెంకయ్యనాయుడు ఫుల్ సైజు ఫోటోలు చూపిస్తూ అన్నాను బామ్మతో.

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి గా ఎన్నికైన రోజు ఆవిడ చాలా సంబర పడిపోయింది.

"ఏంటీ సింహాచలం వెళ్ళాడా? ఎందుకు వెళ్ళడూ, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులూ ఊళ్ళు పట్టుకు తిరగడం మామూలేగా" అందావిడ.

"సింహాచలం కాదే, సింహాసనం ఎక్కాడంటున్నా" అన్నాన్నేను.

"ఓ అదా. తెలుగువాడికి ఈ పదవి వచ్చిందన్న మాటే గానీ, మనకి ఒరిగేదేమీ లేదు రా."

"ఎందుకు లేదూ, పవర్‌ఫుల్ పదవే కదా, తెలుగు రాష్ట్రాలకి రావాల్సినవన్నీ రప్పిస్తాడు లే." 

బామ్మకి రాజకీయ జ్ఞానం ఎక్కువే అందుకే ఒప్పుకున్నట్లు కనపడలేదు. ఏదో రహస్యం కనిపెట్టినట్లు గా చెప్పటం మొదలు పెట్టింది.

"అదే రా మోదీ జీ గారి తెలివి. ఇన్నాళ్ళూ మనకీ, కేంద్రానికి మధ్య ఉన్న లింకు ఈ వెంకయ్య నాయుడు గారే, ఆయనే ఏదైనా నిల దీసినా, నిధులు కోసం పోట్లాడినా నూ. ఇప్పుడాయన్ని తీసి, పార్టీలకతీతం గా పని చేయాల్సిన పోస్టు లో వేసేసి, ఆ లింకు తెగ్గొట్టారు. బి జె పీ కి సొంత బలం ఉంది కాబట్టి, చంద్ర బాబు ఆట్టే ఒత్తిడి పెట్టలేడు. పనిలో పని గా, ఆంధ్రా కీ, తెలంగాణాకీ చెరో సీనియర్ గుజరాతీ నీ గవర్నరు గా పంపించి నిఘా పెట్టిస్తాడు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో పార్టీ పట్టు పెంచుకునే ప్రయత్నాలు ఎలాగో ముమ్మరం చేసేసారు. ఇక వచ్చే ఎలక్షన్ల లో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ల సంఖ్యా, ఓట్ పెర్సంటేజీ పెంచుకోవడానికి శత విధాల కృషి చేస్తారు. తెలుగు రాష్ట్రాలకి ఏదైనా మంచి చేయదలచుకుంటే, అది ఎలక్షన్లకి ముందు చేసి, ప్రజల వద్ద ఇంప్రెషను కొట్టేస్తారు."

"ఆ ఇదంతా, వట్టి భ్రమ, వచ్చే మంత్రివర్గ విస్తరణలో దక్షిణాది వారికే ప్రాధాన్యంట" కొట్టి పారేశాన్నేను.

"ఏంటీ దక్షిణా మూర్తి స్తోత్రమా, ఇక మనకి మిగిలిందదే." నవ్వుతూ అంది బామ్మ.

"దక్షిణా మూర్తి కాదే, మంత్రి వర్గ విస్తరణ లో దక్షిణాదికి పెద్ద పీట వేస్తారుట."

"విస్తరణ లో పెద్దపీటా? నితీశ్ కుమారుకి , అమ్మ పార్టీ వాళ్ళకి పోను, మిగిలినవెన్ని? అందులో వచ్చేవెన్ని, పోయే వెన్ని?" బామ్మ భవిష్యత్తు చెప్పేస్తోంది.

"అమ్మ పార్టీ వాళ్ళు కూటమి లో లేరు కదే?" సందేహానుమానం వెలిబుచ్చాను.

"అదెంత పని రా, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన వాళ్ళందరూ, కూటమి లో ఉండే ఇచ్చారా? నితీశ్  చేరలేదూ.ప్రాంతీయ పార్టీల్లో ఎవరికి గెలిచే అవకాశాలుంటే వాళ్ళందర్నీ కూటమిలో చేర్చేసుకోవడం వాళ్ళకి ఓటు తో పెట్టిన విద్య. వచ్చే ఎలక్షన్ల లో బాబు ని దూరం పెట్టి, జగన్ని చేరదీయ వచ్చు, అమ్మ పార్టీని కూటమి లో చేర్చుకోవచ్చు, గెలవడానికి ఏదైనా చెయ్యవచ్చు."

"బాగుంది నీ చిలక జోస్యం, మోదీ, బాబూ విడిపోవడం కల్ల" ఒప్పుకోదలచుకోలేదు నేను.

"98లో అమ్మ ఎక్కడుంది? కూటమిలో లేదూ? గోద్రా తర్వాత బాబు కూటమి నుండి వెళ్లిపోలేదూ? మొన్నటికి మొన్న ఈ నితీశే మోదీ తో తెగతెంపులు చేసుకొని మళ్ళీ కలిసి పోలేదూ? రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ, శత్రువులూ ఉండరని నీకు తెలియదట్రా."ఏమో గుర్రం ఎగరావచ్చు..."