హోమ్

13, నవంబర్ 2016, ఆదివారం

మాయా'జాలం'

లోకమే కానరాకుంది మనిషికి,
అరచేతిలో అద్దం మొలిచాక.

దూరమైపోయాడు  సాటి మనిషికి,
నెట్టింట జాలం పురుడు పోసుకున్నాక.

31, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీరంగనీతులు

మట్టి వినాయకుల్నే వాడండి!!!
దీపావళికి టపాసులు కాల్చకండి!!!
ఇది చాలా మంది ప్రకృతి ప్రేమికులు/ సెలబ్రిటీ లు చెబుతున్నమాట.

"ప్రకృతేం నీ అబ్బ సొత్తుకాదు
ఒకనెల నీటినీ,
మరోనెల గాలినీ
కలుషితం చెయ్యడానికి."
ఇలాంటివి మరి కొంతమంది మేధావులు చెబుతున్నది.

నిజమే కావచ్చు, వారి ఆర్తి అర్ధం అవుతోంది.

కానీ వీళ్ళంతా ఏడాది పొడుగునా, ప్రకృతిని ఇంతగానే ప్రేమిస్తుంటారా? అంటే అనుమానమే.
రోజూ కాలినడకతోనో, సైకిల్ మీద తిరుగుతూనో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతూనో కాలుష్యాన్ని తగ్గిస్తూంటారా అంటే అనుమానమే.
"మేం కార్లల్లో తిరుగుతూ లెక్చర్లు దంచుతాం, 
కానీ సామాన్యుడా నువ్వుమాత్రం ఇంత అమానుషంగా పండుగలు జరుపుకుంటావా?" అని అడుగుతున్నట్లనిపిస్తుంది నాకయితే.

సెలబ్రిటీలూ, మేధావులూ, మీరు చెప్పినట్లే మట్టి వినాయకుల్ని వాడుతున్నాం, టపాసులూ మానేస్తాం, మీరు కార్ల వాడకం మానేసి, కాలుష్యం తగ్గించండి.

శ్రీరంగనీతులు ఎదుటి వారికే అంటారా?!!!

21, సెప్టెంబర్ 2016, బుధవారం

బంధోత్సవం

పిట్టలన్నీ ఆఖరిసారి రెట్టవేసి గూళ్ళకి చేరేవేళ, సుబ్బారావు ముఖం వేలాడేసుకుని ఇంటికి చేరేసరికి, సుందరి హాల్లో తెల్ల కాగితాల మీద చెట్ల బొమ్మలేస్తోంది. 
బుజ్జిగాడు తన రూంలో ఏదో పని చేసుకుంటున్నట్లున్నాడు.

'ఏవిటోయ్ పెయింటింగా?' అన్నాడు చిలిపిగా.

అదేం కాదు అంది ముసిముసిగా నవ్వుతూ.

సుబ్బూ కంగారు పడి, 'ఏం చేస్తున్నావురా బుజ్జీ' అనుకుంటూ, బుజ్జిగాడి గదిలో కి దూరిపోయాడు.వారం రోజుల క్రితం ఇలాగే ముసిముసిగా నవ్వుతూ, 'నేనో గొప్ప విషయం కనిపెట్టాను తెలుసా' అంది. ఏమిటో అనడిగితే, అబ్బా ఆశ! చెప్పుకో చూద్దాం అంది. 

ఆ విషయం చెప్పుకోలేక పోయినందుకు, చెప్పలేనన్ని బాధలు భరించాడు. అందుకే ఈ కంగారు.

ఏం జరిగిందన్నట్లు చూశాడు బుజ్జి గాడి వైపు.

'ఏదో ట్రావెల్ ప్రోగ్రామనుకుంటా నాన్నా, చదువుకుంటుంటే నన్ను పిలిచి, హరిద్వార్, కాశీ చూపిస్తున్నారు రా చూడు అంది. ఇప్పుడే ఆ ప్రోగ్రాం అయ్యింది, నువ్వొచ్చావు.' అన్నాడు బుజ్జి అమాయకంగా.

అంటే ఇప్పుడు అర్జంటు గా ఏదైనా తీర్ధయాత్ర చేద్దామంటుందన్నమాట అనుకున్నాడు స్వగతంలో.

'బంగారం, ఈ నెల లో సెలవు దొరకటం కష్టం, వచ్చే నెలలో వెళ్దామా హరిద్వార్ కి?' అన్నాడు సుందరి నుద్దేశించి, ధీమా గా, ప్రేమగా.

'ఇప్పుడక్కడికెందుకుట?'అన్న ప్రశ్న విని గతుక్కుమన్నాడు.

అయితే ఇదేదో కొంప మునిగే యవ్వారం లా ఉందని ఫిక్సై పోయాడు.

'అవన్నీ తర్వాత, ఇవాళ నేనో కొత్త థ్రిల్లింగ్ విషయం కనిపెట్టాను తెలుసా?' అంది.

'చెట్టు బొమ్మ ఎలా గియ్యాలనా?'

'నీకెప్పుడూ వేళాకోళమే, ఇది చాలా సీరియస్సు సంగతి' అంది.
చాలా భయమేసింది సుబ్బూ కి. 

ఈ మధ్య ఇలానే సీరియస్సు సంగతి అని, 'ప్రకృతి కి ప్రణామం' అనే సినిమా చూసి, ఇల్లంతా మొక్కలూ, చెట్లూ, పొదలూ, పాదులూ వేయించేసింది. అప్పటినుంచీ ఎప్పుడు పుల్లూ, భల్లూకాలూ వస్తాయోనని తెగ భయం గా బతుకుతున్నాడు.

ఇప్పుడు మళ్ళీ సీరియస్సు సంగతి అంటోంది.

'నువ్వు నాకు తాతవి అవుతావు, నేను నీకు పిన్ని అవుతాను. మరి బుజ్జి గాడేమో వాడి కి వాడే మావయ్య అవుతాడు తెలుసా'
ఎడిసన్  కూడా అంత సంబరపడి ఉండడు, బల్బు కనిపెట్టినప్పుడు. అంత సంబరంగా చెప్తోంది .

ఉలిక్కి పడ్డాడు సుబ్బూ. ఇప్పటి వరకూ ఇచ్చిన షాకులు వేరు, ఇది వేరు.

'పొద్దున్న నేనాఫీసుకి వెళ్ళేటప్పుడు భార్యాభర్తలమేగా, సడెన్ గా ఇలా ఎలా అవుతాం? పైగా మనం పెళ్ళి కి ముందు చుట్టాలం కూడా కాదు.' లాజిక్ లాగుదామని చూశాడు.

సినిమాలే కాదు, సుందరి కూడా లాజిక్ కి అందదన్న విషయం అతనికి తెలియంది కాదు. అయినా ఏదో ఆశ, సగటు ప్రేక్షకుడి లాగా.

'నాకు తెలుసు నువ్వీ రియాక్షను ఇస్తావని. నేను ప్రూవ్  చేయగలను.' అంది ధీమాగా.

తగిన రీసెర్చి చేసిందని చెప్పకనే చెబుతున్నాయి ఆమె చేతిలోని కాగితాలు.

'ఎలా కనిపెట్టానంటావ్?' అంది తనే.

'నువ్వే చెప్పు'లౌక్యం ప్రదర్శించాడు.

'ఏముందీ, నా వైపు ఏడుతరాలూ నీ వైపు ఏడు తరాలూ పరిశీలించి ఇదిగో ఈ వంశవృక్షాలు గీశా. అంతే అన్ని బంధుత్వాలూ తెలిసిపోయాయ్.' అంది ఉత్సాహంగా.

అంటే అవి చెట్లు కాదన్నమాట.

'అవునూ, ఈ వివరాలన్నీ నీకెలా తెలిసాయి? అసలిప్పుడీ మహాయజ్ఞం తలపెట్టాలని నీకెందుకనిపించింది?' ఇండియా వాంట్స్ టు నో అని అరిచే గోస్వామి స్టైల్లో అరవాలనుకుని, మామూలుగానే అడిగాడు.

'ఓ అదా,ఇందాక యప్ టీవీ లో బంధోత్సవం సినిమా చూసి ఇవన్నీ కనిపెట్టేశా' 

'మరి వీటితో ఇంకేం చేద్దామనుకుంటున్నావ్' తరువాత రాబోయే ఉపద్రవాల్ని తలచుకుని వణికిపోతూ అడిగాడు. 

'సుబ్బూ మనం కూడా ఆసినిమాలో లా కాశీ, హరిద్వార్ వెళ్దాం, నువ్వు మీనాన్న కేమౌతావో తెలియట్లేదు. అక్కడేమైనా వివరాలు దొరుకుతాయేమో!!'

సుబ్బు ఫెయింటైపోయాడు.

జై బంధోత్సవం!!!

9, ఆగస్టు 2016, మంగళవారం

పసిడి క్రాంతి

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (26/10/1997) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?"

ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
పసిడి క్రాంతి
క్షమాజాలు నరికి నవసమాజాలు నిర్మించుకున్న పాపానికి,
నేడు వనాలన్నీ తాము దహనమౌతూ, మనిషినీ శిక్షిస్తున్నాయి.
ప్రకృతి కాంతని క్షోభ పెట్టినందుకేనేమో,
నేడు ఓజోన్ పొర ఆల్ట్రా వయొలెట్లను వర్షిస్తోంది.
నాడు విస్తరణ కాంక్షతో పరస్పరం చంపుకున్నందుకేనేమో,
నేడు హైటెక్ తుపాకీ లు వాటంతటవే విషాన్ని గ్రక్కుతున్నాయి.
ధనార్జన ఇంధనంతో నడిచే పరిశ్రమలపై క్రమ్మిన,
స్వార్ధమేఘాలు వర్షించి, వికసించిన అవినీతి ప్రసూనాలు
ఘ్రాణించీ,ఘ్రాణించీ రాటుదేలిన,
మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?
భావి తరాలు స్వేచ్ఛా సౌహ్రార్ధ్ర వాయువులు పీల్చేదెన్నడో?



8, ఆగస్టు 2016, సోమవారం

మకుటమౌదాం


ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"ఎదల నడుమ ఎల్లలు లేని 
మానవీయతకు మకుటమౌదాం.
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.
మకుటమౌదాం
ఎవరో ఎక్కడో ట్రిగ్గర్ నొక్కుతారు,
వేలకొలదీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలసి పోతాయి.
ఎక్కడో ఒక చోట ఎప్పుడూ స్వాతంత్ర్య పోరాటం జరుగుతూనే ఉంటుంది.
అయినా భువన భవనంపై శాంతి బావుటా ఎగురుతూనే ఉంటుంది.
ప్రపంచం ఆర్ట్ గ్యాలరీలోని అన్ని చిత్రాల్లోనూ మృత్యువే.
అన్ని ముఖాలలోనూ భయమే.

ఒకే పుడమి ఒడిలో, ఒకే నింగి నీడన నిదురించే
ప్రపంచ ప్రజలారా రండి.
గతాన్ని మరచీ,
మతాన్ని పూడ్చీ,
ఎల్లలు దాటీ రారండి.

ఏకమౌదాం,
వసుధైక కుటుంబం లో మమేకమౌదాం.
మనసుంటే చూసీ, ప్రేముంటే పంచీ, సమైక్య జీవన సౌందర్యానికి  ప్రతీకలౌదాం.
'నేను నాద'నే తమో మేఘాల్ని చీల్చి, 'మనం' అనే ఉదయభానుణ్ణి వీక్షిద్దాం.
కలసి ఉంటే కానిదేమిటి? ఏకమైతే పోయేదేమిటి?
మదర్ చిరునవ్వు సాక్షిగా,
భువి పై శాంతిని ఆవాహనం చేద్దాం.
కలనైనా యుద్ధమెరుగని ప్రశాంతతకు చేరువౌదాం.
మచ్చుకైనా ఈర్ష్య దొరకని సచ్ఛీలతకు నెలవౌదాం.
ఎదల నడుమ ఎల్లలు లేని మానవీయతకు మకుటమౌదాం.
కరడు గట్టిన స్వార్ధ హృదయాలని బ్రద్దలు చేసి,
మరో ప్రస్థానానికి నాందీ వాచకం పలుకుదాం రండి.

ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.

22, జూన్ 2016, బుధవారం

మళ్ళీ ఫెయిల్

టీనేజీ లో దాదాపుగా ప్రతీ అబ్బాయికీ తన తండ్రి తో ఒక రకమైన పోటీ ఉంటుంది.
ఒక్కోసారి అది ఎంతవరకు పోతుందంటే, అమ్మతో మాట్లాడేటప్పుడు, 'మీ ఆయన' అనే వరకూ.
ఇంత జరుగుతున్నా, తండ్రి ఎక్కడా తగ్గినట్లు కనపడదు. పై పెచ్చు, కుర్రాడు ఉంటున్న ఇల్లూ, ఎంజాయ్ చేస్తున్న పాకెట్ మనీ తండ్రివే.
ఎప్పుడైనా అబ్బాయి ఎగ్జాం తప్పితే మాత్రం, అది ఇంకాస్త దూరం వెళ్తుంది.
తల్లి మీద చలాయించే అథారిటీ తగ్గదు, తమ్ముడి మీద పెత్తనమూ తగ్గదు, కాని తండ్రి కొంచెం దూరం గా ఉంటూంటాడు అబ్బాయి.
నాన్న హాల్లో ఉంటే, పిల్లాడు గది లో బుద్ధిగా చదూకుంటున్నట్లుంటాడు.
నాన్న గదిలో ఉంటే, తను హాల్లో తచ్చట్లాడుతుంటాడు.
ఎక్కడ కంట పడితే క్లాసు పీకుతాడో అని భయం. 
అలాంటి సందర్భంలో కూడా ఈ తండ్రీ కొడుకుల్ని కలిపేది క్రికెట్ మాత్రమే.

ఆ రోజు .. 
నాన్న సోఫా లో కూర్చున్నాడు. కొడుకు, నాన్న దృష్టిలో పడనంత దూరంగా క్రింద కూర్చున్నాడు. 
ఇద్దరూ శ్రధ్ధ గా టీవీ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్  చూస్తున్నారు.
సప్లిమెంటరీ లో కూడా ఇంగ్లీషు పరీక్ష తప్పినందుకు నాన్న చీవాట్లు పెట్టి ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు. అయినా క్రికెట్ విషయం లో ఏదో ధైర్యం.
ఇండియా మొదట బ్యాటింగ్. సచిన్ ఇంకా ఆడుతున్న రోజులవి. చాలమంది అతను రిటైర్ అవ్వాలని కోరుకుంటున్న రోజులు కూడానూ.
పది ఓవర్లౌతున్నా ఇంకా పరుగుల వరద మొదలవ్వలేదు. 
కొడుకు నెమ్మదిగా సోఫా దగ్గరికి జరిగాడు. తండ్రి పెద్దగా పట్టించుకోలేదు. 
కొడుకు లో ఏదో కాన్‌ఫిడెన్సు మొదలైంది. 
సరిగ్గా అప్పుడే సచిన్ ఔటయ్యాడు. 
"ఛఛ, సచిన్ రిటైరైపోతే బావుండేది", అన్నాడు నాన్న. 
వెంటనే కొడుకు, "నో నో డాడీ, ఐ థింక్ హి హాజ్ లాట్ ఆఫ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిం " అన్నాడు. 
ఇంగ్లీషు పరీక్ష తప్పినా, క్రికెట్ విషయం లో కొడుకు ఇంగ్లీషు లో మాట్లాడడం నాన్న అంత గా పట్టించుకోలేదు. 
ఇంకేం, కొడుకు ఛాతీ మరో ఇంచి పెరిగింది.
నెమ్మదిగా సోఫా లో కూర్చున్నాడు. నాన్న పరీక్ష విషయం మరచి పోయినట్లున్నాడు, అనుకున్నాడు కొడుకు.
ఓవర్లౌతున్నాయి. లక్కీ గా పరుగులూ మొదలయ్యాయి.
కొడుకు కాలి మీద కాలేసుకుని కంఫర్ట్ గా కూర్చున్నాడు.
తండ్రీ కొడుకులు క్రికెట్ మీద చర్చ కూడా మొదలెట్టారు.
"నాన్నా, అమ్మని పకోడీలు చెయ్యమననా" అడిగాడు కొడుకు.
"సరే" అన్నట్లు తలూపాడు నాన్న.
"అమ్మా, పకోడీలు చెయ్యి, అలానే టీ కూడా" అక్కడినుంచే ఆర్డరేశాడు కొడుకు.
హమ్మయ్య ఇక పరీక్ష గొడవ ఐపోయినట్లే అనుకున్నాడు.
సరిగ్గా అప్పుడే, బ్రేకు లో
"నేను మళ్ళీ ఫెయిలయ్యాను నాన్న గారూ" అంటూ టీవీ లో సెంటర్ ఫ్రెష్ యాడ్.

కట్ చేస్తే .. కొడుకు, నాన్న దృష్టిలో పడనంత దూరంగా క్రింద కూర్చున్నాడు. 

గమనిక:యూట్యూబ్ లో చూసిన జాకిర్‌ఖాన్ హిందీ జోకుకి స్వేచ్ఛానువాదం.

11, మే 2016, బుధవారం

పేరులో'నేముం'ది

ఎప్పట్లాగే చాయ్ దుకాణం దగ్గర కాపు కాసాడు అతను. కొన్నాళ్ళుగా తాను గమనిస్తున్న అమ్మాయి వచ్చే టైమైంది. ఆ అమ్మాయి కూడా తనని క్రీగంట చూసి, మునిపంటి మాటున చిరునవ్వు చిందించినట్లుంటుంది. భ్రమో, నిజమో అర్ధం కాదు. ఈరోజు ఎలాగైనా మాట్లాడాలని తీర్మానించుకున్నాడు.అంతలో రానే వచ్చింది. దగ్గరగా నడుస్తూ  పేరడిగాడు.
పద అంది.
రెట్టించిన ఉత్సాహంతో వెంట బయల్దేరాడు.
"ఏంటి నా వెంట వస్తున్నావ్,ఫో" అంది. అయోమయంతో ఆగిపోయాడు.
తర్వాత రెండ్రోజులు ఇదే తంతు. ఆ అమ్మాయి మనసు అర్ధం కాలేదతనికి.

ఎలాగైనా తేల్చుకోవాలనుకున్నాడు. మరునాడు, మరో ఇద్దరమ్మాయిలతో వచ్చింది.
"అక్కా రోజూ పేరడుగుతున్నాడని చెప్పానే ఇతనే " అంది.
"రోజూ పదమంటావ్ వస్తే పొమ్మంటావ్, ఏమిటి నీ ఉద్దేశ్యం?" అడిగాడతను.
కిసుక్కున ముగ్గురమ్మాయిలూ నవ్వుకోవడం అతని దృష్టిని దాటి పోలేదు.
"ఇది మా అక్క వాక్య, ఇది మా చెల్లి అక్షర" అంది పరిచయం చేస్తూ.
"మరి నువ్వో?" అన్నాడు.
"ఇంకా అర్ధం కాలేదా? నా పేరే పద" అంది.
"మీ నాన్న తెలుగు టీచరా? ఇలా వాక్య, పద, అక్షర అని పేర్లు పెట్టాడు?" అడిగాడతను.
"ఇంతకీ నీ పేరేమిటోయ్?" అతని ప్రశ్నని పట్టించుకోనట్లే అడిగింది వాక్య.
"వ్యాకరణ్" సిగ్గు పడుతూ చెప్పాడతను.
"ఓ మీ నాన్నా తెలుగు టీచరేనా?" ఆశ్చర్యం గా అడిగింది అక్షర.
"అబ్బే లేదు. నా పూర్తి పేరు కరణం వ్యాఘ్రేశ్వర్రావ్, మీ పేర్లకి తగ్గట్లుగా ఉంటుందని ఇప్పుడే వ్యాకరణ్ అని మార్చేసుకున్నాను." మెలికలు తిరిగి పోతూ అన్నాడు వ్యాకరణ్ అలియాస్ వ్యాఘ్రేశ్వర్రావ్.

9, మే 2016, సోమవారం

నిర్వచనాలు

పూజలు చేసేవాడు కాదు,

సాటి మనిషికి సాయం చేసిన వాడే,

సిసలు భక్తుడు.


కోట్లు ఖర్చు పెట్టే వాడు కాదు,
లేని వాడికి పట్టెడన్నం పెట్టినవాడే,
శ్రీమంతుడు. 

వేదాన్ని చదివినవాడు కాదు
జీవన వేదాన్ని నేర్చిన వాడే
పండితుడు.

ఆస్తులు పంచిన వాడు కాదు,
విలువలు పంచిన వాడే
అసలు తండ్రి.

నీతులు చెప్పేవాడు కాదు,
ఆచరించి చూపిన వాడే,
నిజమైన గురువు.

20, ఏప్రిల్ 2016, బుధవారం

రాజకీయ బేతాళం

"మేంగో మేన్ సెంటర్ కి థ్యాంక్స్ చెప్పాడు తెలుసా" వస్తూనే అన్నాడు గిరి.
వాడికి రాజకీయాల పిచ్చి, ముఖ్యం గా ప్రముఖుల ఏకపక్ష ట్వీట్లు చూసి, అదే రాజకీయ సమాచారం అనుకునే వాళ్ళలో వీడు ఒకడు.
"ఇంతకీ ఈ మేంగో మేన్ ఎవరు? సెంటర్ కి థ్యాంక్స్ ఎందుకు చెప్పాడు?" 
"ఇది కూడా తెలీదూ? ఆమాద్మీ ని ఆంగ్లీకరిస్తే మేంగో మేన్"
అప్పుడర్ధమయ్యింది వీడు దిల్లీ సిఎం నీళ్ళ ట్వీటు గురించి మాట్లాడుతున్నాడని. ఇది జరిగి చాలా రోజులయ్యిందిగా, ఇప్పుడెందుకా గోల, విసుగ్గా అన్నా. 
"కానీ నేనిప్పుడే చూశా. కాశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ ఇచ్చేవరకూ నేను ఇంటర్నెట్ వాడకుండా నిరసన వ్యక్తం చేశా" గొప్పగా చెప్పాడు వాడు.
వీడికి ఈ కళ కూడా ఉందా? ఆశ్చర్య పోవడడం నా వంతైంది.
"అయితే ఏంటిట?" అన్నా
"ఎప్పుడూ సెంటర్ ని తిట్టే నోరు ఒక్క సారే థ్యాంక్స్ చెప్తే విశేషం గాక మరేమిటీ?" అల్ప సంతోషి వీడు.
"అన్నీ భూతద్దం లో చూడకు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ, మిత్రులూ ఉండరు. నిన్న నితీష్-లాలూ లకి మద్దతిచ్చిన వాడు, రేపు మోదీ కి మద్దతివ్వకూడదని రూలేమీ లేదు. అన్నీ ఓ తాను ముక్కలే, ఈ విషయం తెలీక మనం సోషల్ మీడియా లో కొట్టుకు చస్తుంటాం."
మన్మోహన్ సింగు గట్టిగా మాట్లాడినట్టు ఉలిక్కి పడ్డాడు.
"నువ్వన్నది ససేమిరా జరగని పని. రాజకీయాల్లో నాకున్న నాలెడ్జి ని బట్టి చెబుతున్నా" అన్నాడు.
"అంత నాలెడ్జి ఉంటే నేనడిగే వాటికి సమాధానం చెప్పగలవా?" సవాల్ చేసాన్నేను.
"ఆ తప్పకుండా."
బేతాళ ప్రశ్నలు:
1) తన జీతాన్ని తానే అమాంతం పెంచేసుకున్న దిల్లీ సిఎం, సామాన్యుడి జీవన ప్రమాణాన్ని అమాంతం ఎందుకు పెంచలేదు?
2) విదేశాల్లో విపరీతం గా మాట్లాడే పిఎం స్వదేశం లో రోజు రోజుకీ పెరుగుతున్న సమస్యల పై ఎందుకు మాట్లాడటం లేదు?
3) ఉద్యమాల్లో నేతల కుటుంబాలు కాకుండా కేవలం విద్యార్ధులే ఎందుకు ఆత్మ హత్య చేసుకుంటారు?
4) లక్షల కోట్లున్న నాయకులు, ప్రజల కోసం సొంత డబ్బు ఒక్క పైసా కూడా ఎందుకు ఖర్చు పెట్టరు?
5) హైదరాబాదు ని ప్రపంచ పటం లో నిలిపానన్న బాబు, మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు చావు దెబ్బ తిన్నాడు?
6) విదేశాల్లో చదువుకున్నాని చెప్పే రాహుల్ గాంధీ ఒక్క మీటింగు లో కూడా సరిగ్గా ఎందుకు మాట్లాడలేడు?
7) గడ్డి కుంభ కోణం లో శిక్ష పడ్డా కూడా, బీహార్ ప్రజలు లలూ పార్టీకే ఎందుకు ఓట్లేశారు?
8) యూనివర్సిటీల్లో జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యక్రమాలకి కొన్ని మీడియా వర్గాలు, పార్టీ లు ఎందుకు వత్తాసు పలుకుతున్నాయి?
9) సెంటర్ లో చక్రం తిప్పగలిగిన బాబు, ఆంధ్రా కి ప్రత్యేక హోదా ఎందుకు ఇప్పించ లేకపోతున్నాడు?
10)ప్రశ్నించడానికే పుట్టానన్న జన సేనాని, ఎందుకు చాలా విషయాల్లో మౌనంగా ఉంటున్నాడు?
సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ 3జి కనెక్షను కట్ చేస్తా అని హెచ్చరించాను.

"వీటన్నిటికీ సమాధానం నేను చెప్పగలను, విని అర్ధం చేసుకునే సత్తా నీలోఉందా?" అన్నాడు.

"సత్తా అంటే గుర్తొచ్చింది, రాజకీయ ప్రక్షాళణే ధ్యేయంగా గోదాలోకి దిగిన లోక్ సత్తా, ఎందుకు అస్త్ర సన్యాసం చేసింది?" మరో ప్రశ్న వేశా.

"నీకు నోస్ట్రడోమస్ తెలుసా? ఆయన ఆత్మ ని అడగి తెలుసుకోవాలి ఇవన్నీ. యండమూరి తులసిదళం నవల ఒకసారిద్దూ ఆత్మలతో మాట్లాడాలి". పలాయనం చిత్తగించాడు గిరి.



14, ఏప్రిల్ 2016, గురువారం

సుబ్బారావు కి కోపంతో

ఉదయం 7:38

సుబ్బారావు హడావుడిగా ఏదో వెతుకుతున్నాడు. అతని భార్య సుందరి ఇంకా నిద్ర పోతోంది. అసలు సుందరి, సుబ్బారావు ల పరిచయం ఒక మాదిరిగా జరగలేదు.సుబ్బారావు గొప్ప అందగాడేమీ కాదు, ఏదో సంపూ లా ఉంటాడు కానీ ఎంతో కష్టపడి ప్లాన్ చేసి, లండన్ లోనే అతి పెద్ద మిలియనీర్ కూతురైన సుందరిని పడేశాడు.

సరిగ్గా మూడు నెలల క్రితం .. ఆరోజు,

పొద్దున్నే సుందరి ఇంట్లో కరెంటు పోయింది. నిజానికి గత ఇరవై ఏళ్ళలో తన ఇంట్లో కరెంట్ పోవడం ఇదే ఫస్టు టైం. దాంతో, సుందరి తల్లికి ఇడ్లీ లోకి చట్నీ చెయ్యడం కుదరలేదు. ఆ చికాకు వల్ల, సుందరి తన తండ్రి తో కలిసి తాగే వన్ బై టూ టీ కూడా తాగలేదు. యేపనీ లేకపోయినా పొద్దున్నే బయటకి పోవడం సుందరికి అలవాటు. టీ మిస్సవడం వల్ల ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ లో మసాలా టీ తాగుదామని బయలు దేరింది. సరిగ్గా శరవణ భవన్ కి చేరేసరికి, ఒకే టేబుల్ ఖాళీగా ఉండడం తో అక్కడే కూల బడింది. అప్పుడు చూసింది తొలిసారి సుబ్బారావుని. అప్పటికే సుబ్బారావు తనకి కావల్సిన ప్లేట్ ఇడ్లీ,మసాలా టీ ఆర్డరు చేసి రెడీగా ఉంచాడు.

"నేనేం తింటానో నీకెలా తెల్సు?" ఆదుర్దాగా అడిగింది సుందరి.

సుబ్బు ఒక కొంటె నవ్వు నవ్వి, బ్రేక్‌ఫాస్టు కి పిలిచింది నేనే కదా, నాకే తెలియదా అన్నాడు.

"నువ్వు పిలవడమేమిటి నాన్సెన్స్, నువ్వెవరో కూడా నాకు తెలియదు"

"కానీ నువ్వు నాకు తెలుసు. రోజూ మీ ఇంట్లో తినే ఇడ్లీ ఇవాళ ఇక్కడ తినేలా నేనే చేశా" అన్నాడు సుబ్బు.

అంతెందుకు, నువ్వు ఈ టేబుల్ దగ్గరికి కూడా నా వల్లే వచ్చావ్ అన్నాడు.

ఏం కాదు, మిగతా టేబుల్స్ దగ్గర బాగ ఈగలు ముసురుకున్నాయి అందుకే ఇక్కడికి వచ్చా అంది.

ఆ టేబుల్స్ దగ్గర ఈగల్ని నేనే ఏర్పాటు చేశా అని, మెల్లగా ఒక సిగ్నల్ లాగా దగ్గాడు. అంతే ఆ ఈగలన్నీ ఏదో పని ఉన్నట్లు, పక్క రెస్టారెంటు కు పోయాయి. 

ఈ సంఘటనతో సుందరి సుబ్బారావునీ, అతడి తెలివి నీ ప్రేమించేసింది. సుందరి తెలుగు సినిమాలు చూడక పోవడం, సుబ్బారావుకి కలిసొచ్చింది. నిన్ననే చూసిన తన ఫేవరెట్ హీరో సినిమా తనకి ఇంతగా ఉపయోగపడుతుందనుకోలేదు సుబ్బారావు.

అంతే వారం అటూ ఇటూ గా, డకోటా కంపనీ నుంచి ఆన్‌సైటుకని వచ్చిన సుబ్బారావు, మిలియనీరు అల్లుడైపోయాడు,

ఇప్పుడు టైం 7:39

ఇంకొక్క రెండు నిమిషాల్లో తనకి అది దొరక్కపోతే , తను సూర్యుడు సరిగ్గా తన ఇంటిమీద 42 డిగ్రీ ల కోణం లో ఉండగా బయటకు వెళ్ళలేడు, ఫలితం గా అతడి మామ ఆస్తి అంతా పోవచ్చు.

వార్డ్‌రోబ్ అంతా ఖాళీగా ఉంది.

సరిగ్గా అప్పుడే చూసాడు, డోర్ దగ్గర, తన రైట్ షూ 105 డిగ్రీ కోణం లో ఉంది. 
లెఫ్ట్ షూ సరిగ్గా 90 డిగ్రీస్ లో వెనక్కి తిప్పి ఉంది. ఎవరో కావాలని ఒక కోణం లో పెట్టినట్లు ఉంది. అనుమానం గా అటూ ఇటూ చూసాడు. 
ఈ షూస్ కోణాన్ని బట్టి చూస్తే, తన కుడి కాలి సాక్సు హాల్లో నార్త్ దిశలో, 45 డిగ్రీల కోణంలో ఉండాలి. కరెక్టు గా అలాగే ఉంది కూడా. మరి తన రెండో సాక్సు? దీని కోసమే తను రెండు నిమిషాల నుంచి వెతుకుతున్నాడు. తన జామెట్రీ విజ్ఞానాన్నంతా వాడి, రెండో సాక్సు ఎక్కడుండాలో కనిపెట్టడానికి, అతడికి పది సెకన్లు కూడా పట్టలేదు. కానీ అదక్కడ లేదు. 
మళ్ళీ బెడ్ రూం లోకొచ్చి మంచం కింద చూశాడు. ఆ అలికిడికి సుందరి నిద్ర లేచింది. 

ఏమిటీ వెతుకుతున్నావ్? అంది.

తన సాక్సు సంగతీ, కాలిక్యులేషన్ సంగతీ చెప్పాడు.

టైం కి వార్డ్ రోబ్ లో స్పేర్ సాక్సు లు కూడా లేవు, కంప్లైంట్ చేసాడు.

అంతే, తోక తొక్కిన తాచు లా లేచింది సుందరి. రాత్రి పీకల్దాకా తాగొచ్చి, షూస్, సాక్స్ ఎలా పడితే అలా విసిరేసి, వార్డ్ రోబ్ లో కక్కావ్. అది ఖాళీ చేయించేశాను.అందుకే అది ఖాళీ గా ఉంది. సినిమాలు చూసి వెధవ లాజిక్కులు వెతకడం కాదు.కొంచెం వాడు అంటూ అతడి తల వైపు చూపించి,  నీ రెండో సాక్సు నీ కాలికే ఏడ్చింది, చూసుకునేడు. అంది.

గతుక్కు మన్నాడు సుబ్బారావు. అయితే సుందరి కూడా నాన్నకు ప్రేమతో చూసేసిందన్నమాట. హతవిధీ!!


16, ఫిబ్రవరి 2016, మంగళవారం

కష్టం లో సంబరాలు

కష్టం వచ్చినప్పుడు మనిషి స్పందించే తీరు ఆ మనిషి వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణం అంటారు.

కట్ టూ బందరు బస్టాండు:

            దాదాపు పాతికేళ్ళ క్రితం, బందరు బస్టాండులో విజయవాడ టికెట్ల క్యూ లో ఉన్నాన్నేను . జేబులో చిల్లిగవ్వ లేకపోయినా ఏ ధైర్యంతో క్యూ లో నిలబడ్డానో నాకే తెలియదు. సరిగ్గా అప్పుడొచ్చాడు అతను, "ఏంటి ఇక్కడ మా ఊళ్ళో? బెజవాడకేనా?" అని పలకరించి, తనతో పాటూ నాకూ టికెట్ తీశాడు. ఎక్కడో చూసినట్లుందే గానీ, ఎవరో గుర్తు రాలేదు చప్పున. అప్పటికే నేను అనారోగ్యం తో కాలేజీ కి దూరమై నెల పైనే అయ్యుంటుంది. దారి పొడుగునా ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఎవరో, ఏమిటొ అడిగే ధైర్యం చెయ్యలేదు నేను. ఎంతైనా టికెట్ కొన్నాడు గా మరి.

ఆ తర్వాత కాలేజీ లో మళ్ళీ కనబడ్డాడు, అప్పుడర్ధమయ్యింది, తను మా జూనియర్ అని. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి చాలా రోజులే పట్టింది నాకు. వాళ్ళ హాస్టలు కెళ్ళి ఇవ్వబోతే సున్నితం గా వారించాడు, నా అభ్యంతరాలన్నీ తేలిగ్గా కొట్టి పారేశాడు. ఆ పరిచయం అంతకన్నా ముందుకు పోలేదు ఆ రోజుల్లో.

కట్ టూ సంబరాలు:

             మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఐ.ఐ.టి ఎడ్మిషన్లలో కనిపించాడు. మా క్లాసే, మా హాస్టలే. అప్పుడే అతని గురించి మరింత తెలుసుకునే అవకాశం దొరికింది. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండేవాడు. సంబరాలు అనే ముద్దు పేరు కూడా సంపాదించాడు ఫ్రెండ్సర్కిల్లో . ఒక మనిషితో ఒక సారి మాట్లాడితే, ఎంత కాలమైనా ఆ మనిషిని పూర్తి వివరాలతో సహా గుర్తుంచుకోగలిగేవాడు. జీవితం మీద అతనికున్న దృక్పధం, కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం ఎంతో స్ఫూర్తిమంతం గా ఉండేది.

కట్ టూ ప్రెజెంట్:

        తర్వాతి కాలం లో ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడి, ఒక విదేశీ వనితని పెండ్లాడి, ఒక బిడ్డకి తండ్రయ్యాడు మా సంబరాల గంగాధర్. అంతటి ధైర్యశాలికి ఏ తండ్రికీ రాకూడని కష్టం వచ్చింది. 




గంగాధర్,రేచల్ దంపతుల గారాలపట్టి , మూడేళ్ళ సరస్వతి ప్రస్తుతం లుకేమియా తో పోరాడుతోంది. ఈ కష్టాన్ని కూడా అతను చిరునవ్వుతో నే ఎదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. .

ఇది సరస్వతి వైద్య ఖర్చుల నిమిత్తం ఏర్పాటు చేసిన "గో ఫండ్ మీ" పేజ్.
https://www.gofundme.com/24kun5uc

ఈ facebook పేజి సరస్వతి supporters కోసం
https://www.facebook.com/groups/1500390773601766/

 వదాన్యులు అందరూ ఆ దంపతుల కి బాసట గా నిలవాలని, చిన్నారి సరస్వతి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.






9, ఫిబ్రవరి 2016, మంగళవారం

ఏలిన వారి కరుణ

ఏలిన వారు ఆనందంగా ఉన్నారు. ఇలానే రాజ్యం చేస్తే మరో పది జన్మల దాకా అధికారం తమదేనని కార్యకర్తలంతా ముక్త కంఠంతో చెప్పి మరీ వెళ్ళారు.

అవును మరి కొత్త కొత్త పధకాలతో ప్రజలకి ఊపిరి సలపనంత మేలు చేస్తున్నాం, మనకి కాక మరి ఎవరికి కడతారు పట్టం?

భృత్యుడు దిగులుగా ఉన్నాడు. అయ్యా!ప్రజలు మీరనుకుంటున్నంత సంతోషం గా లేరన్నాడు.

ఎందుకన్నట్లు చూసారు ఏలినవారు.

"పక్క రాష్ట్రం తో పోలిస్తే మీ చరిష్మా తగ్గింది. మీ పధకాలు సరిగ్గా అమలు కావడం లేదు. కొందరు అమాత్యులు పబ్లిసిటీ లో మిమ్మల్నే మించి పోతున్నారు. కరెంటుబాధలూ, అందని పింఛన్లూ, రాని జాబులూ, పోయిన భూములూ ఇలా ఒకటేమిటి ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు ప్రజలు".

ఏలినవారు షాకవ్వలేదు సరికదా తమ స్టైల్లో ఒక  నవ్వు విసిరి ఇలా చెప్పారు.

"పిచ్చివాడా, ప్రజలకి కష్టాలు లేకుండా పరిపాలించిన వాడు మళ్ళీ అధికారం లోకి రాలేడు. వాళ్ళ కష్టాలు మనం తీరుస్తామనే ఆశ తోనే వాళ్ళు మళ్ళీ మనకి ఓటెయ్యాలి. అయినా 2050 కల్లా దేశం లోనే నంబర్ ఒన్ రాష్ట్రం అవుతుందని ప్రజలు గట్టి నమ్మకం తో ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళని ఆకర్షిస్తున్నాం, కాదంటే సభ లోంచి తన్ని తగలేస్తున్నాం, ఇక మనకి తిరుగు లేదు"

"కానీ భూములిచ్చిన వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నామనే బాధ తో ఉన్నారు"

ఏలినవారికి జాలేసింది.

"నీకు బలి చక్రవర్తి కథ తెలుసా?"

తెలుసన్నట్లు తలూపాడు భృత్యుడు.
"బలి చక్రవర్తి ని విష్ణుమూర్తి వామనావతారం లో వచ్చి, మూడడుగులు భూమి అడిగాడు. మూడవ అడుగు బలి చక్రవర్తి తల పై వేసి అతణ్ణి అంతం చేసాడు" ఆనందంగా చెప్పాడు భృత్యుడు.

"నీకు తెలియని విషయం చెప్తా విను" అనుగ్రభాషణం మొదలెట్టారు.

"బలి చక్రవర్తి ని వరుణ పాశంతో బంధించమని గరుడుని ఆదేశించాడు, విష్ణుమూర్తి. మూడవ అడుగు వేసిన తరువాత కూడా ఆ పాశం వీడలేదు. అప్పుడు బలి చక్రవర్తి తాత అయిన ప్రహ్లాదుడు  తన సర్వస్వమూ నీకే సమర్పించిన బలిని ఇంకా బాధించవద్దు, అతడిని విడువ వలసిందని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి
 
ఎవ్వని గరుణింప నిశ్చయించితిని వాని యఖిల విత్తంబు నే నపహరింతు 

అన్నాడు. రాజు విష్ణుమూర్తి తో సమానం అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి.  అంటే ఏమిటన్నమాట, ప్రజలని కరుణించాలంటే, ముందు వారి సంపదని మనమే అపహరించి, వారిని అశక్తుల్ని చేసి, ఆ తరువాత అనేకానేక పధకాలతో వాళ్ళని మనమే ఉధ్ధరించి, మళ్ళీ మళ్ళీ ఓట్లు దండుకోవాలన్న మాట.

మొత్తం రాజకీయ యోగం ఒకేసారి తెలుసుకున్నట్లు భృత్యుడి మొహం విప్పారింది.

నందో రాజా భవిష్యతి!!!

1, ఫిబ్రవరి 2016, సోమవారం

తెలుగు వెలుగు లో నా కవిత

నేను ఏదైనా వ్రాయగలను అని నేను పదో తరగతి కొచ్చేవరకూ నాకే తెలియదు. నా స్నేహితుడొకడు నన్ను ఏడిపించడానికి ఒక కవిత వ్రాసి ఇచ్చాడు. ఉడుకుమోత్తనంతో నేనూ వాడి పై ఒక తవిక బరికేసాను. తొంభయ్యవ దశకం లో  చాలామంది మధ్య తరగతి టీనేజ్ పిల్లల్లాగే నేనూ కమ్యూనిస్ట్ భావాలకి దగ్గరయ్యాక, మరి కొద్దిగా వ్రాయడం మొదలైంది. చుట్టూ ఉన్నవాళ్ళు బాగానే ఉన్నాయ్ అంటున్నా, నా తవికలు ఎప్పుడూ ప్రచురణార్హమైనవి అనుకోలేదు. తొంభై ఏడు లో ఆలిండియా రేడియో విజయవాడ కి తప్ప ( ప్రసారమయ్యాయి కూడాను), ఎప్పుడూ ఏ పత్రికకీ పంప లేదు. వ్రాసిన ఇరవై ఏళ్ళకి, ఈ మధ్య మా నాన్న గారు చొరవ తీసుకుని పంపిస్తే, తెలుగు వెలుగు వాళ్ళు అచ్చేసి, యాభై రూపాయలు కూడా పంపారు.

ఆ 'కవనం' అనే తవిక లంకె ఇక్కడ. 

http://ramojifoundation.org/flipbook/201601/magazine.html#/20

ఈ తవిక చూసి నాలాగే మీకు నవ్వొస్తే, మీ తప్పు కాదు. చలం చెప్పినట్లు చాలా వాటికి క్షమించాలి నన్ను.



29, జనవరి 2016, శుక్రవారం

వెయ్యి కొట్టిన రామ్@శృతి.కామ్ - సమీక్ష

ఈ బ్లాగు మొదలు పెట్టిన తర్వాత వెయ్యి వీక్షణలు పూర్తి చేసుకున్న మొదటి టపా, రామ్@శృతి.కామ్ పై నేను రాసిన సరదా సమీక్ష.

వెయ్యి వీక్షణలు

28, జనవరి 2016, గురువారం

వివేచన

ఎన్ని జన్మాల దాస్యమో

సంసారమను కూపాన పడి

తెగ కలియ తిరిగాను.

ఏ జన్మలో పుణ్యమో

దాసోహమంటూ నీ పాదాల పై పడి

నిను శరణు వేడాను.

ప్రభూ!,

శివుడవో, కేశవుడవో,

విధాతవో, వేరొకరివో,

తల్లిని మించిన దైవం ఏదని

కరుణను మించిన ప్రార్ధన ఏదని

మనసుని మించిన మందిరమేదని

నాలోనే ఉండి నీ ప్రశ్నతో

నన్ను మనిషి గా మార్చావు.


25, జనవరి 2016, సోమవారం

కులమే అన్నిటికీ మూలమా?

రోహిత్ మరణం తర్వాత, ఎంతో మంది, ఎన్నో కోణాలలో విశ్లేషించారు. 
ఆ దృక్కోణాలన్నీ చూస్తున్నపుడు నన్ను తొలిచిన ప్రశ్నలు, 
కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరమా?
కులమే అన్నిటికీ మూలమా?

నా అనుభవంలోకొచ్చిన కొన్ని సంఘటనలు తలచుకొని, అలోచించడం మొదలు పెడితే..

దాదాపు పాతికేళ్ళ క్రితం మాట:
పేద ఓ.సి కుర్రాడి కథ:
పదో తరగతిలో 500 పైగా మార్కులతో పాసయ్యాడు. పాలిటెక్నిక్ ఎంట్రన్సు లో వంద లోపు ర్యాంకు తెచ్చుకున్నాడు. మెకానికల్ చదవాలనుకున్నా, జనరల్ కేటగిరీ లో సీటు దొరకలేదు.
ప్రైవేటు ఫీజులు చెల్లించలేక దొరికిన బ్రాంచి లోనే, ప్రభుత్వ కళాశాల లో చేరాల్సి వచ్చింది.
అయినా బాధ పడలేదు వాడు, అదే మహా భాగ్యమనుకొన్నాడు. తమ కులం వాళ్ళకే ఉచిత వసతి, భోజనం పెట్టే (ప్రైవేటు ఛారిటీ) హాస్టల్లో వుంటూ చదువుకున్నాడు.
కాలేజీ లో తనకు రావాల్సిన మెరిట్ స్కాలర్షిప్పు కూడా, వాళ్ళే మింగేస్తే, ఏ విద్యార్ధి సంఘమూ బాసట గా నిలవలేదు. (అప్పట్లో ఇప్పుడున్నన్ని సంఘాలు లేవేమో).
అయినా సమాజం లో ఉదార స్వభావుల సహాయంతో, పీజీ దాకా చదివాడు. ఈ ప్రభుత్వానికి తన లాంటి మెరిట్ విద్యార్ధులు అక్కరలేదేమో అనుకున్నాడు. ఫారిన్ లో సెటిలయ్యాడు. తను అవ్వాలనుకున్నది కాలేకపోయాడు.

ఇద్దరు పేద ఎస్టీ కుర్రాళ్ళ కథ:
తమ తమ తండాల్లో పదో తరగతి దాకా చదివిన అతి కొద్ది మందిలో ఒకరు. ఒకడు అత్తెసరు మార్కులతో, మరొకడు సగటు మార్కులతో పాసయ్యారు.  పాలిటెక్నిక్ ఎంట్రన్సు లో యాభైవేల లోపు ర్యాంకు ఒకడు, పదివేల లోపు ర్యాంకు మరొకడు తెచ్చుకున్నారు. 
రిజర్వేషన్ లేకపోతే ప్రభుత్వ కాలేజి లో ఖచ్చితం గా సీటు రాదు.
స్కాలర్షిప్పు కూడా బానే అందేది. ఇబ్బందులెదురైతే, విద్యార్ధి సంఘం సాయ పడేది (ఆర్ధికం గా కాదు).
ఒకడు కష్టపడి చదివాడు, ఇప్పుడు దేశం గర్వించదగ్గ ఒక రీసెర్చి సెంటర్ లో శాస్త్రవేత్త గా వున్నాడు.
మరొకడు ప్రభుత్వం ఇచ్చే ఉచిత వసతి, భోజన సదుపాయం, పాకెట్ మనీ, వీటికోసమే అన్నట్లుండేవాడు. ఒక్క సబ్జెక్టూ పాసైన దాఖలాలు లేవు. ఇప్పుడు రాజకీయాలలో తిరుగుతున్నాడు.

ముగ్గురూ కాలేజీ లో ర్యాగింగు కి గురయ్యారు. ఇక్కడ కూడా కులాల వారీ గానే ర్యాగింగు ఉండేది. కులాల వారీ గానే కొట్లాటలూ, గ్రూపులూనూ. అసహ్యకరమైన  పేర్లతో పిలవబడడమూ కులాలని బట్టే. (ఏ ఒక్క కులమూ ఇందులో మినహాయింపు కాదు).
ముగ్గురూ పేద వారే. కులాన్ని బట్టి ప్రభుత్వం సాయం చేసిందే కాని వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి, ప్రతిభని బట్టి కాదు. 

ఇలా రిజర్వేషన్ వల్ల ఇబ్బందులు పడ్డవాళ్ళూ, ఆసరాగా తీసుకుని ఎదిగిన వాళ్ళూ, అలుసుగా తీసుకుని పాడైన వాళ్ళూ కోకొల్లలు.అప్పుడే పుట్టిన ఒక బిడ్డ భవిష్యత్తు, తను పుట్టిన కులం ఆధారంగా మాత్రమే నిర్ణయింపబడడం దురదృష్టకరం.

రిజర్వేషన్లు ఎత్తేయాలని కొందరూ, ఆర్ధిక స్థితి ని బట్టి రిజర్వేషన్లు ఉండాలని కొందరూ అంటున్నారు, ఇంకా ఎన్నో వాదనలు  మీడియా లో వస్తున్నాయి. వీటిలో ఏది సరైనదో నాకు తెలీయదు కానీ , ప్రభుత్వమే ఎలాంటి కండీషన్లూ లేకుండా, అందరికీ, కేజీ టు పీజీ ఉచితం గా విద్యనందించాలి .  సీట్లు మాత్రం ప్రతిభ ఆధారం గానే ఇవ్వాలి అనే అలోచన బాగున్నట్లనిపిస్తోంది. పార్టీ లు విద్యార్ధుల జీవితాలని రాజకీయం చేయకుండా, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతం గా, అందరికీ న్యాయం జరిగేలా ఒక విధానాన్ని తీసుకు రావాలనుకోవడం, కుల-మతాలు అన్ని దరఖాస్తుల్లోంచి మాయమవ్వాలనుకోవడం, నా లాంటి సామాన్యుడికి  అత్యాశేనేమో.
గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో,