హోమ్

21, సెప్టెంబర్ 2016, బుధవారం

బంధోత్సవం

పిట్టలన్నీ ఆఖరిసారి రెట్టవేసి గూళ్ళకి చేరేవేళ, సుబ్బారావు ముఖం వేలాడేసుకుని ఇంటికి చేరేసరికి, సుందరి హాల్లో తెల్ల కాగితాల మీద చెట్ల బొమ్మలేస్తోంది. 
బుజ్జిగాడు తన రూంలో ఏదో పని చేసుకుంటున్నట్లున్నాడు.

'ఏవిటోయ్ పెయింటింగా?' అన్నాడు చిలిపిగా.

అదేం కాదు అంది ముసిముసిగా నవ్వుతూ.

సుబ్బూ కంగారు పడి, 'ఏం చేస్తున్నావురా బుజ్జీ' అనుకుంటూ, బుజ్జిగాడి గదిలో కి దూరిపోయాడు.వారం రోజుల క్రితం ఇలాగే ముసిముసిగా నవ్వుతూ, 'నేనో గొప్ప విషయం కనిపెట్టాను తెలుసా' అంది. ఏమిటో అనడిగితే, అబ్బా ఆశ! చెప్పుకో చూద్దాం అంది. 

ఆ విషయం చెప్పుకోలేక పోయినందుకు, చెప్పలేనన్ని బాధలు భరించాడు. అందుకే ఈ కంగారు.

ఏం జరిగిందన్నట్లు చూశాడు బుజ్జి గాడి వైపు.

'ఏదో ట్రావెల్ ప్రోగ్రామనుకుంటా నాన్నా, చదువుకుంటుంటే నన్ను పిలిచి, హరిద్వార్, కాశీ చూపిస్తున్నారు రా చూడు అంది. ఇప్పుడే ఆ ప్రోగ్రాం అయ్యింది, నువ్వొచ్చావు.' అన్నాడు బుజ్జి అమాయకంగా.

అంటే ఇప్పుడు అర్జంటు గా ఏదైనా తీర్ధయాత్ర చేద్దామంటుందన్నమాట అనుకున్నాడు స్వగతంలో.

'బంగారం, ఈ నెల లో సెలవు దొరకటం కష్టం, వచ్చే నెలలో వెళ్దామా హరిద్వార్ కి?' అన్నాడు సుందరి నుద్దేశించి, ధీమా గా, ప్రేమగా.

'ఇప్పుడక్కడికెందుకుట?'అన్న ప్రశ్న విని గతుక్కుమన్నాడు.

అయితే ఇదేదో కొంప మునిగే యవ్వారం లా ఉందని ఫిక్సై పోయాడు.

'అవన్నీ తర్వాత, ఇవాళ నేనో కొత్త థ్రిల్లింగ్ విషయం కనిపెట్టాను తెలుసా?' అంది.

'చెట్టు బొమ్మ ఎలా గియ్యాలనా?'

'నీకెప్పుడూ వేళాకోళమే, ఇది చాలా సీరియస్సు సంగతి' అంది.
చాలా భయమేసింది సుబ్బూ కి. 

ఈ మధ్య ఇలానే సీరియస్సు సంగతి అని, 'ప్రకృతి కి ప్రణామం' అనే సినిమా చూసి, ఇల్లంతా మొక్కలూ, చెట్లూ, పొదలూ, పాదులూ వేయించేసింది. అప్పటినుంచీ ఎప్పుడు పుల్లూ, భల్లూకాలూ వస్తాయోనని తెగ భయం గా బతుకుతున్నాడు.

ఇప్పుడు మళ్ళీ సీరియస్సు సంగతి అంటోంది.

'నువ్వు నాకు తాతవి అవుతావు, నేను నీకు పిన్ని అవుతాను. మరి బుజ్జి గాడేమో వాడి కి వాడే మావయ్య అవుతాడు తెలుసా'
ఎడిసన్  కూడా అంత సంబరపడి ఉండడు, బల్బు కనిపెట్టినప్పుడు. అంత సంబరంగా చెప్తోంది .

ఉలిక్కి పడ్డాడు సుబ్బూ. ఇప్పటి వరకూ ఇచ్చిన షాకులు వేరు, ఇది వేరు.

'పొద్దున్న నేనాఫీసుకి వెళ్ళేటప్పుడు భార్యాభర్తలమేగా, సడెన్ గా ఇలా ఎలా అవుతాం? పైగా మనం పెళ్ళి కి ముందు చుట్టాలం కూడా కాదు.' లాజిక్ లాగుదామని చూశాడు.

సినిమాలే కాదు, సుందరి కూడా లాజిక్ కి అందదన్న విషయం అతనికి తెలియంది కాదు. అయినా ఏదో ఆశ, సగటు ప్రేక్షకుడి లాగా.

'నాకు తెలుసు నువ్వీ రియాక్షను ఇస్తావని. నేను ప్రూవ్  చేయగలను.' అంది ధీమాగా.

తగిన రీసెర్చి చేసిందని చెప్పకనే చెబుతున్నాయి ఆమె చేతిలోని కాగితాలు.

'ఎలా కనిపెట్టానంటావ్?' అంది తనే.

'నువ్వే చెప్పు'లౌక్యం ప్రదర్శించాడు.

'ఏముందీ, నా వైపు ఏడుతరాలూ నీ వైపు ఏడు తరాలూ పరిశీలించి ఇదిగో ఈ వంశవృక్షాలు గీశా. అంతే అన్ని బంధుత్వాలూ తెలిసిపోయాయ్.' అంది ఉత్సాహంగా.

అంటే అవి చెట్లు కాదన్నమాట.

'అవునూ, ఈ వివరాలన్నీ నీకెలా తెలిసాయి? అసలిప్పుడీ మహాయజ్ఞం తలపెట్టాలని నీకెందుకనిపించింది?' ఇండియా వాంట్స్ టు నో అని అరిచే గోస్వామి స్టైల్లో అరవాలనుకుని, మామూలుగానే అడిగాడు.

'ఓ అదా,ఇందాక యప్ టీవీ లో బంధోత్సవం సినిమా చూసి ఇవన్నీ కనిపెట్టేశా' 

'మరి వీటితో ఇంకేం చేద్దామనుకుంటున్నావ్' తరువాత రాబోయే ఉపద్రవాల్ని తలచుకుని వణికిపోతూ అడిగాడు. 

'సుబ్బూ మనం కూడా ఆసినిమాలో లా కాశీ, హరిద్వార్ వెళ్దాం, నువ్వు మీనాన్న కేమౌతావో తెలియట్లేదు. అక్కడేమైనా వివరాలు దొరుకుతాయేమో!!'

సుబ్బు ఫెయింటైపోయాడు.

జై బంధోత్సవం!!!

9, ఆగస్టు 2016, మంగళవారం

పసిడి క్రాంతి

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (26/10/1997) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?"

ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
పసిడి క్రాంతి
క్షమాజాలు నరికి నవసమాజాలు నిర్మించుకున్న పాపానికి,
నేడు వనాలన్నీ తాము దహనమౌతూ, మనిషినీ శిక్షిస్తున్నాయి.
ప్రకృతి కాంతని క్షోభ పెట్టినందుకేనేమో,
నేడు ఓజోన్ పొర ఆల్ట్రా వయొలెట్లను వర్షిస్తోంది.
నాడు విస్తరణ కాంక్షతో పరస్పరం చంపుకున్నందుకేనేమో,
నేడు హైటెక్ తుపాకీ లు వాటంతటవే విషాన్ని గ్రక్కుతున్నాయి.
ధనార్జన ఇంధనంతో నడిచే పరిశ్రమలపై క్రమ్మిన,
స్వార్ధమేఘాలు వర్షించి, వికసించిన అవినీతి ప్రసూనాలు
ఘ్రాణించీ,ఘ్రాణించీ రాటుదేలిన,
మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?
భావి తరాలు స్వేచ్ఛా సౌహ్రార్ధ్ర వాయువులు పీల్చేదెన్నడో?



8, ఆగస్టు 2016, సోమవారం

మకుటమౌదాం


ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"ఎదల నడుమ ఎల్లలు లేని 
మానవీయతకు మకుటమౌదాం.
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.
మకుటమౌదాం
ఎవరో ఎక్కడో ట్రిగ్గర్ నొక్కుతారు,
వేలకొలదీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలసి పోతాయి.
ఎక్కడో ఒక చోట ఎప్పుడూ స్వాతంత్ర్య పోరాటం జరుగుతూనే ఉంటుంది.
అయినా భువన భవనంపై శాంతి బావుటా ఎగురుతూనే ఉంటుంది.
ప్రపంచం ఆర్ట్ గ్యాలరీలోని అన్ని చిత్రాల్లోనూ మృత్యువే.
అన్ని ముఖాలలోనూ భయమే.

ఒకే పుడమి ఒడిలో, ఒకే నింగి నీడన నిదురించే
ప్రపంచ ప్రజలారా రండి.
గతాన్ని మరచీ,
మతాన్ని పూడ్చీ,
ఎల్లలు దాటీ రారండి.

ఏకమౌదాం,
వసుధైక కుటుంబం లో మమేకమౌదాం.
మనసుంటే చూసీ, ప్రేముంటే పంచీ, సమైక్య జీవన సౌందర్యానికి  ప్రతీకలౌదాం.
'నేను నాద'నే తమో మేఘాల్ని చీల్చి, 'మనం' అనే ఉదయభానుణ్ణి వీక్షిద్దాం.
కలసి ఉంటే కానిదేమిటి? ఏకమైతే పోయేదేమిటి?
మదర్ చిరునవ్వు సాక్షిగా,
భువి పై శాంతిని ఆవాహనం చేద్దాం.
కలనైనా యుద్ధమెరుగని ప్రశాంతతకు చేరువౌదాం.
మచ్చుకైనా ఈర్ష్య దొరకని సచ్ఛీలతకు నెలవౌదాం.
ఎదల నడుమ ఎల్లలు లేని మానవీయతకు మకుటమౌదాం.
కరడు గట్టిన స్వార్ధ హృదయాలని బ్రద్దలు చేసి,
మరో ప్రస్థానానికి నాందీ వాచకం పలుకుదాం రండి.

ఆకాశవాణి విజయవాడ వారి భావ చిత్రాలు లో (28/12/1997) ఉత్తమ ఎంట్రీ గా ఎంపికైన కవిత.