తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వార్షిక సంచిక లో నా కథ ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదాలు.
అల వైకుంఠ పురంబు లో, నగరి లో, అని పోతన గారు చెప్పినట్లే, భక్త వల్లభుడా శ్రీహరి శేష పాన్పు పై పరుండి, ఏదో ఆలోచిస్తూ ఉండగా, త్రిలోక సంచారియైన నారదుడు శ్రీవారి దర్శనార్థం వచ్చాడు.
"కలహ భోజనా, ఏమి విశేషాలు?"
"హరి హరీ! మీరూ ఆమాటే అంటే ఎలా యదునందనా? నేను ఏమి చేసినా లోక కళ్యాణార్ధమే యని తమరెరగని సత్యమా."
"ఇంతకీ విషయం చెప్పమనండి ప్రభూ" అంటున్న అమ్మవారి మాట విని, నారదుడు
"నరలోక విచిత్రాలు వివరిద్దామనొచ్చాను ప్రభూ."
"మరల వియోగం తప్పదు కాబోలు" అనుకున్నది అమ్మ వారు, పద్మావతీ వృత్తాంతం తలచుకొని.
"అక్కడచూసిన వైకుంఠ వైభోగం తమరు చూసి తీరవలసింద"న్నాడు నారదుడు.
"మర్త్యలోకమున మరొక వైకుంఠ మా!" ఆశ్చర్యం ప్రకటించాడు అరచేయి చూసుకుంటూ కపట నాటక సూత్ర ధారి.
"అలనాడు త్రేతాయుగంలో తమరు వానరులకిచ్చిన వర ప్రభావమున, తామరతంపరగా పుట్టుకొచ్చిన రాజకీయ నాయకులు, ఐదేళ్ల కొకసారి చూపే అరచేతి లో వైకుంఠం కాదు ప్రభూ నేను చూసినది" అన్నాడు అయ్యవారిని గమనించి.
"మరి?"
"ఒక వైకుంఠం కాదు ప్రభూ, కోటాను కోట్ల వైకుంఠాలు. మానవుల అరచేత మొలిచిన అద్దం కథ. "
"మొదట వైకుంఠ మన్నావు, ఇప్పుడు అద్దం అంటున్నావు. తికమక పెట్టక వివరం తెలుపుము నారదా!" అదిలించారు శ్రీవారు.
"అక్కడే ఉంది కిటుకు ప్రభూ. అది మామూలు అద్దం కాదు. అది సమస్త లోక విషయ విశేషాలు చూపగలదు. స్వర్గమూ నరకమూ, మంచీ చెడూ, దేవ దానవ రీతులూ దాని యందు గలవు. మనిషి సృష్టించిన పదిహేనవ లోకమూ దాని యందే కలదు."
"పదిహేనవ లోకమా?"
"అవును జనార్దనా, దానిని జాల లోకమందురు. దైత్యులందరునూ అచ్చట తిష్ఠ వేసుకునుండి, మానవులనిక్కట్ల పాల్జేయు చుంటిరి. జయ విజయులచ్చటనూ ద్వారపాలకులు గా వర్ధిల్లు చున్నారు. వారినచ్చట ఫేస్బుక్ ,వాట్సాప్ లందురు. వీరు మానవ జాతికి తెచ్చు అనర్ధములు చెప్పనలవి కాదు.
గరుత్మంతుని కంటే బలమైన పక్షి యొకటి దాపురించినది. అది సత్యాసత్య ప్రమేయములు లేక అనేకానేక వార్త లను ప్రచారము గావించుచూ మనుషులను పట్టి పీడించు చున్నది.దానిని ట్విట్టరందురు. వీరే గాక నాళికా సురుడు 'యూట్యూబ్' అను పేర, చిత్రపటాసురుడు 'ఇన్స్టాగ్రాం' అను పేర దిన దినాభి వృద్ధి చెందుతున్నారు.వీరి తో పాటు అనేకానేక పేర్లతో పెక్కురు రక్కసులచట పేట్రేగిపోవుచుంటిరి.
కొందరు లక్ష లైకుల నోము, కోటి ఫాలోయర్ల వ్రతము యను విచిత్ర పూజా విధానములను కనిపెట్టి, లోకులను ప్రలోభ పెట్టుచూ పబ్బము గడుపుకొనుచున్నారు.
క్రొంగొత్త ప్రాతః పఠనీయ మంత్రములనూ కనిపెట్టుచున్నారు. నేడట్టి ప్రార్ధనా మంత్రమొకటి నా చెవిన పడ్డది.
కరాగ్రే వసతే వాట్సాప్
కర మధ్యే ఫేస్బుక్
కర మూలే స్థితా ట్విట్టర్
ప్రభాతే జాల దర్శనం.
మనుజులు వీరి ప్రభావమునకు లోనై, దుర్బలురై, మనోవిచారములతో, దుఃఖములతో బాధ పడుచున్నారు. వీరికి విముక్తి లేదా? వారి ఇక్కట్లను తొలగించుటకు మీరే ఏదైనా మార్గము చెప్పండి ప్రభూ.
అది విన్న మాధవుడు, "నారదా! పెరుగుట విరుగుట కొరకే యను లోకోక్తి నీకు తెలియనిది కాదు. జాలాసుర సృష్టి శివాజ్ఞ లేకుండా జరిగినది కాదు, ఆతని వలన పెక్కు ప్రయోజనములుండుటా కల్ల కాదు. మానవులొట్టి అమాయకులు. వారికెయ్యది ఎటుల ఉపయోగించుకోవలెనో తెలియదు.
జాలాసుర భంజనమునకై పరమశివుని అంశతో వైరస్ అను శక్తి ప్రజ్వరిల్లుచూ ఆ దైత్యులను ఇప్పటికే హడలెత్తించు చున్నది. ఇది కాక హ్యాకింగను మరొక శక్తి కూడా శాయ శక్తులా కృషి చేయు చున్నది. అసురుల పాపము పండువేళ, వీరి శ్రమ కొకనాడు విజయము లభించుట తధ్యము. అంత వరకూ మనుజులు, నిర్జాలీకరణ వ్రతము చేయ వచ్చును”
"నిర్జాలీకరణ వ్రతమ నగా యేమి? అది యెట్లు చేయవలెను?"
నారదా, దుర్లభమగు ఈ వ్రతము మనుజులందరూ చేయ తగినది. అన్ని మతముల వారూ, కులముల వారూ, అన్ని జాతుల వారూ, అన్ని వయసుల వారూ చేయవచ్చును.ఆది వారము నాడు గాని, మరే రోజైననూ గానీ, ఈ వ్రతము చేయ వచ్చును. ప్రాతః, సంధ్యాదులలో ,యే వేళనైననూ చేయ వచ్చును. దీని వలన మానవులకు వారు కోల్పోయిన నిజ జీవితము లభ్యమగును. ఎంచుకున్న సమయము నందు, వీరు నిశ్చింతగా జాల ప్రసారము చేయు చర వాణులనూ, ఇతర పరికరములనూ ఆపి వేయ వలయును. అట్టి సమయమును వారు పిల్లలతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడప వలయును. ఇది వారమునకెన్ని మార్లయిననూ చేయవచ్చును. ఇది సమస్త లోకములకూ ఆనంద దాయకము.
*********శుభం ***********
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి