హోమ్

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కల్లోలం

                         ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం మూడు గంటలకి ముఖ్యమైన పని ఉండడం తో అయిష్టం గానే ఇంటి నుంచి బయలు దేరాను. ఎర్ర కాలువ వంతెన దగ్గరకు వస్తూండగా, ఏదో జరుపుతున్నట్లు గా.పే..ద్ద చప్పుడు.
                            నా కళ్ళ ముందే కాలువ అవతల గట్టున ఉన్న ఇళ్ళూ, భవనాలూ భూమి లోకి కూరుకు పోతున్నాయి. నేను ఎక్క బోతున్న వంతెన కూడా కూరుకుపోతోంది. విచిత్రంగా ఇదంతా జరుగుతుందని ముందే తెలిసినట్లుగా చుట్టూ ఎవరూ లేరు. హాహాకారాలూ లేవు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఇంటి వైపు పరుగు మొదలు పెట్టాను. నా వెనకాలే అన్నీ భూమి లోకి కూరుకుపోతున్నట్లు తెలుస్తూనే వుంది. 2012 లో రావాల్సిన ప్రళయం కొంచెం లేటు గా ఇప్పుడు వచ్చేసిందా.. కలియుగ అంతం లో మళ్ళీ విష్ణు మూర్తి అవతారం వుందని విన్నానే, మరి రాలేదా? అవతారానికి ఇంక టైం ఉందా? గజిబిజి ఆలోచనలతో ఇల్లు చేరుతూనే గట్టి గా అరిచి అందరినీ బయటకు పిలిచాను. అందరం పరుగెత్తుకుంటూ దగ్గరలో ఉన్న గుడి కి చేరాం. అక్కడైతే ఏమీ జరగదని నమ్మకం.
                             అనుకున్నట్లుగానే నేను అద్దెకి వుంటున్న ఇల్లూ ఇంకా ఆ వీధి అన్నీ క్షణాల్లో భూమిలో కి కలిసిపోయాయి. గుడి మాత్రం సురక్షితం గా వుంది. ఆశ్చర్యంగా చుట్టూ చూసాను. నాతో వచ్చిన వాళ్ళెవరూ లేరు. భయం భయం గా భగవంతుణ్ణి తలచుకుంటూ అక్కడే కూర్చున్నాను. చుట్టూ ఏమి జరగనట్లు నేల మీద పచ్చటి గడ్డి మొలిచింది కూడా. ఎంత సమయం గడిచిందో తెలియదు. చేతికున్న గడియారం ఆగిపోయిన విషయం కూడ గమనిచలేదు నేను. ఇంతలో…
                             ఆకాశం లో ఏవో అక్షరాలు మెరిశాయి: భక్తులు ఇచ్చే పాపపు కానుకలని భరింపజాలక, కలియుగ దైవం వారు ఇచ్చిన అదేశాల మేరకు, మేము తలపెట్టిన ప్రక్షాళణ ఇంకొద్ది సేపట్లో ముగియనుంది అని ఆ మేఘ సందేశ సారాంశం. ఫైళ్ళ వారోత్సవం లా స్వామి వారు ప్రక్షాళణ కార్యక్రమం చేపట్టరన్నమాట. హృదయం తేలికై భయం సన్నగిల్లింది.
                         కాసేపట్లో చూస్తుండగానే మొక్కలు మొలిచినట్లు ఇళ్ళూ, భవనాలూ భూమి లోంచి మొలుస్తున్నాయి. కానీ జనం ఏమైనట్లు?? ఆశ్చర్యం తో నా ఎదురుగా ఉన్న పేద్ద పూరి గుడిసె  లోకి ప్రవేశించాను. అది బాగా మంది సొమ్ము మింగాడని పేరుపొందిన మా వార్డు కౌన్సిలర్ ఇల్లు. పైకి ఇల్లు ఎంత అందమైన భవనం లా కనపడేదో గుర్తు చేసుకున్నా, కానీ ఇప్పుడు ఆ భవనం స్థానం లో ఈ గుడిసె? లోపల వాడి ఖరీదైన సామాగ్రి స్థానంలో పాములు. కొన్ని వేల పాములు. నడిచే చోటు కూడా లేకుండా.  స్వామి వారిని తలుచుకున్నా, ఎదురుగా గాలి లో మళ్ళీ మేఘ సందేశం: పరుల సొమ్ము పాము వంటిది అని.
                      మళ్ళీ గుడి వైపు చూశా. ఇప్పుడు అక్కడ ఏదో అన్న సంతర్పణ జరిగినట్లు ఎంగిలి ఆకులు, పదార్ధాలూ నూ. ఏమీ అర్ధం కాక నా అద్దె ఇంటి వైపు నడిచా.. దారిలో మాష్టారి ఇల్లు. మాష్టారు ప్రభుత్వం ఇచ్చే జీతం మాత్రమే తీసుకుంటూ, ప్రైవేట్ల జోలికి పోకుండా త్రికరణశుద్ధి గా పాఠాలు చెబుతారని పేరు.ఎంత అందంగా వుందో ఇల్లు!! ఇంతకు ముందు ఇక్కడ చాల సాధారణమైన ఇల్లు వుండేదే! ఆ ఇంట్లోకి వెళ్ళా, మళ్ళీ అదే అన్నసంతర్పణ సన్నివేశం.విస్తళ్ళన్నీ , చాలా శుభ్రం గా వున్నాయి.తిన్న వాళ్ళెవరో తృప్తి గా తిన్నట్లున్నారు. స్వామి వారిని తలుచుకున్నా, ఎదురుగా గాలి లో మళ్ళీ మేఘ సందేశం: కష్టే ఫలే అని.
                      ఇలా ఎన్నో విచిత్రాలు చూస్తూ,నా ఇంటికి చేరాను. అక్కడ ఇల్లు లేదు, ఖాళీ స్థలం మాత్రమే వుంది. వస్తువులన్నీ నాశనం చేయబడి, ఒక రాశి గా పోయబడి వున్నాయి . ఆ రాశి పై ఎవరో కూర్చున్నారు. ముఖం లో కాంతి ని బట్టి, కలియుగ దైవమే అయ్యి ఉంటారనుకొని, "స్వామీ! ఏమిటి ఈ మాయ? నా ఇల్లు ఏది?" అని అడిగా. అందుకు స్వామి, "ఎవ్వని గరుణింప నిశ్చయించితిని వాని యఖిల విత్తంబు నే నపహరింతు " అన్నారు. ఆహా! పోతన గారిదేమి భాగ్యం, ఆయన పద్యం మీ నోటి వెంట అంటూ స్వామి వారి చేతులు చూసాను. ఏదో లోపం.
                    ఆ! స్వామీ, మీ చేతిలో ఏ చక్రమో, త్రిశూలమో, విల్లో ఉండాలి కదా, ఈ కొరడా ఏమిటి?
                   నీకు నీ ధర్మాన్ని గుర్తు చెయ్యడం కోసం నాయనా అంటూ ఛళ్ళున కొరడా నా పై విసిరారు.
 వీపు చురుక్కు మంది.
నాన్నా! ఇవాళ ఎలాగైనా బ్లాగు పోస్టు రాయాలి మూడింటికి లేపమన్నావుగా లే నాన్నా అని మళ్ళీ కొరడా... కాదు కాదు మా అబ్బాయి.
                  కళ్ళెదురుగా  గోడ మీద స్వామి వారి చిత్ర పటం .. అసతోమా సద్గమయా అంటున్న మనసు ... ఎక్కడి నుంచో సన్నగా వినిపిస్తోన్న కలయో నిజమో వైష్ణవ మాయో పాట...


9, ఆగస్టు 2013, శుక్రవారం

ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్

జోగినాధం లండన్ లో పని చేసే రోజుల్లో ఆఫీసు లో ఒకతను       ( పైనోడు, అంటే రామ్ భాషలో ఉత్తరాది వాడు అని) ఇటలీ గురించి తెగ పొగిడేవాడు. ఎప్పుడూ పిజ్జానో, పాస్తానో తినేవాడు. అతగాడి వైఖరి తో విసుగొచ్చి జోగి ఒకరోజు

"రోజూ పాస్తా, పిజా తిన్నంత మాత్రాన ఇటాలియన్ అయిపోవు" అన్నాడు
"మరి?"
"శాండో నో సుమో నో అవుతావు"
"ఇటాలియన్ అవ్వాలంటే ఏమి చెయ్యాలో?" అన్నాడతను వ్యంగ్యంగా.
"తెలుగు, తెలుగు లో మాట్లాడాలి"
"????"
"తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు, కాబట్టి తెలుగు మాట్లాడితే, మీ రోటీ లు తింటూనే ఎంచక్కా సగం ఇటాలియన్ అయిపోవచ్చు" సూక్ష్మం చెప్పాడు జోగి.


30, మే 2013, గురువారం

రామ్@శృతి.కామ్ - ఒక యాదృచ్ఛిక సమీక్ష

"ఒక తెలివైన వాడు ఎంతో కష్టపడి ఒక రచన చేస్తాడు. అంత కన్నా తెలివైన పాఠకుడు ఆ రచన ని చదివి బాగుందనో, బాలేదనో ఒక్క ముక్క లో విషయాన్ని తేల్చి పారేస్తాడు. అలాగని రచయిత తక్కువా, పాఠకుడు ఎక్కువా కాదు. ఇద్దరూ సమానమే. కాకపోతే పాఠకుడు కొంచం ఎక్కువ సమానం."

రామ్@శృతి.కామ్ -  పుస్తకం తెరిచిన దగ్గర నుండీ, పూర్తయ్యే వరకూ ఏక బిగిన చదివించగల సత్తా వున్న రచన.

         
న్నో పరీక్షలు, కొన్నే మార్కులు అంటూ మొదలైనా, ఎన్నో ఛలోక్తులు (ఆంగ్లం లో అందంగా చెప్పాలంటే పంచ్ డైలాగ్స్), కొన్నే బొమ్మలు. ఎన్నో పాటలు (నిజ్జం గా నిజం), కొన్ని కొన్ని కన్నీళ్ళూ కలిపి రంగరించి వండిన అచ్చ తెలుగు వంటకం (స్వగృహ లో ఇరవై రూపాయలకి కొన్నది కాదు).
          
         ఎన్నో ఏళ్ళుగా జావా తో పోరాడుతూ జవ జీవాలు కోల్పోతున్న నా లాంటి వాళ్ళు తేలిగ్గా ఐడెంటిఫై చేసుకోగలిగిన ఓ సగటు సాఫ్ట్వేర్ ఇంజినీరూ, చచ్చేవరకూ చదవాలనుకున్న సగటు అందమైన శృతి గల హైదరాబాదు, వీళ్ళకి తోడు నిర్మల లాంటి (నాకు తారసపడింది ఇలాంటివాళ్ళే ఎక్కువ)  బాసిణీ, రవి (సినిమాల్లో సహాయ నటుడిలా) లాంటి స్నేహితుడూ, మనసున్న మారాజు శ్రీనివాసరాజు (సాఫ్ట్వేర్ లో ఇలాంటి వాళ్ళు అరుదు) వెరసి, ఈ నవతరం రచన, మెలో డ్రమేటిగ్గా కాకుండా,  ఇంట్లో మనుషులు మాట్లాడుకునే భాష లో వుంది.  అందుచేతనే చదువరి త్వరగా కనెక్టు అయ్యే అవకాశం ఉంది. 
            త్రివిక్రమ్ పేరు తో పాటు శైలిని కూడా వాడుకున్నట్టు అనిపించినప్పటికీ,సంభాషణలు హాయిగా నవ్విస్తాయి. పంచ్ లలో కూడా ఒక సందేశం వుంటుంది.
     ఇంజినీరింగ్ నాలుగేళ్ళలో పిల్లకాయలు కేవలం ఇంజినీరింగ్ మాత్రమే చేస్తే మన దేశం ఎప్పుడో అమెరికాకు అమ్మమ్మ అయ్యేది.  
             ఎంత చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ కథ మొదలుతుందో అంతే సున్నితం గా కొన్ని హృద్యమైన భావాలు కూడా చదువరి మనసుని కదిలిస్తాయి.
    కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కళ్ళు మాట్లాడుకుంటాయి పెదవులు చూస్తాయి. 
            శంకర్ ఉదంతం లో అమ్మానాన్నల ప్రేమని వర్ణించిన తీరు ఆలోచింపచేస్తుంది. మొదటి అమెరికా (లేదా విదేశీ) ప్రయాణం వివరాలు, అరే మనకీ ఇలానే జరిగింది కదా అనిపిస్తాయి. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికీ విడిపోదామనుకునే జంటలకి ఒక ఉదాహరణ గా కథ సాగి, అందమైన మలుపు తో ముగుస్తుంది.

సినిమా భాష లో చెప్పాలంటే,ఇది ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్.
            ఆక్కడక్కడా అక్షర దోషాలు, వీలైనంత తెలుగు లో రాయాలన్న తపన కొన్ని పదాల్లో కనపడతాయి. సామాన్యుని వాడుక భాషలోకి కొన్నిఆంగ్ల పదాలు ఎప్పుడో చేరిపోయాయి. ఆలాంటి పదాలని యథాతథంగా తర్జుమా చెయ్యటంకంటే అలానే వాడి వుంటే బాగుండేదనిపించింది.

           రచయిత తాను మొదలు పెట్టిన ప్రయాణం లో పాఠకుడిని కలుపుకుని చివరి వరకూ ఆగకుండా తీసుకెళ్ల గలిగితే ఆ రచన విజయవంతమైనట్లే. పాఠకుడు కోరుకునేదీ అదే.
                             
ఈ పుస్తకం చదవాలంటే ఇక్కడ దొరుకుతుంది.  బొమ్మ, నీలం రంగు వాక్యాలు రామ్ పుస్తకం లోంచి సంగ్రహించినవే.

తోక: ఈ పుస్తకాన్ని ఏ రైల్లోనో, బస్సులోనో, ఇతర బహిరంగ ప్రదేశాలలోనో చదవాలనుకుంటే, మీ చుట్టుపక్కల వాళ్ళని ముందుగానే హెచ్చరించండి. మీరు ఉన్నట్టుండి పగలబడి నవ్వుతుంటే మీకు లాఫ్టర్ డయేరియా వచ్చిందేమోనని వాళ్ళు కంగారు పడే ప్రమాదం ఉంది.