హోమ్

30, ఏప్రిల్ 2013, మంగళవారం

తాగుబోతులు, రమేషు, ఒక తాళం చెవి..

              అర్ధరాత్రి అయినా నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు రమేషు. ఇంతలో కిటికీని ఎవరో ఏదో బాదుతున్న చప్పుడైంది. చటుక్కున లేచి,  డిశెంబరు నెల చలిలో ఇంత రాత్రి ఎవరై ఉంటారా అనుకుంటూ, కిటికీ తెర తీసి చూసాడు. హమ్మయ్య మన కిటికీ కాదు. గ్రౌండు ఫ్లోరు వాళ్ళ కిటికీ. వాళ్ళ అమ్మాయి బాదుతోంది, బహుశా తలుపు అనుకుందేమో.శుక్రవారం నాడు బాగా తప్ప తాగి ఇలా అర్ధరాత్రి రావటం ఆమెకి కొత్త కాదు.ఈ వయసులో ఆమె అనుభవిస్తున్న స్వేచ్ఛ కీ, విశృంఖలత్వానికీ తేడా చెప్పే ప్రయత్నం చేసారో లేదో ఆమె తల్లిదండ్రులు. నెమ్మదిగా కిటికీ తెరచి, వాళ్ళ ఇంటి తలుపు వెనక వైపు వుందనీ, అటు వెళ్ళి బాదుకోమనీ సలహా ఇచ్చి, మళ్ళీ పక్క మీద చేరాడు. భార్యా పిల్లలు గాఢ నిద్రలో వున్నారు. ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళినట్లుంది, ఏదో గొడవ వినపడుతోంది. ఈ దేశానికి వలస రాక ముందు ఇలాంటివి చూసి ఎరుగడు. మొదట్లో ఆశ్చర్యం గా అనిపించినా ఈ పదేళ్ళలో అలవాటైపోయింది. గాంధీ గారు విదేశాలకి వెళ్ళినప్పుడు మద్య,మాంసాలు ముట్టనని తన తల్లిగారికి మాట ఇచ్చారట. తనూ అదే ఆదర్శం తో ముందుకు పోతున్నాడు. ఈ దేశస్థులు ఆఫీసు పార్టీల్లో మద్యం ముట్టని తనని చూసి అడుగుతూ ఉంటారు, ఇది మీ మతం కట్టుబాటా, వ్యక్తిగత కట్టుబాటా అని. ఇదేమంత గొప్ప విషయం గా తనకెప్పుడూ అనిపించలేదు. అన్నట్లు ఈ కొత్త బాసు బాగా వేధిస్తున్నాడు. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కోడింగ్ చేసి, ఆ అనుభవం తో ఇప్పుడు నాకు తెలియనివి ఏవీ లేవని కోతలు కోస్తూ మన పని మనల్ని చేసుకోనివ్వకుండా ఏడిపిస్తూంటాడు. వాడికి విస్తరాకులు సీరియల్ ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో చూపించాలి ఒక సారి, మళ్ళీ మన జోలికి రాడు. తన ఆలోచనలకి తనే నవ్వుకుంటూ నిద్ర లోకి జారుకున్నాడు రమేషు.
                 అలారం మోగుతుండగా 'అప్పుడే ఐదయిందా' అనుకుంటూ నిద్ర లేచాడు. వారాంతమైనా పొద్దున్నే నిద్ర లేవడం తను పెరిగిన పల్లెటూరి అలవాటు. ఇంతలోనే తలుపు కదులుతున్న చప్పుడైంది. బయట గాలికేమో అనుకుంటూ కిటికీలోంచి బయటకి చూసాడు. తమ ఫ్లాట్స్ ముందున్న మొక్కలూ ,చెట్లూ కదలడం లేదు. ఇది తలుపు కొడుతున్న చప్పుడు కాదు, ఎవరో నెమ్మదిగా తోస్తున్నారు. ఇంత పొద్దున్నే, బయటి కమ్యూనిటీ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చి, తన తలుపు తడుతున్నారు.ఎందుకో మనసు కీడు శంకించింది. లైట్లు వెయ్యకుండా, నెమ్మదిగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి, పీప్ హోల్ లోంచి చూసాడు. కటిక చీకటి, మెట్ల మీద లైటు వేసుకోలేదు తలుపు తోస్తున్న వ్యక్తి. కళ్ళు చిట్లించి పరీక్ష గా మళ్ళీ చూసాడు. ఏదో ఆకారం కదులుతోంది. పొట్టిగా, కదల లేక కదులుతున్నట్లుగా భారం గా కదులుతోంది ఆ ఆకారం. కార్పెట్ మీద ఏదో ఈడుస్తున్నట్లు గా కూడా చప్పుడు అవుతోంది. చూడబొతే తన ఇంట్లోకి ప్రవేశించడం ఆ ఆకారం లక్ష్యం గా అనిపించటంలేదు. చిన్నప్పుడు చదివిన డిటెక్టివ్ నవలలు గుర్తుకొచ్చి, పరిస్థితి ని అంచనా వెయ్యడం మొదలు పెట్టాడు.
              చీకటిలో ఏదో ఈడ్చుకెళ్తున్నాడంటే, అది శవమా? మరి ఇంకేదైనా అయ్యుంటుందా? ఒక వేళ శవమైతే, తన ఇంట్లోకి ఎందుకు రావాలి? ఇంకేదైనా అయ్యుంటే, లైటు ఎందుకు వేసుకోలేదు? కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. నెమ్మదిగా ఇలాంటి ఆకారం ఎక్కడైనా చూసానా అని ఆలోచించ సాగాడు. ఆ, వీడు పై ఇంటి రాబ్ కొడుకా, సరిగ్గా ఐదు అడుగుల ఎత్తు వుంటాడు, శుక్రవారం తండ్రీ కొడుకులు తప్ప తాగి కొట్టుకు చచ్చి, తమ నిద్ర చెడగొట్టిన సందర్భాలు కొన్ని వున్నాయి. వాడే ఏదో వెధవ పని చేసినట్లున్నాడు. తరచి చూస్తే తూలుతున్నట్లున్నాడు కూడా, సందేహం లేదు వాడే. ఇప్పుడు వీడేమి చెయ్యబోతున్నాడు? వెధవకి తన ఇంట్లో దూరాల్సిన పని ఏముంది? కొంప దీసి మత్తులో తండ్రిని చంపేసాడా? అలా చేసివుండడు. మరి ఈ చీకటిలో ఏమి ఈడ్చుకు వెళ్తున్నాడు? వాడు మళ్ళీ తూలుతూ వచ్చి తలుపు నెమ్మదిగా తోశాడు. ఈసారి తను కొద్దిగా తలుపు మీద వాలి, బలంగా నించున్నాడు రమేషు. వాడి వల్ల కావటం లేదు తలుపు తొయ్యటం. ఐదేళ్ళుగా ఈ ఇంట్లో వుంటున్నా ఎప్పుడూ  భయపడే అవసరం రాలేదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ ఎవరికీ తెలియక పోయినా, ఇతరులని ఇబ్బంది పెట్టే పనులు ఎవరూ చెయ్యలేదు.
            ఈ సారి వాడు గట్టిగా తోస్తున్నాడు. ఇక లాభం లేదనుకుని, తలుపు పై భాగం లో వున్న సెక్యూరిటీ లాక్ ని తిప్పాడు రమేషు. దాని చప్పుడుకి వాడు ఉలిక్కి పడ్డి, గబగబా పరుగెత్తి బయటకు పోయాడు. వెంటనే తను కూడా హాల్లోకి పరుగెత్తి కిటికీ లో నుంచి రహస్యం గా బయటకు చూసాడు. వాడే!! రాబర్ట్ కొడుకే వీడు. ఆందోళన గా, చలికి వణుకుతూ ,తన ఇంటి వైపే చూస్తున్నాడు. టైం ఐదున్నరవుతోంది.అంటే రాబర్ట్ బయటకు వచ్చే టైం. ప్రతీ రోజూ ఈ సమయానికి స్మోక్ చెయ్యడానికి వస్తాడు. వస్తూ ఎలాగో మెట్ల మీద లైటు వేస్తాడు. అప్పుడు తేలిపోతుంది వీడు చేసిన పని ఏమిటో. ఆత్రుత గా ఎదురుచూస్తున్నాడు రమేషు.
                        పై ఫ్లాటు తలుపు తీసిన చప్పుడైంది. తొందరగా మళ్ళీ మెయిన్ డోర్ దగ్గరకు పరుగెత్తి,పీప్ హోల్ లోంచి చూశాడు. రాబర్ట్ మెట్లు దిగుతూ లైటు వేశాడు. ఏమీ జరగనట్లే, మామూలు గానే మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయాడు. అంటే అక్కడేమీ జరగలేదా? అనుకుంటూ మళ్ళీ కిటికీ లోంచి చూశాడు. ఇప్పుడు రాబర్ట్ తన కొడుకుని బయట చూసి ఆశ్చర్య పోయాడు. ఇక్కడున్నావేమిటి అని ఆడిగినట్లున్నాడు. వాడు తన ఇంటి వేపే చూపిస్తూ ఏదో చెబుతున్నాడు. రాబర్ట్ మళ్ళీ పైకి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసిన రమేషు కి "సారీ! మా వాడు బాగా తాగి, తెలవారుతుండగా ఇల్లు చేరాడు. బయట కమ్యూనిటీ డోర్ దగ్గర కక్కాడు కూడా. మా ఇల్లు అనుకుని మీ ఇల్లు తెరవబోయాడు. తాళంచెవి  ఇరుక్కు పోయిందిట. అది లాగటానికి ప్రయత్నిస్తుంటే, మీరు చేసిన చప్పుడు కి భయపడి అదిగో అలా పారి పోయాడు. మీరు ఏమైనా అంటారేమోనని భయం గా బయటే నిలబడి పోయాడు." అని చెప్పి 
తాళంచెవి తీసుకుని చక్కా పోయాడు. ఈ వెధవల వల్ల తను ఎంత భయపడ్డాడు? ఒక్క 'సారీ' నా మొహాన పడేసి పోయాడు. టీనేజర్ల లో బింజ్ డ్రింకింగు ఈ దేశానికున్న పెద్ద సమస్య అని పేపర్ల లో చదివినప్పుడు తెలియలేదు గాని, నిజమే.
                      పదహారో యేట తల్లిదండ్రులే పెద్ద ఫంక్షను లా చేసి పిల్లలకి మద్యం త్రాగించడం ఇక్కడి సంస్కృతి ట. కానీ ఇప్పుడా అవసరం లేకుండానే పిల్లలు పదో యేట నుంచే తాగుతున్నారట. దాని పరిణామాలు ఇవాళ తనకు కనపడ్డాయి. ఈ వెస్ట్రనైజషన్ కోసమేనా తన దేశం వెంపర్లాడుతోంది? టీనేజర్ల లో బింజ్ డ్రింకింగు మన దేశానికీ సమస్య కాబోతోందా? అలోచిస్తూనే తన పని లో పడ్డాడు రమేషు.

22, మార్చి 2013, శుక్రవారం

సమరం

కత్తులు దూసిన క్షణికావేశం
పుడమిని తడిమిన నెత్తుటి వర్షం   
అసువులు బాసిన జన సందోహం
అశ్రువులోడ్చిన మనసుల ఖేదం  
విజయం తో ఒక మది వీరంగం  
జయాపజయములు ఎవ్వరివైనా
సమరం ఇచ్చును తీరని శోకం.

19, జనవరి 2013, శనివారం

మాటలు బాబోయ్ మాటలు

పని లేని బిజీ రావు అసహనం గా ఛానెళ్ళు మారుస్తూ టివి ముందు కూర్చున్నాడు. 
  • టివి 29 : డెంటెడ్ అండ్ పెయింటెడ్ ముఖర్జీ గారి వ్యాఖ్యల మీద కొందరు అరుచుకుంటున్నారు.
  • టివి 55 : దోశా రావణ్ పాపి స్వామి వారు స్త్రీ రక్షణ గురించి అనుగ్రహ భాషణం మీద కొందరు కరుచుకుంటున్నారు.
  • దోషి టివి: మంత్రి గారు "క్రైములు మనకి చెప్పి చేస్తారా వాటిని ఎలా ఆపగలం" అని నాలిక కరుచుకున్న వైనం పై కాంచిపురపు బబ్రహ్మణ్యం కామెడీ షో.
  • మీ టివి2: వస్తున్నా పదవి కోసం యాత్ర పై స్పెషల్ కవరేజి.
  • బిబిఎన్ తెలుగు జ్యోతి: తెలుగు యువ కిశోరం పీకేష్ బాబు ట్వీట్లు, లోక కళ్యాణం పై రచ్చ ..సారీ చర్చ
సామాజిక నిస్పృహ కొంచెం ఎక్కువే వున్న బిజీ రావు కి ఇవన్నీ కొత్తగా అనిపించలేదు. ఇంత వయొలెంట్ వి కాకుండా కాస్త అమ్మయిలని, పువ్వులని చూద్దామని మళ్ళీ ఛానెల్ మార్చాడు. ఇప్పుడు:
  • మీ మ్యూజిక్: పక్కనే ఉన్న మీ ఫ్రెండ్సు కి మెస్సేజీ సెండ్ చెయ్యాలనుకుంటున్నరా అయితే ఇప్పుడే కాల్ చెయ్యండి అంటూ తెలుగు అమ్మాయి తెగులు గా ఆహ్వానిస్తోంది. 
వెంటనే రావుకి పక్కనే ఐపాడు లో కూత లు వింటూ ఊగిపోతున్న తన గాళ్ ఫ్రెండు లేహ్య గుర్తు వచ్చింది.వెంటనే లేహ్య కి ఒక మెస్సేజి పంపి, ఒక పాట ని డెడికేట్ చేసాడు.
  • శోకిని మ్యూజిక్: త్వరలో రాబోయే కామిని ఎస్సెమ్మెస్స్ 2 గురించి కాల్ ఇన్ ప్రోగ్రాం విత్ డోక్తా కపూర్ తెలుగు డబ్బింగు.
ఎస్సెమ్మెస్స్ అనగానే తను ఎస్సెమ్మెస్స్ చెక్ చేసుకుని ముప్ఫై సెకన్లు దాటి పోయిందని గ్రహించి వెంటనే మొబైల్ ఆన్ చేసాడు. ఇరవై ఏడు మెసేజీలు వెయిటింగ్. వాటిలో తనకి బాగా నచ్చిన ఎస్సెమ్మెస్స్ తన బడ్డీ రామకోటేశ్వర్రావు అలియాస్ రాక్ నుంచి:ఫేస్ బుక్ లో నా స్టేటస్ నచ్చక పోతే లైక్ చెయ్యి, నచ్చితే షేర్ చెయ్యి, ఏదీ కాకపోతే కామెంట్ చెయ్యి. వెంటనే ఫేస్ బుక్ లో వాడి స్టేటస్ చూసాడు.
"ఫోన్ లో ఫేస్ బుక్ చూసుకుంటూ  నడుస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళ ఆరడుగుల గోతి లో పడ్డా హిహిహి" ఇదీ వాడి  స్టేటస్. వెంటనే లైక్ చేసి, కామెంటి, వీడిని ఎవరైనా పైకి తీశారో లేదో అనుకుని, తీస్తే వాడే స్టేటస్ అప్డేట్ చేస్తాడ్లే అనుకుంటూ మళ్ళీ టివి పై దృష్టి సారించాడు.
  • శోకిని టివి: విస్తరాకులు కాంపిటీషన్ - విస్తరాకులు సీరియల్ కోటి ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ రోజు ఎపిసోడ్ లో హీరోయిన్ ఏడుస్తూ  కాఫీ కలుపుతున్నప్పుడు ఎన్ని కన్నీటి చుక్కలు కప్పులో పడ్డాయి? మీ సమాధానాన్ని ఫలానా నెంబర్ కి పంపండి ఆ కప్పు ని గెలుచుకోండి.
              ఈ రోజు మన సమాజం లో చాలా మంది వెర్బల్ డయేరియా (నోరు పారేసుకోవడం) అనే వ్యాధి తో బాధ పడుతున్నట్లు అనిపిస్తోంది. మాట ని ఇష్టం వచ్చినట్లు వాడడం పరిపాటి అయ్యింది. పంచ్ డైలాగు (మాట) ల వల్ల రేంజి పెరిగిన హీరోలున్నారు అలానే మాట వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళూ వున్నారు. మాటల యుద్ధాల్ని ప్రసారం చేసే చానెళ్ళ రేటింగులు పెరుగుతున్నాయి. టివి, ఇంటర్నెట్ , సోషల్ నెట్ వర్క్స్, ఫోన్ ఇలా అన్నీ ఈ మాటలని మనకు చేరుస్తున్నాయి. 
               జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ,  జిహ్వాగ్రే మిత్ర బాంధవా:, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి:, జిహ్వాగ్రే మరణం ధ్రువం                         
              మాట మనిషి కి మాత్రమే వున్న శక్తి. మాట వల్ల ఏమైనా సాధించవచ్చు. దురదృష్ట వశాత్తూ మాట ని ఎలా వాడుకోవాలో, వాడుకోకూడదో చెప్పే చదువులు  ఈనాడు మనకు లేవు.
            సులభా: పురుషా రాజన్ సతతం ప్రియవాదిన: | అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ:||                               
          మారీచుడు రావణుడి తో అన్నట్లు, ప్రియమైన మాటలు చెప్పేవాళ్ళు సులభం గానే దొరుకుతారు, కాని మంచి మాటలు చెప్పే వాళ్ళు అంత సులభం గా దొరకరు, దొరికినా వినేవాళ్ళు వుండరు.