హోమ్

27, ఆగస్టు 2015, గురువారం

మేడిపళ్ళు

"ఏమిటో నీకొచ్చిన కష్టం?" అడిగాడు గోపాల్. ధన్వి ఎప్పటిలా లేడు ఈరోజు.
"ప్రస్తుత దేశ పరిస్థితి చూసి..." నసిగాడు ధన్వి
"దేశానికేం నూతనోత్సాహం తో వెలిగిపోతుంటేను?" అర్ధం కానట్లుగా అన్నాడు గోపాల్.
"మూడేళ్ళ పసి పిల్లల నుంచి అరవై ఏళ్ళ వృద్ధురాళ్ళ వరకూ స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి ఏమైనా  ఆలోచించావా?" అడిగాడు ధన్వి.
"ఈ మధ్య సోషల్ మీడియా చూసావా?"
ఏమీ అర్ధం కానట్లు మౌనం గా వున్నాడు గోపాల్.
"మేమిలాగే వుంటాం మీ మగ పిల్లలకి ఆడవాళ్ళని గౌరవించడం నేర్పండి అని ఒక వర్గం, ఆడవాళ్ళ ప్రవర్తనా, వస్త్రధారణా సంప్రదాయ బద్ధంగా ఉండాలి అని ఒక వర్గం ఏర్పడ్డాయి గమనించావా?"
ఊ అన్నాడు గోపాల్.
"మరి నీకు నిద్దరెలా పడుతోంది?"ఎదురు ప్రశ్నిచాడు ధన్వి.
చిర్రెత్తుకొచ్చింది గోపాల్ కి. "దీనికీ నిద్ర కీ  సంబంధం ఏమిటి?" అన్నాడు.
"నేను సోషల్ యాక్టివిస్టు నని నీకు తెలుసు గా,"
నవ్వాపుకోలేక పైకే నవ్వేసాడు గోపాల్.
సోషల్ యాక్టివిస్టు అంటే జనాల్లోకి వెళ్ళి సేవ చెయ్యాలి గాని, ఈ మధ్య  ఫేసుబుక్కులోనో, ట్విట్టర్ లోనో మెసేజీలు షేర్ చెయ్యటం కూడా సోషల్ సర్వీసు కిందే లెక్కించుకొంటున్నారు కొందరు. ఆమధ్య ఫాదర్స్ డే నాడు తండ్రి తో సెల్ఫీ తీసుకుని ఫేసుబుక్కు లో పెట్టనివాడు మనిషే కాదన్నాడు ధన్వి. అలాంటివాడు ఇప్పుడు సోషల్ సర్వీసంటున్నాడు. అసలు ధన్వి ఇలా సామాజిక స్పృహ తో మాట్లాడడమే కొత్తగా వుంది.
"వింటున్నావా?" విసుగ్గా అడిగాడు ధన్వి.
"ఇంతకీ ఏమంటావ్?" అంతే విసుగ్గా అడిగాడు గోపాల్.
"ఏముందీ, ఈ రెండు వర్గాల్లో దేని తరపున పోరాడాలో తేల్చుకోలేకుండా ఉన్నా" అన్నాడు.
"రెండు వర్గాల లక్ష్యం ఒకటే ఐనప్పుడు ఏదయితేనేం?"
"అక్కడే వచ్చింది చిక్కు. ఒక వర్గాన్ని మోరల్ పోలీసని, మరొకదాన్ని ఫెమినిజం అనీ అంటున్నారు. రెండింటిలో ఏది మంచిదో చెబుతావని."
"అది తేల్చడానికి నువ్వూ నేనూ సరిపోం."
"మరి సమస్యకి పరిష్కారం లేదా?"
"లేకేం, భేషుగ్గా ఉంది.మళ్ళీ ఏ మహాపురుషుడో, మహిషాసురమర్ధనో అర్జెంటుగా అవతరించి,మహాద్భుతం చేసేసి, మగవాళ్ళ బుద్ధుల్ని మార్చి, స్త్రీ జనోద్ధరణ చేయవలసిందే." కాస్త వ్యంగ్యంగానే అన్నాడు గోపాల్.
అతగాడి ధోరణికి విస్తుపోయిన ధన్వి, "అంటే సోషల్ మీడియా లో మేం చేస్తున్నదంతా వృధా అంటావా?"
"లేదు. మీరు మంచి పనే చేస్తున్నారు, కానీ దానివల్ల మాత్రమే సమస్య పరిష్కారం కాదనే నాబాధ. తరతరాలుగా మనలో ఇంకి పోయిన మన సంస్కృతి మూలాల్లోనే పరిష్కారం దొరకొచ్చు. మన పురాణేతిహాసాల్ని మనం ఎప్పుడూ నెగెటివ్ గానే చూస్తున్నాం. వాటిలో పరస్త్రీ తల్లితో సమానం అని ఎన్నో సార్లు చెప్పారు.” 
"మొదలెట్టావా? సంస్కృతి, పురాణాలూ అని, ఇప్పటికిప్పుడు ఇవన్నీ అయ్యే పనులేనా" అన్నాడు వెటకారంగా.
"అందుకే మహాధ్భుతం జరగాలని అన్నా."
"రెండ్రోజుల్లో ఇద్దరిదీ ట్విట్టర్ లో ట్రెండింగుంది, ఏదోకటి తేలుస్తావని"
"పొద్దుటే ఏదోకటి చెబుతా బెంగెట్టుకోక"ని హామీ ఇచ్చి బయల్దేరాడు గోపాల్.
. . . . . . . . . . . . .

రాత్రంతా ఈ అలోచన తోనే నిద్ర లేకుండా గడిపాడు గోపాల్. హఠాత్తుగా ఎవరో పిలిచినట్లై లేచి చూసాడు. ఎదురుగా ఎవరో కనపడేసరికి కళ్ళు నులుముకుని మళ్ళీ చూసాడు. వీడెవడో సరా సరి ఇంట్లోకి జొరబడి, తననే పిలుస్తున్నాడు. ఒక్క ఉదుటున అతగాడి మీదకు దూకబోయాడు కాని కదలలేక పోతున్నాడు.
"మహాద్భుతం జరగాలన్నావుగా, చేద్దామని వచ్చాను, చెప్పు ఏం చెయ్యమంటావో" అన్నాడు ఆ సాధువు.
"ఎవరు మీరు?" అనుమానంగా అడిగాడు గోపాల్.
"అనవసరమైన ప్రశ్నల జోలికి పోక నన్నెందుకు రమ్మన్నావో అది చెప్పు" తొందర పెట్టాడు.
అతడి ముఖం, వర్చస్సు చూసి ఎవరో కారణ జన్ముడై వుంటాడనుకొని,
"స్వామీ, స్త్రీ పురుషులిద్దరూ అవే పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సప్త ధాతువులు, నవ రంధ్రాలతో సృష్టించబడ్డారు కదా, శరీర నిర్మాణం లో ఉన్న చిన్న చిన్న తేడాలవల్ల స్త్రీలు ఎంత హింస పడుతున్నారో చూడు, ఇలా ఎందుకు జరుగుతోంది?"

"ఎందుకో చెప్పడం నా వల్ల కూడా కాని పని, ఆ రహస్యాలని తెలుసుకోవడానికి నా తపోబలం సరిపోదు. ఇప్పుడు నానుంచి ఏమి కావాలో అది చెప్పు," అదిలించాడు సాధువు.
"స్త్రీలు ఈ అత్యాచారాలు, వేధింపులు రూపం లో పడుతున్న చిత్రహింస తగ్గే మార్గం కావాలి, అదీ వేద ప్రామాణికం గా జరిగి పోవాలి" అడిగాడు గోపాల్.

"తథాస్తు" అని మాయమైపోయాడు సాధువు.
………………………………...

కామేష్ కి స్వాతిని చూసినప్పటి నుంచీ ఒకటే కంగారుగా ఉంది. రోజూ ఈపాటికి ఆ అమ్మాయి చూసేలా వందసార్లయినా వెకిలి చూపులు చూసేవాడు. పదయినా రెండర్ధాల జోకులు వాట్సాప్ లో పంపేవాడు. ఇప్పటికే రెండు సార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది. భార్యా బిడ్డలు కలవాడివని ఊరుకుంటున్నాను ప్రవర్తన మార్చుకో అని. ఇహ ఇవాళో రేపో బెట్టు విడిచి తన వత్తిడి కి లొంగిపోతుందిలే అనుకుంటుండగా ఉన్నట్టుండి ఇవేమీ చేయాలనిపించలేదివ్వాళ. ఇన్నాళ్ళ తన ప్రవర్తనకి క్షమాపణ చెప్పాలనిపిస్తోంది.గోపాల్ పనే అయ్యుంటుంది, వెంటనే వెళ్ళి అడగాలి.

………………………

మాణిక్యం ఆవేళ పనిలోకి వచ్చినవెంటనే, ఆ ఇంటి పెద్ద రంగారావు మాణిక్యం కాళ్ళమీద పడి క్షమాపణ అడిగాడు. రెణ్ణెల్లక్రితం ఇక్కడ పనికి కుదిరినప్పటినుంచీ ఆరు పదుల వయసు దాటిన రంగారావు డబ్బు ఆశ చూపాడు, బెదిరించాడు, బుజ్జగించాడు ఒక మగ దిక్కు లేని ఆడదాన్ని లోబర్చుకోవడానికి ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తునే వున్నాడు, ఇంకో పని దొరికేవరకూ ఓపిక పట్టాలని ఓర్చుకుంది గానీ, లేకపోతే ఈ పని వదిలేసి ఎప్పుడో పారి పోయేది తను. ఏమైందీ మనిషికి, ఇంతలోనే అంత మార్పు? గోపాల్ బాబు గారు బగమంతుడు ఎంటనే ఎల్లి దన్నమెట్టాల.
…………………………….

ఊరి సెంటర్లోకి రాగానే సరిత గుండె వేగంగా కొట్టుకుంటుంది. ట్యూషన్ కి వెళ్ళాలంటే అటు వైపునుంచే పోవాలి. ఆ పూర్ణా గాడు మిగతా గాడిదల తో సహా ఈ టైముకి కాపు కాస్తూ ఉంటాడు తన కోసం. ఆర్నెల్లనుంచీ నమిలేస్తున్నాడు వాడు ప్రేమించమని, తండ్రి రైతు కూలీ అయినా, ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు తనని, వీడి మూలం గా ఇప్పుడు దినదిన గండం గా మారిపోయింది తన చదువు.నిన్ననే లాస్టు వార్నింగు ఇచ్చాడు, ఈ రోజు సరే అని చెప్పమని. తనకిష్టం లేదు, కాదంటే వాడు ఏమైనా చేస్తాడనే భయం.అంతలో వాడే ఎదురుగా వచ్చి క్షమించమని అడుగుతున్నాడు. గోపాల్ ఎంత మంచివాడు.వెంటనే థాంక్స్ చెప్పాలి.
………………………………...
మాయ కి అంతా గందరగోళం లా వుంది ఈ రోజు. తన క్రీగంటి చూపు కోసం తహతహ లాడుతూ, తన ఖర్చులన్నీ భరిస్తూ, జల్సా గా తిప్పడానికి రెడీ గా వుండే ఒక్క వెధవ కూడా కన్నెత్తి చూడతం లేదు తనని. నిన్నటి దాకా తనతో ఒక్క రాత్రి గడపడానికి ఆఫర్ల మీద ఆఫర్ లు ఇచ్చిన కిరణ్ గాడు ఇప్పుడు వచ్చి రాఖీ కట్టమంటున్నాడు. ఇది ఆ గోపాల్ గాడి పనే అయ్యుంటుంది. తన్నాలి వెధవని తన ఎంజాయ్‌మెంటు పాడు చేసినందుకు.
………………………………...
వర్ధనమ్మ కి దిన దిన గండలా ఉంది బ్రతుకు. రెండేళ్ళయ్యింది తను మంచం పట్టి. బిడ్డలందరూ విదేశాల్లో సెటిలయ్యి తన బాగోగులు చూడడానికి ఒక నర్సు ని పెట్టారు. ఆ ఆడ నర్సు వున్నన్నాళ్ళూ బానే ఉండేది, ఇప్పుడు కొత్తగా వచ్చిన మగ వెధవ తన వయసునీ, ఆరోగ్య పరిస్తితినీ  కూడా చూడకుండా .. ఛి ఛీ తల్చుకుంటేనే అసహ్యం గా ఉంది. ఈరోజు వాడంతట వాడే వచ్చి తన కాళ్ళకి దణ్ణం పెట్టి క్షమించమంటున్నాడు. గోపాల్ ఎంత మంచి వాడు!
………………………………...
ఎమ్మెల్యే ఏడుకొండలు అవినీతి నిర్మూలన అనే అంశం పై అనర్గళంగా ప్రసంగించి ఫాం హౌసుకొచ్చేసరికి, ఫలానా కార్పొరేటు కంపెనీ వాళ్ళు తమకి కాంట్రాక్టు ఇప్పించినందుకు బదులుగా తనడిగిన సొమ్ములతోపాటు, తను ముచ్చటపడిన సెలబ్రిటీ మోడల్ ని కూడా రెడీ గా ఉంచారు. కానీ, ఈ రోజు ఎప్పటిలా లేదు, మనసు అపరాధనా భావంతో కృంగి పోతోంది ఆ అమ్మాయిని చూడగానే. వెంటనే పంపిచేసాడు. ఆ గోపాల్ గాడి వల్లనే ఇదంతా.. వాడిని ఏదైనా  కేసులో ఇరికించెయ్యాలి, కసిగా అనుకున్నాడు ఏడుకొండలు. 
………………………………...
హోంమినిస్టరు ఈ రోజు ప్రశాంతం గా నిద్ర పోయాడు. ఆడవాళ్ళ మీద ఘోరాలు పెరిగిపోతుండడం తో ఏ రోజు ఏమి వినాల్సి వస్తుందో అనే గాభరా తో సరిగ్గా నిద్ర పట్టేది కాదు. గోపాల్‌కి ఏదైనా అవార్డు ఇప్పించాలి. మనస్ఫూర్తిగా అనుకున్నాడు ఆయన.
………………………………...
పే....ద్ద సభ. ముఖ్యమంత్రి దగ్గర్నుంచీ ప్రముఖులంతా కొలువు దీరారు. వాళ్ళంతా గోపాల్‌కి సన్మానం చేసేందుకే సభ చేసేరు. గోపాల్ తన ప్రసంగం లో ధన్వి ని ఎంతగానో పొగిడేడు.  అసలు ధన్వి వల్లనే తనకి ఆ సాధువు కనపడ్డాడనీ, తనకు మగ వాళ్ళ బుధ్ధి మారే లా వరం ఇచ్చాడనీ జరిగిందంతా చెప్పుకొచ్చేడు. ఈ క్రెడిటంతా ధన్వికే దక్కాలని ప్రకటించాడు కూడా. 
………………………………...

తలుపులు ఒక్కటే చప్పుడు. ఎవరో బాగా బాదుతున్నారు. బయటంతా కోలాహలం గా వున్నట్లుంది. ఇంత రాత్రి వేళ ఏమై ఉంటుందా అనుకుంటూ కిటికీ లోంచి చూసి, అదిరిపడ్డాడు గోపాల్. బయట కొన్ని వేల మంది ఆడవాళ్ళు, చిన్న పెద్దా, వయోభేదం లేకుండా తనని చూడడానికి వచ్చారు.ఇంతలోనే వాళ్ళంతా తలుపులు పగలగొట్టుకొచ్చి, తనకి కృతజ్ఞతలు చెబుతున్నారు. దండలూ, పుష గుచ్ఛాలతో ముంచెత్తుతున్నారు. మరో వైపు నుంచి కొంత మంది ఆడా మగా కూడా తనని తన్నడానికన్నట్లు మీదకొస్తున్నారు. ఆ ఉక్కిరిబిక్కిరికి ఊపిరాడక దిగ్గున లేచాడు.
………………………………...
ఇదంతా కలా??

పొద్దున్నే హడావిడిగా వచ్చాడు ధన్వి. కంగారుగా, ఆందోళన గా కూడా ఉన్నాడు. "రాత్రి షిప్ట్ లో ఏమైనా గొడవ అయ్యిందా" అడిగాడు గోపాల్.
"నేను ఎంతో కాలంగా డేటు కి రమ్మని అడుగుతున్న కీర్తనకి ఫైనల్ వార్నింగు ఇచ్చేసాను. ఒప్పుకోకపోతే లాస్ట్ మంత్ పార్టీలో నాతో క్లోజు గా ఉన్న ఫోటో లు ఫేసుబుక్కు లో పెడతానని బెదిరించా.చాలా అప్‌సెట్ అయినట్లుంది.ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని భయంగా ఉంది." అసలు విషయం బయటపెట్టాడు ధన్వి.
"ఇలా బెదిరించడం,భయపెట్టడం కూడా సోషల్ సర్వీసేనా?" వెటకారంగా అడిగాడు గోపాల్.
"మరి ట్విట్టర్ ట్రెండింగు సంగతో" గుర్తు చేశాడు గోపాల్.
ధన్వి నుంచి ప్రతిస్పందన లేదు.
"నిన్న నువ్వు మట్లాడిన తర్వాత, నీకు ఇంత సామాజిక స్పృహ ఉన్నందుకు చాలా గర్వ పడ్డాను.  కానీ నువ్వు ఆ నేరగాళ్ళకి తీసిపోని విధంగా ప్రవర్తించావు. సమాజాన్ని మర్చాలంటే , మారాల్సింది మనమే. వెంటనే వెళ్ళి కీర్తనకి క్షమాపణ చెప్పు.” అన్నాడు గోపాల్.
సిగ్గు తో తల దించుకున్నాడు ధన్వి.
కొసమెరుపు:

మేడిపళ్ళు చూడడానికి అందంగా ఉంటాయి, లోపల పురుగులుంటాయి. మనలో కూడా చాలా మంది సామజిక మాధ్యమాల్లో ఉన్నత భావాలూ, ఆదర్శాలూ వల్లిస్తూ తమ దాకా వస్తే మాత్రం స్వార్ధభావంతో ఉంటారు. మనలోని అలాంటి ఒక మేడిపండే ఈ ధన్వి. సమాజం లో మార్పు రావాలంటే అది మన తోనే మొదలవ్వాలి అని చెప్పటమే ఈ టపా లక్ష్యం.

రేప్ మాత్రమే కాదు ,పైన ఉదహరించిన విషయాలు కొన్ని కొంతమందికి చాలా చిన్న విషయాల్లా అనిపించినా, అవి కూడా పెద్ద నేరాలే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి