జ్ఞాపకాల తోటలో పూసే ప్రతి పువ్వూ
నీకోసం ఎదురు చూస్తూంటుంది.
బ్రతుకు బాటలో ఎదురయ్యే ప్రతి మలుపులోనూ
కన్ను నిన్ను వెతుక్కుంటుంది.
స్నేహమంటే ఇంటర్నెట్టో, ఫేస్ బుక్కో కాదని
టెక్నాలజీ వెక్కిరిస్తోంది.
రాకెట్ యుగమైనా, రాతి యుగమైనా
మనిషే నేస్తమని మనసుచెబుతోంది.
గ్లోబల్ విలేజీలో, అరచెయ్యంత ప్రపంచంలో
విజయాలని వెతుక్కుంటూ,
పోగొట్టుకున్నదేమిటో తెలియనట్టు
అలవోకగా నటించేస్తూ,
అలుపెరుగని పరుగులు తీస్తూ
ఇంకా ఈప్లాస్టిక్ గుండెకొట్టుకుంటూనే ఉంది.
అప్పుడు తిరిగిన పొలం గట్లూ,
సందులో ఆడిన గల్లీ క్రికెట్టూ,
ఊరి కాల్వలో కొట్టిన ఈత,
స్కూలి స్టేజి పై పాడిన పాటా,
తీరిక దొరకని కాలం తెచ్చిన
డిమెన్షియా నడ్డివిరగ్గొట్టి
ఉప్పెనలా ఉరికివచ్చేగతస్మృతుల వెల్లువలో
మనదారులు మళ్ళీ కలవాలనే
ఆశ చిగురిస్తూనే ఉంటుంది.
చీకటికి అలవాటు పడ్డ హృదయంలో
నీ చిరునవ్వు మిణుగురు లా వెలుగుతూనే ఉంటుంది.
స్నేహానికి మొదలే కానీ చివర లేదంటూ,
ఆకాశం జోల పాడుతూనే ఉంటుంది.